ETV Bharat / sports

ICC World Cup 2023 : భారత్​పై పీసీబీ రివెంజ్​ ప్లాన్.. వన్డే వరల్డ్​ కప్​లో పాక్​ డౌటే!

author img

By

Published : Jun 17, 2023, 10:58 AM IST

ICC World Cup 2023 Pakistan : భారత్​ అతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్​ కప్2023​లో పాకిస్థాన్​ పాల్గొనడంపై.. పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ఛైర్మన్​ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్​ జట్టు.. భారత్​లో పర్యటించాలంటే ఆ దేశ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అన్నారు. తమ ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలను పరిశీలించి మాకు అనుమతి ఇస్తేనే.. భారత్​లో పర్యటిస్తామని అన్నారు.

ICC World Cup 2023 Pakistan
ICC World Cup 2023 Pakistan

icc cricket world cup pakistan : భారత్​ అతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్​ 2023లో పాకిస్థాన్​ పాల్గొనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్​కు తమ జట్టును పంపించాలో లేదో అనే విషయం ప్రభుత్వ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. పాకిస్థాన్​ ఆడే వేదికలను కూడా పాక్​ ప్రభుత్వం ఆమోదించాలన్నారు. నజామ్ సేథీ చేసిన ఈ వ్యాఖ్యలు వన్డే వరల్డ్​ కప్​2023 షెడ్యూల్​ను ఖరారు చేసే ముందు ఐసీసీని ఇరుకున పెట్టాయి. ఆసియా కప్​ 2023 నిర్వహణపై భారత్​, పాక్​తో సహా ఆసియా క్రికెట్​ మండిలి (ఏసీసీ) సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో నజామ్​ సేథీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"భారత్, పాకిస్థాన్ ఎక్కడి వెళ్లాలి అనే నిర్ణయాలు పీసీబీ గాని.. బీసీసీఐ గాని తీసుకోలేవు. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోగలవు. భారత్‌.. పాకిస్థాన్​లో పర్యటించాలా? వద్దా? అనే దానిపై ఆ దేశ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అలాగే పాకిస్థాన్​ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. అహ్మదాబాద్‌లో ఆడతారా అని మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మేము భారత్​కు వెళ్తామా లేదా అన్నది సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. ఆ తర్వాత ఏ వేదికపై ఆడతామన్నది స్పష్టత వస్తుంది. ఈ రెండు అంశాలపై మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది" అని విలేకరుల సమావేశంలో నజామ్ సేథీ అన్నారు.

గత నెల ఐసీసీ సీఈఓ జియోఫ్ అల్లార్డిస్, ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే నజామ్ సేథీని కలవడానికి కరాచీకి వెళ్లారని.. అనంతరం పాకిస్థాన్ ప్రపంచకప్‌లో పాల్గొనడానికి ఎలాంటి షరతులు విధించదని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి నజామ్​ సేథీ మాట్లాడారు. 'మా ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలను పరిశీలించి మాకు అనుమతి ఇస్తే.. మేము భారతదేశంలో ఆడటానికి వస్తామని మేము ఐసీసీకి చెప్పాము. ప్రభుత్వం అనుమితి ఇవ్వకపోతే ఇండియాకు వచ్చి ఎలా ఆడగలం? ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చినా, వేదికలను పరిశీలించి, ఎక్కడ ఆడాలో నిర్ణయించుకోవాలి. అది తర్వాత పని" అని సేథీ అన్నారు.
అయితే, పాకిస్థాన్​కు నిజంగా భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయా లేక ఆసియా కప్​ విషయంలో భారత్​ వ్యవహరించిన తీరుకు పగతీర్చుకుంటుందా అని క్రీడా విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ICC Odi World Cup 2023 Schedule : ఐసీసీ మెగా టోర్నీ వన్డే వరల్డ్​కప్​నకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ ఇప్పటివరకు బీసీసీఐ షెడ్యూల్​ను రూపొందించలేదు. ఇక, నజామ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో వరల్డ్​ కప్​లో పాకిస్థాన్​ పాల్గొనడంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, పాక్​.. భారత్​కు రావడానికి ఒప్పుకుంటే.. అహ్మదాబాద్​ వేదికగా అక్టోబర్​ 15న చిరకాల ప్రత్యర్థులు తలపడే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయే కాలమే నిర్ణయించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.