ETV Bharat / sports

వన్డే వరల్డ్​కప్​ వస్తోంది.. వీరిపై కన్నేయండి.. బీసీసీఐకి మాజీల సూచన

author img

By

Published : May 12, 2023, 10:52 PM IST

IPL 2023 RR Players Yashasvi Jaiswal KKR Rinku Singh
IPL 2023 RR Players Yashasvi Jaiswal KKR Rinku Singh

IPL 2023 : ఐపీఎల్‌ 2023లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ భారత జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు యువ క్రికెటర్లు. వారికి కూడా అవకాశాలు ఇచ్చి జట్టును మరింత బలోపేతం చేయాలని క్రికెట్​ బోర్డును సూచిస్తున్నారు కొందరు మాజీ ఆటగాళ్లు.

IPL 2023 : ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 2023​లో యంగ్ క్రికెటర్ల హవా కొనసాగుతోంది. యశస్వి జైస్వాల్​, రింకు సింగ్​, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్​ గైక్వాడ్​, వెంకటేశ్ అయ్యర్​, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ తెవాతియా సహా మరికొందరు ఆటగాళ్లు అద్భుతమైన ఇన్నింగ్స్​ ఆడుతూ తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. వీరి దూకుడు చూస్తుంటే జాతీయ జట్టులోకి వచ్చేందుకు తలుపులు తడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఇందుకోసం ఐపీఎల్​ ద్వారా వచ్చిన అవకాశాలను వీరంతా సక్రమంగా వినియోగించుకుంటున్నారు. అయితే వీరిలో ఇప్పటికే ఇండియా టీమ్​కు సెలెక్ట్ అయినవాళ్లు కొందరుంటే.. మరికొందరేమో ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సీజన్‌లో ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వీరిద్దరే హాట్‌ టాపిక్‌గా మారారు. వీరిలో మొదటగా చెప్పుకోవాల్సింది రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ గురించి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ చెలరేగిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఐపీఎల్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని బాదాడు ఈ యువ ఓపెనర్. కేవలం 13 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేసి ఐపీఎల్​ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇక, కోల్​కతా ప్లేయర్​కు రింకూ సింగ్​ కూడా ఇదే తీరులో రాణిస్తున్నాడు.

ఇదిలా ఉంటే అద్భుతమైన ఫామ్​లో ఉన్న ఆటగాళ్లకూ.. ముఖ్యంగా జైస్వాల్​, రింకు వంటి యువ ప్లేయర్లకు జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశం కల్పించాలని క్రికెట్​ బోర్డుకు సూచిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు. దూకుడుగా ఆడుతున్న వారిపై సెలెక్టర్లు దృష్టి సారించాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐపై టీమ్‌ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌, సురేశ్​ రైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకెవరి కోసం సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు..?
"ఈ ఏడాది స్వదేశం వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌పై టీమ్‌ఇండియా దృష్టిసారిస్తే.. యశస్వి, రింకు సింగ్‌ వంటి యువ క్రికెటర్లపైనా ఓ కన్నేయాలి. ఇలాంటి ఆటగాళ్లు దూకుడుగా ఆడతారు. ఇలాంటి వారిని 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలి. అప్పటికి జాతీయ జట్టులో ఉండే అనుభవం వస్తుంది. ఒకవేళ వారిద్దరిని తీసుకోకపోతే.. సెలెక్టర్లు ఇంకేదైనా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాటలో ఉన్నారేమో నాకు తెలియదు" అని రవిశాస్త్రి వ్యాఖ్యానించారు.

తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టాడు : హర్భజన్‌
"యశస్వి జైస్వాల్ తన ప్రదర్శనతో భారత క్రికెట్‌ జట్టులోకి వచ్చేందుకు తలుపు తట్టడం కాదు.. ఏకంగా బద్దలు కొట్టినట్లు ఉంది. అతడి నిలకడైన బ్యాటింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని తన వైపు తిప్పేసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కనబరిచిన ఫామ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు జాతీయ జట్టులో అవకాశం కోసం మార్గం వేసుకున్నాడు. అద్భుతమైన టాలెంట్‌ కలిగిన యశస్విని భారత క్రికెట్‌కు భవిష్యత్తు తార అనడంలో ఎలాంటి సందేహం లేదు" అని హర్భజన్ అన్నాడు

సెహ్వాగ్‌ను గుర్తు తెచ్చాడు : సురేశ్ రైనా
"నేనే భారత జట్టు సెలెక్టర్‌ను అయితే వెంటనే యశస్విని జాతీయ జట్టులోకి తీసుకుంటా. వన్డే ప్రపంచ కప్‌లో ఆడిస్తా. వీరేంద్ర సెహ్వాగ్‌ను మళ్లీ గుర్తుకు తెచ్చాడు. రోహిత్ శర్మ కూడా ఇలాంటి యువ బ్యాటర్ల కోసం చూస్తుంటాడని నేను భావిస్తున్నా" అని సురేశ్‌ రైనా అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.