ETV Bharat / sports

పాపం రోహిత్​.. ఇలా జరగడం ఇదే తొలిసారి!

author img

By

Published : May 22, 2022, 9:53 AM IST

IPL 2022 Playoffs: శనివారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ ఓడిపోవడం వల్ల ప్లే ఆఫ్స్​ చేరిన జట్లపై స్పష్టత వచ్చేసింది. కాగా, ఈ మ్యాచ్​లో ఓ యాదృశ్చిక ఘటన చోటు చేసుకుంది. దీంతో పాటే కెప్టెన్​ రోహిత్​ శర్మ ఓ పేలవ రికార్డును, యువ ఆటగాడు తిలక్​ వర్మ ఓ సూపర్​ రికార్డును నమోదు చేశారు. అవేంటో తెలుసుకుందాం..

IPL 2022 Playoff rohith sharma
ఐపీఎల్ 2022 రోహిత్ శర్మ

IPL 2022 Playoffs: ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్​ బెర్తులపై క్లారిటీ వచ్చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్​లో 5 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్​ గెలవడం వల్ల దిల్లీ క్యాపిటల్స్​ ప్లే ఆఫ్స్​ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్సీబీకి లైన్​ క్లియర్​ అయింది. మొత్తంగా గుజరాత్​ టైటాన్స్​, రాజస్థాన్​ రాయల్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్​కు చేరాయి. నేడు(ఆదివారం) లీగ్​ దశ మ్యాచులు ముగియనుండగా.. మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్​ మ్యాచులకు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో టాప్​-2లో ఉన్న గుజరాత్​-రాజస్థాన్​ మధ్య మంగళవారం రాత్రి 7.30 గంటలకు కోల్​కతా గార్డెన్స్​ వేదికగా క్వాలిఫయర్​-1 మ్యాచ్​ జరగనుండగా.. అక్కడే బుధవారం రాత్రి 7.30 గంటలకు లఖ్​నవూ-ఆర్సీబీ మధ్య ఎలిమినేటర్​ మ్యాచ్​ జరగనుంది.

క్వాలిఫయర్​-1లో గెలిచిన టీమ్​ నేరుగా ఫైనల్​కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఫైనల్​చేరేందుకు క్వాలిఫయర్​-2 మ్యాచ్​ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్​లో గెలిచిన టీమ్​తో మ్యాచ్​ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టు.. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 29న(ఆదివారం) జరిగే ఫైనల్​కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ ఫైనల్​ మ్యాచ్​ మాత్రం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

నాలుగేళ్ల క్రితం.. శనివారం జరిగిన మ్యాచ్​లో దిల్లీ గెలిచి ఉంటే కచ్చితంగా ప్లే ఆఫ్స్​ వెళ్లేది. కానీ ఆ జట్టు ఆశలుపై ముంబయి నీళ్లు చల్లింది. దీంతో ఆర్సీబీకి మేలు జరిగింది. అయితే సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే సీన్​ రివర్స్​లో జరిగింది. 2018లో దిల్లీ సీజన్​ను ఆఖరి స్థానంతో ముగించింది. దిల్లీ..​ తమ చివరి మ్యాచ్​ను ముంబయితో ఆడింది. ఆ మ్యాచ్​ రోహిత్​ సేనకు చాలా కీలకం. గెలిస్తే ప్లే ఆఫ్స్​కు చేరుతుంది. ఓడితే రాజస్థాన్​ అర్హత సాధిస్తుంది. తొలుత బ్యాటింగ్​ చేసిన దిల్లీ డేర్​డెవిల్స్​ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబయి 19.3 ఓవర్లలో 163 రన్స్​కే ఆలౌట్​ అయింది. దీంతో ఐదో స్థానంలో నిలిచిన రోహిత్​ సేన టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం దిల్లీయే. అలా నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు బంతి ముంబయి కోర్టులో పడింది. దిల్లీ ప్లేఆఫ్స్​ చేరకుండా అడ్డుకట వేసింది ఎమ్​ఐ. ఆర్సీబీని ప్లే ఆఫ్స్​కు పంపించింది.

రోహిత్ చెత్త రికార్డు.. ఈ మ్యాచ్​లోనూ కెప్టెన్​ రోహిత్​ శర్మ తన పేలవ ప్రదర్శనను​ కొనసాగించాడు. 13 బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 2008లో ఐపీఎల్​ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తొలిసారి సీజన్​లో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. 14 ఇన్నింగ్స్​లో 41,10,3,26,28,6,0,39,2,43,2,18,48,2 పరుగులు చేసి మొత్తం 268 రన్స్​ చేశాడు. కనీసం 300 పరుగులు చేయకుండా రెండో సారి సీజన్​ను ముగించాడు. 2018లో 286 చేశాడు.

తిలక్​వర్మ రికార్డు.. ఇక ఈ మ్యాచ్​లో ముంబయి యువ ఆటగాడు తెలుగు తేజం నంబూరి తిలక్​ వర్మ కొత్త రికార్డు సాధించాడు. డెబ్ల్యూ సీజన్​లో ఒక అన్​క్యాప్​డ్​ ప్లేయర్​గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ సీజన్​లో 14 మ్యాచ్​లాడి 397 పరుగులు చేశాడు. అందులో 29 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో షాన్​ మార్ష్​(2008) 616 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. దేవదత్​ పడిక్కల్​(2020, 473)​, శ్రేయస్​ అయ్యర్​(2015, 439), రాహుల్​ త్రిపాఠి(2017, 391) రెండు, మూడు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికాతో టీ20.. ఉమ్రాన్‌కు ఛాన్స్‌?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.