ETV Bharat / sports

క్లిష్ట పరిస్థితుల్లో టీమ్​ఇండియా.. ఎటు పోతోంది మన క్రికెట్‌?

author img

By

Published : Dec 7, 2022, 8:12 AM IST

గత కొంతకాలంగా చూస్తే టీమ్​ఇండియాకు ఏమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. వారి ఆటతీరు రోజురోజుకు డీలా పడుతోంది. చిన్న జట్లుపైనా కూడా పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శల పాలవుతోంది. దాని గురించే ఈ కథనం..

present condition of Indian cricket team
క్లిష్ట పరిస్థితుల్లో టీమ్​ఇండియా.. ఎటు పోతోంది మన క్రికెట్‌?

ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో ఇంగ్లాండ్‌ తడబాటును చూసి చాలామంది ఆ జట్టును తేలిగ్గా తీసుకున్నారు. సెమీస్‌ నుంచి తన అసలు ఆటను చూపిస్తూ ఇంగ్లాండ్‌ అలవోకగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. బలమైన జట్టనుకున్న టీమ్‌ఇండియా డొల్లతనాన్ని బయటపెడుతూ.. ఆ జట్టు దాదాపు 170 లక్ష్యాన్ని వికెట్‌ పడకుండా, 4 ఓవర్లుండగానే ఛేదించి తన 'నాణ్యత'ను చాటి చెప్పింది. టీ20 ప్రపంచకప్‌ పరాభవాన్ని మరిచిపోకముందే.. ఇప్పుడు బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్టు చేతిలో వన్డే మ్యాచ్‌ ఓడి పరువు తీసుకుంది రోహిత్‌ బృందం. భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్‌లో పరాభవం ఎదుర్కొన్న సమయంలోనే అవతల పాకిస్థాన్‌ గడ్డపై ఇంగ్లిష్‌ జట్టు సగర్వంగా నిలబడింది. టెస్టు క్రికెట్‌ను పునర్నిర్వచించే ఆటతీరుతో.. ఫలితం వచ్చే అవకాశమే లేదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించిన తీరు అనితర సాధ్యం.

పాకిస్థాన్‌పై తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం కంటే ఆ జట్టు గెలిచిన తీరు ప్రశంసనీయం. మెక్‌కలమ్‌ కోచ్‌ అయ్యాక 'బజ్‌బాల్‌' పేరుతో ఒక కొత్త శైలి ఆటను ప్రవేశ పెట్టి ఇంగ్లిష్‌ జట్టుతో అద్భుతాలు చేయిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాదిరి ధాటిగా బ్యాటింగ్‌ చేయడం.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ 'ఎటాకింగ్‌' శైలినే అనుసరించడం 'బజ్‌బాల్‌' ఉద్దేశం. ఆ శైలితోనే స్వదేశంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌పై సిరీస్‌ సాధించడమే కాక.. భారత్‌పై 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అసంపూర్తిగా ఉన్న టెస్టు సిరీస్‌ను సమం చేసింది ఇంగ్లాండ్‌. సొంతగడ్డపై అలవాటైన పిచ్‌లపై విజయాలు సాధించడం ఒకెత్తయితే.. ఇప్పుడు పాక్‌ను దాని సొంతగడ్డపై ఓడించిన తీరు మరో ఎత్తు. దాదాపు 7 రన్‌రేట్‌తో పరుగులు సాధించడం.. తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలోనే 657, రెండో ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లలోనే 264 పరుగులు చేయడం టెస్టు క్రికెట్లో మునుపెన్నడూ చూడని వింతలే. పాకిస్థాన్‌ కూడా దీటుగా స్పందించడంతో ఈ మ్యాచ్‌ డ్రా అనే నిర్ణయానికి అంతా వచ్చేశారు. కానీ సాహసోపేత రీతిలో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి పాక్‌కు ఊరించే లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాట్స్‌మెన్‌ చుట్టూ మొత్తం ఫీల్డర్లను మోహరించడం ద్వారా ఇంగ్లాండ్‌ వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఆ పిచ్‌పై 343 లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదు. కానీ పాక్‌ను దాని సొంతగడ్డపై ఒత్తిడికి గురి చేసి విజయం సాధించడం ఇంగ్లాండ్‌ ప్రత్యేకతను చాటి చెబుతుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తన బలంతో కంటే ఆడిన శైలి వల్ల గెలిచింది అనడం సబబు.

