ETV Bharat / sports

కెప్టెన్లు మారారు.. ఫలితం మారుతుందా? ఐపీఎల్​లో బోణీ కొట్టేదెవరు?

author img

By

Published : Mar 26, 2022, 5:31 AM IST

IPL 2022 CSK vs KKR: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే క్రికెట్​ పండగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్​ 15వ సీజన్​ ఈ రోజే(శనివారం) ప్రారంభం కానుంది. డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​, రన్నరప్​ కోల్​కతా నైట్​రైడర్స్​ మధ్య తొలిమ్యాచ్​ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితేంటో ఓసారి చూద్దాం.!

ipl 2022
csk kkr

IPL 2022 CSK vs KKR: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్‌ పండగ రానే వచ్చింది. సరికొత్తగా అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 15వ సీజన్‌ ముస్తాబైంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి పోరు జరగనుంది. కొత్త జట్ల రాకతో ఈ సీజన్‌ మరింత సందడిగా మారనుంది. గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్ల ఈ రోజు జరుగనున్న ఆరంభ మ్యాచ్‌ ద్వారా.. ఐపీఎల్‌-15వ సీజన్‌కు స్వాగతం పలకనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితేంటో ఓసారి చూద్దాం.!

భారీ మార్పులు వచ్చాయి.. శనివారం ప్రారంభం కానున్న ఐపీఎల్‌- 15వ సీజన్‌లో భారీ మార్పులు వచ్చాయి. కొత్తగా రెండు జట్లు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనుండగా.. కొంత మంది ఆటగాళ్లు జట్లు మారారు, జట్ల కెప్టెన్లు మారారు. ఇటు చెన్నై, అటు కోల్‌కతా ఇరు జట్లు కొత్త కెప్టెన్లను నియమించాయి. గత సీజన్‌లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్‌ మోర్గాన్‌ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి బాధ్యతలు అప్పగించింది. ఇటు చెన్నై కెప్టెన్‌ ధోనీ కూడా అనూహ్య నిర్ణయం తీసుకుని ఆల్ రౌండర్‌ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల పరిస్థితేంటో ఓసారి చూద్దాం.!

ఆ ఒక్కటి తప్ప.. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మినహా చెన్నై జట్టులో పెద్ద సమస్యలేం కనిపించడం లేదు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిన సీఎస్​కే.. ఈ సారి కూడా అదే ఉత్సాహంతో మరో టైటిల్‌పై కన్నేసింది. ఈ జట్టులో దాదాపు అందరూ పాత ఆటగాళ్లే ఉండటం కలిసొచ్చే అంశం. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్‌ కాన్వే ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్‌ డౌన్‌లో మొయిన్ అలీ ఆడతాడు. అంబటి రాయుడు, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావోలతో మిడిలార్డర్‌ బలంగా కనిపిస్తోంది. డ్వెయిన్‌ ప్రిటోరియస్‌, శివమ్‌ దూబె వంటి హిట్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఆడమ్‌ మిల్నె, మహేశ్ తీక్షణ, రాజవర్థన్ హంగార్గేకర్‌ తదితరలతో పేస్‌ విభాగం మెరుగ్గానే ఉంది. అయితే, వీసా సమస్యలతో తొలి మ్యాచ్​కు ఇంగ్లాండ్ ఆటగాడు మెయిన్‌ అలీ దూరం కానున్నాడు. మరోవైపు, వేలంలో భారీ ధర పలికిన దీపక్‌ చాహర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది.

జడేజా
రవీంద్ర జడేజా

రెట్టించిన ఉత్సాహంతో కేకేఆర్.. చెన్నై జట్టులాగే కోల్‌కతా కూడా అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో దుబాయి వేదికగా జరిగిన మలి దశ ఐపీఎల్‌లో వరుస విజయాలతో ఫైనల్ చేరిన కోల్‌కతా జట్టు.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ సారి కొత్త కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ సారథ్యంలో ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్-2020 సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్.. దిల్లీని ఫైనల్‌కి తీసుకెళ్లాడు. అయితే, ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తుదిపోరులో దిల్లీ ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. శ్రేయస్‌కు కెప్టెన్సీ అనుభవంతో పాటు.. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు, గత సీజన్‌లో గొప్పగా రాణించిన వెంకటేశ్ అయ్యర్‌.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటాడు. వీరితో పాటు నితీశ్‌ రాణా, సామ్‌ బిల్లింగ్స్‌లతో పాటు.. ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ వంటి ఆల్‌ రౌండర్లు ఉండటం కేకేఆర్‌కు సానుకూల అంశం. పాట్ కమ్మిన్స్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్ యాదవ్‌, శివమ్ మావి, చమిక కరుణరత్నెలతో పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. వరుణ్‌ చక్రవర్తి, మహమ్మద్ నబి వంటి స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు.

శ్రేయస్ అయ్యర్‌
శ్రేయస్ అయ్యర్‌

ముఖాముఖి పోరులో చెన్నైదే పైచేయి.. కోల్‌కతా జట్టుపై సీఎస్​కేకు గొప్ప రికార్డు ఉంది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడగా.. 17 మ్యాచుల్లో చెన్నై, 8 మ్యాచుల్లో కేకేఆర్ గెలుపొందాయి. మరో మ్యాచులో ఫలితం తేలలేదు. ఇదిలా ఉండగా, గత సీజన్‌లో మొత్తం మూడు సార్లు (లీగ్ దశలో రెండు మ్యాచులు+ఫైనల్) ఇరు జట్లు తలపడగా.. మూడింట్లోనూ చెన్నైపై చేయి సాధించింది.

ఐపీఎల్​
సీఎస్​కే అభిమానులు

25 శాతం మందికి.. చాలా రోజుల తర్వాత మైదానాల్లో అసలు సిసలైన క్రికెట్ మజా కనిపించనుంది. కరోనా కారణంగా గత సీజన్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానాల్లోనే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి పరిస్థితి కుదుటపడటంతో.. మొత్తం స్టేడియం సామర్థ్యంలో 25 శాతం మందికి అనుమతించేందుకు బీసీసీఐ అంగీకరించింది. దీంతో ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో మైదానాలకు కళ రానుంది. ఆటగాళ్లు అదే స్థాయిలో రెచ్చిపోయి ఆడుతూ.. అభిమానులను అలరిస్తారేమో చూడాలి.!

ఇదీ చదవండి: ఐపీఎల్​కు వేళాయెరా.. 10 జట్లతో ఈసారి మరింత కొత్తగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.