ETV Bharat / sports

బంగ్లాపై విజయం.. టాప్‌-2లోకి టీమ్​ఇండియా.. దక్షిణాఫ్రికాను వెనక్కినెట్టి

author img

By

Published : Dec 19, 2022, 4:33 PM IST

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్‌ పట్టికలో భారత క్రికెట్‌ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్‌పై విజయంతో భారత్‌ స్థానం మెరుగుపడింది.

world test champion ship
world test champion ship

టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భారత క్రికెట్‌ జట్టు రెండో స్థానానికి చేరుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి రోజు 11.2 ఓవర్లలోనే కావాల్సిన నాలుగు వికెట్లు తీసి, 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది.

మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘోర పరాజయాన్ని చవిచూసింది. పూర్తిగా రెండు రోజులు కూడా సాగని మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్‌ జట్టు దక్షిణాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించింది. ఐదు రోజులు జరగాల్సిన టెస్టు కేవలం 144.2 ఓవర్లు మాత్రమే జరగడం చూస్తే, దక్షిణాఫ్రికా ఎంత ఘోరంగా ఆడిందో చూడవచ్చు. దీంతో తాజా టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి భారత్‌ రెండో స్థానానికి చేరుకుంది.

ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ఆసీస్‌ జట్టు అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు 76.92 శాతం (120 పాయింట్లు)తో టాప్‌లో ఉంది. బంగ్లాపై విజయంతో పాయింట్లు మెరుగు పరుచుకున్న భారత్‌ 55.77శాతం(72 పాయింట్లు)తో రెండో స్థానంలోనూ దక్షిణాఫ్రికా 54.55శాతం (64 పాయింట్లు)తో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శ్రీలంక (53.33%), ఇంగ్లాండ్‌ (44.44%), పాకిస్థాన్‌ (42.42%), వెస్టిండీస్‌ (40.91%), న్యూజిలాండ్‌ (25.95%), బంగ్లాదేశ్‌ (12.52%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫస్ట్‌ సైకిల్‌ ముగిసే సమయానికి భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు టాప్‌లో ఉండగా, ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టి, టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. తాజా ఛాంపియన్‌షిప్‌ సైకిల్‌ మార్చి 2023తో ముగుస్తుంది. తుది పోరుకు ఈసారి కూడా ఇంగ్లాండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.