ETV Bharat / sports

రూసో శతక మోత.. మూడో టీ20లో సఫారీల ఘన విజయం.. టీమ్ఇండియాకు పరాభవం

author img

By

Published : Oct 4, 2022, 10:53 PM IST

INDIA SOUTH AFRICA T20 SERIES
INDIA SOUTH AFRICA T20 SERIES

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్​లోని ఆఖరి మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘోర పరాభవం పాలైంది. మ్యాచ్​ ఓడిపోయి సిరీస్​.. క్వీన్​స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. కాగా, మూడో టీ20లో సఫారీ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది

దక్షిణాఫ్రికాతో సిరీస్​లో నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్​ ఇండియా చేతులెత్తేసింది. మూడో టీ20లో 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్లీన్​స్వీప్ అవకాశాన్ని చేజార్చుకున్న భారత్​.. 2-1తో సిరీస్​ను ముగించింది. ఇండోర్‌ వేదికగా జరిగిన మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న టీమ్ ఇండియాకు.. మొదటి నుంచే చుక్కలు చూపించారు సఫారీ బ్యాటర్లు. ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డారు. దీంతో భారత్‌ ఎదుట దక్షిణాఫ్రికా 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌండరీ లైన్‌ చిన్నది కావడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. మరీ ముఖ్యంగా గత రెండు మ్యాచుల్లో విఫలమైన రిలీ రూసో 48 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మరోవైపు, ఓపెనర్‌ క్వింటన్ డికాక్ 43 బంతుల్లో 68 పరుగులతో జోరు కొనసాగించాడు. ట్రిస్టన్‌ స్టబ్స్ 23 పరుగులు, డేవిడ్ మిల్లర్ 4 బంతుల్లో 19 పరుగులు చేసి దూకుడుగా ఆడారు. బవుమా విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్, దీపక్ చాహర్ చెరో వికెట్‌ తీశారు.

చెలరేగిన రూసో-డికాక్‌
బవుమా కేవలం 3 పరుగులు చేసి విఫలమైనప్పటికీ.. రూసోతో కలిసి డికాక్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. డికాక్‌ ఉన్నంత వరకు కాస్త ఆచితూచి ఆడిన రూసో ఆ తర్వాత చెలరేగిపోయాడు. డికాక్‌ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టబ్స్‌తో కలిసి రూసో వీర విహారం చేశాడు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును 200 పరుగులు దాటించడంతోపాటు శతకం పూర్తి చేసుకొన్నాడు. ఇదే అతడికి తొలి సెంచరీ కావడం విశేషం. చివర్లో డేవిడ్ మిల్లర్‌ కూడా ధాటిగా ఆడి వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు.

తొలి నుంచే తడబాటు..
భారీ లక్ష్యం 227 పరుగులతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా మొదటి నుంచే తడబడింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్​ రోహిత్ శర్మ డక్​ ఔట్​ అయ్యాడు. రెండో ఓవర్లో వచ్చిన శ్రేయస్​ అయ్యర్​ కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్​ చేరాడు. దీంతో టీమ్ ఒత్తిడిలో పడింది. అనతంరం వచ్చిన రిషభ్ పంత్ స్కోర్​ బోర్డును కాస్త పరుగులు పెట్టించాడు. 14 బంతుల్లో 27 పరుగులు చేసి 45 పరుగుల వద్ద ఔట్​ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తిక్​ బ్యాట్​కు పని చెప్పి.. ఒత్తిడిలోంచి బయటపడేశాడు. 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఆకట్టుకోలేదు. దీంతో భారత్ పని అయిపోయింది. సూర్య కుమార్​ యాదవ్ 6 బంతుల్లో 8 పరుగులు, అక్షర్ పటేల్ 8 బంతుల్లో 9 పరుగులు, అశ్విన్ 4 బంతుల్లో 2 పరుగులు, దీపక్​ చాహర్​ 17 బంతుల్లో 31 పరుగులు, ఉమేశ్ యాదవ్ 17 బంతుల్లో 20 పరుగులు, మహమ్మద్​ సిరాజ్​ 7 బంతుల్లో 5 పరుగులు చేశారు. దీంతో భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.