పాకిస్థాన్‌లో ఇంగ్లాండ్‌ ఈ అద్భుతం చేసిన సమయంలోనే సొంతగడ్డపై ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని చాటింది. వెస్టిండీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఒకే ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఆటగాళ్లు ఇద్దరు డబుల్‌ సెంచరీ చేయడం విశేషం. వెస్టిండీస్‌ క్రికెట్‌ పతనానికి ఈ మ్యాచ్‌ మరో సూచికగా నిలిచింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవడం విచారకరం. విండీస్‌ పతనం 90వ దశకంలోనే మొదలైంది కానీ.. ఆటగాళ్లకు జీతాల విషయంలో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు మొండి వైఖరి, ఇరు వర్గాల మధ్య ఎడతెగని గొడవ కారణంగా గత దశాబ్ద కాలంలో కరీబియన్‌ క్రికెట్‌ పాతాళానికి పడిపోయింది. కరీబియన్‌ క్రికెట్‌ పతనం బీసీసీఐకి కచ్చితంగా హెచ్చరికే. వెస్టిండీస్‌ బోర్డుకున్నట్లు బీసీసీఐకి ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు. కానీ బోర్డులో రాజకీయాలు చొరబడితే, ఆటపై దృష్టి మళ్లితే, వ్యవస్థ గాడితప్పితే జరిగే నష్టాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.

మునుపెన్నడూ లేని విధంగా బీసీసీఐలో రాజకీయ నాయకుల ఆధిపత్యం పెరిగింది. బోర్డును గుప్పెట్లో పెట్టుకున్న వారి దృష్టి పాలన కంటే క్రికెట్‌ రాజకీయాల మీదే ఎక్కువ దృష్టి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో అవినీతి, అశ్రిత పక్షపాతం హెచ్చుమీరుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో క్రికెట్‌ ప్రతిభకు లోటు లేకపోయినా.. దాన్ని దారిలో పెట్టే వ్యవస్థ గాడి తప్పుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. బంగ్లాదేశ్‌ చేతిలో పరాజయాన్ని అనుకోకుండా ఎదురైన ఓటమిలా చూడలేని పరిస్థితి. పడిపోతున్న మన క్రికెట్‌ ప్రమాణాలను, మన జట్టు డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్న ఫలితమిది. కోహ్లి, రోహిత్‌ లాంటి ఆటగాళ్లున్న జట్టు నుంచి అలాంటి బ్యాటింగ్‌ ప్రదర్శన ఊహకందనిది. తర్వాత ఒక దశ వరకు మెరుగ్గానే బౌలింగ్‌ చేసిన బౌలర్లు.. చివరి బ్యాటర్‌ను ఔట్‌ చేయలేక చేతులెత్తేసి, మ్యాచ్‌ను అప్పగించేసిన వైనం జీర్ణించుకోలేనిది. ఓవైపు బీసీసీఐ మీద ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. మరోవైపు కెప్టెన్‌గా రోహిత్‌, కోచ్‌గా ద్రవిడ్‌ భారత క్రికెట్‌ను సరైన దిశలో నడిపించగల సమర్థులేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. 2015 వన్డే ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో నిష్క్రమించాక.. తాము పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడే తీరునే పూర్తిగా మార్చేసి.. ఇంకో నాలుగేళ్లకు ఆ కప్పుని, ఇటీవలే టీ20 ట్రోఫీని దక్కించుకున్న ఇంగ్లాండ్‌.. ఇప్పుడు టెస్టు క్రికెట్లోనూ విప్లవాత్మక మార్పు దిశగా అడుగులేస్తున్న తీరును చూస్తున్నాం. అదే సమయంలో ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఉన్న వెస్టిండీస్‌.. సరైన ప్రణాళిక, పర్యవేక్షణ కొరవడి ఎలా పతనమైందో తెలుస్తూనే ఉంది. మరి మన క్రికెట్‌ ప్రక్షాళన దిశగా అడుగులేసి ఇంగ్లాండ్‌లా ఎదుగుతుందా.. లేక నిర్లక్ష్య ధోరణిని కొనసాగించి విండీస్‌ దారి పడుతుందా?

ఇదీ చూడండి: IND VS BAN: బంగ్లాతో చావో రేవో మ్యాచ్​.. మనోళ్లు ఏం చేస్తారో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.