ETV Bharat / sports

Ajaz Patel Record: నీకో దండం సామి.. 10 వికెట్లు ఎలా తీశావయ్యా!

author img

By

Published : Dec 4, 2021, 1:43 PM IST

Updated : Dec 4, 2021, 3:37 PM IST

Ajaz patel
Ajaz patel

Ajaz Patel Record: న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 325 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్​లో 10 వికెట్లు దక్కించుకుని చరిత్ర సృష్టించాడు కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్.

న్యూజిలాండ్​తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. అయితే ఇక్కడ అందరు బ్యాటర్లు ఔటైంది ఒక్కరి బౌలింగ్​లోనే. అతడే కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్. పేరు వింటే భారత్​కు చెందిన వాడిలా అనిపిస్తున్నాడు కదూ. మీరు అనుకున్నది నిజమే. ఇతడు పుట్టింది ముంబయిలోనే. కానీ ఆ తర్వాత న్యూజిలాండ్​ వెళ్లిన ఇతడి కుటుంబం అక్కడే స్థిరపడింది. ఇప్పుడదే ముంబయి మైదానంలో 10 వికెట్లు సాధించి రికార్డు నెలకొల్పాడు అజాజ్.

టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్​లో 10కి 10 వికెట్లు తీయడమంటే మాటలు కాదు. ఈ ఘనత సాధించడంలో 99 శాతం బౌలర్ల కష్టముంటే ఎక్కడో ఒక్క శాతం మాత్రం అదృష్టముంటేనే ఇది కుదురుతుందనేది వాస్తవం. లేకుంటే 10 బ్యాటర్లను ఒక్కరే ఔట్ చేయడమేంటండి. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరే ఈ ఘనత సాధించారు. భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. ఇంతకంటే ముందు 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ 53 పరుగులిచ్చి 10 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Ajaz patel news
అజాజ్ పటేల్ రికార్డు

1999లో దిల్లీ టెస్టులో పాకిస్థాన్‌పై అనిల్‌ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు నేలకూల్చి.. రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అజాజ్‌ పటేలే స్పిన్‌ మాయాజాలంతో ఈ ఘనత.. మళ్లీ ఇన్నాళ్లకు నమోదైంది. దాదాపు 1000 టెస్టుల తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల రికార్డు నమోదైంది. 428వ టెస్టులో లేకర్ 10 వికెట్ల ఘనత సాధించగా.. 1443వ టెస్టులో కుంబ్లే ఈ రికార్డ్ నెలకొల్పాడు. 22 ఏళ్ల తర్వాత 2,438వ టెస్టులో అజాజ్‍ పటేల్‍ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఘనత సాధించాడు.

1956లో టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా ఇంగ్లాండ్‌ బౌలర్‌ జిమ్‌ లేకర్‌ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జిమ్ లేకర్‌ పది వికెట్లు నేలకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ జిమ్ లేకర్‌ 9 వికెట్లు నేలకూల్చడు. మొత్తంగా ఆ టెస్టులో జిమ్‌ లేకర్‌ 19 వికెట్లు నేలకూల్చి రికార్డు సృష్టించాడు. ఇన్నేళ్లు గడిచినా ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.'

కివీస్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచిన అజాజ్‌ పటేల్‌పై.. ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా మాజీ క్రికెటర్లు అజాజ్‌ బౌలింగ్ కొనియాడారు. ఐసీసీ, బీసీసీఐ.. అజాజ్‌ ఘనతను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాయి. టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఘనత సాధించిన ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లోకి అజాజ్‌ను ఆహ్వానిస్తున్నట్లు అనిల్‌ కుంబ్లే తెలిపాడు. ముంబయి టెస్టులో అజాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని కుంబ్లే ప్రశంసించాడు.

క్రికెట్‌లో అజాజ్ క్లిష్టమైన ఘనత సాధించాడని, భారత జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అజాజ్‌ సాధించిన ఘనత.. తాను ఎప్పుడూ చూడని గొప్ప విషయం అని ఆస్ట్రేలియా వన్డే సారథి ఆరోన్ ఫించ్ తెలిపాడు. అజాజ్‌ ఓ ప్రత్యేకమైన వ్యక్తి అని న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ సైమన్‌ డౌల్‌ అన్నాడు. 15 ఏళ్ల తన వ్యాఖ్యాత కెరీర్‌లో న్యూజిలాండ్‌ జట్టు నుంచి ఇంతటి అద్భుతాన్ని చూడడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Last Updated :Dec 4, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.