ETV Bharat / sports

IND Vs WI 3rd ODI : చిత్తుగా ఓడిన విండీస్​.. వన్డే సిరీస్‌ టీమ్‌ఇండియాదే.. వరుసగా 13వసారి..

author img

By

Published : Aug 2, 2023, 6:25 AM IST

Updated : Aug 2, 2023, 6:43 AM IST

IND Vs WI 3rd ODI
IND Vs WI 3rd ODI

IND Vs WI 3rd ODI : వెస్టిండీస్​తో జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య జట్టును టీమ్​ఇండియా 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ను భారత్​ సొంతం చేసుకుంది.

IND Vs WI 3rd ODI : టీమ్​ఇండియా.. కీలక మూడో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌ జట్టును200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ను భారత్​ సొంతం చేసుకుంది. రెండో వన్డేలో ప్రయోగాలు చేసి ఓటమిపాలైన టీమ్‌ఇండియా.. మూడో వన్డేలో మాత్రం అదే వ్యూహాంతో బరిలోకి సక్సెస్‌ అయింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లకు 351 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్​ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. విండీస్‌కు టీమ్​ఇండియా బౌలర్​ ముకేశ్‌కుమార్‌ వరుస షాక్‌లు ఇచ్చాడు. మొదటి మూడు వికెట్లు అతడి ఖాతాలోనే చేరాయి. తొలి ఓవర్‌లో బ్రెండన్ కింగ్ (0) వికెట్ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ముకేశ్ తన తర్వాతి ఓవర్‌లో కైల్ మేయర్స్‌ (4)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత షై హోప్ (5)ను కూడా ఔట్‌ చేసి విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. హోప్‌.. శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కార్టీ (6) ఉనద్కత్‌ బౌలింగ్‌లో గిల్‌కే చిక్కాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్‌మయర్‌ (4)ను శార్దూల్ ఠాకూర్‌ పెవిలియన్​కు పంపాడు. రొమారియో షెఫర్డ్ (8) శార్దూల్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. బౌండరీ లైన్‌ వద్ద ఉనద్కత్ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో షెఫర్డ్ పెవిలియన్‌ చేరాడు. దీంతో విండీస్‌ 50 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత నిలకడగా ఆడిన అథనేజ్‌, కరియాలను కుల్‌దీప్‌ యాదవ్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేశారు. దీంతో విండీస్‌ 88/8 స్కోరుతో నిలిచి వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అల్జారీ జోసెఫ్‌, గుడాకేష్‌ మోటీ భారత బౌలర్లను కాసేపు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆ జట్టు స్కోరు 150 దాటింది. ముకేశ్ కుమార్‌ బౌలింగ్‌లో జోసెఫ్‌ ఓ సిక్స్‌ కొట్టగా.. జడేజా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. శార్దూల్ ఠాకూర్‌ వేసిన 34వ ఓవర్‌లో జోసెఫ్.. ఇషాన్‌ కిషన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సీల్స్‌ (1) కూడా శార్దూల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరడంతో విండీస్‌ ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ (4/37), ముకేశ్ కుమార్‌ (3/30 ), కుల్‌దీప్‌ యాదవ్ (2/25) విండీస్​పై విజృంభించారు.

స్టార్లు ప్లేయర్లు లేకపోయినా..
టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా.. స్టార్​ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగినా భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్‌ కిషన్‌ (77) ఫామ్‌ను కొనసాగిస్తూ దుమ్మురేపాడు. వరుసగా మూడో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అందుకున్నాడు. అయితే మొదటి రెండు వన్డేల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన శుభ్‌మన్‌ గిల్ (85) ఈ సారి భారీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అందుకున్నాడు. సంజు శాంసన్ (51), హార్దిక్‌ పాండ్య (70*) కూడా అర్ధ శతకాలతో చెలరేగారు. హార్దిక్‌.. ఆఖర్లో విధ్వంసం సృష్టించి భారత్‌కు అనూహ్యమైన స్కోరునందించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (35) ఫర్వాలేదనిపించాడు. విండీస్‌ బౌలర్లలో షెఫర్డ్ 2, కరియా, జోసెఫ్‌, మోటీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

రెండో అతి పెద్ద విజయం..
2 వన్డేల్లో వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం (పరుగుల పరంగా). 2018లో కరీబియన్‌ జట్టుపై భారత్‌ 224 పరుగుల తేడాతో నెగ్గింది. విండీస్‌పై భారత్‌ వరుసగా 13వసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2007 నుంచి ఇప్పటివరకు విండీస్‌ వన్డే సిరీస్‌ కైవసం చేసుకోలేదు.

Last Updated :Aug 2, 2023, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.