ETV Bharat / sports

IPL: ఐపీఎల్‌కు శ్రేయస్​ రెడీ.. మరి కెప్టెన్సీ?

author img

By

Published : Jul 5, 2021, 8:20 PM IST

ఐపీఎల్​లోని మిగతా మ్యాచ్​లు ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్(Shreyas Iyer)​. ప్రస్తుతం తాను గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. మరో నెలరోజుల్లో పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తానని వెల్లడించాడు.

shreyas iyer
శ్రేయస్​ అయ్యర్​

భుజం గాయం కారణంగా కొద్దిరోజులుగా క్రికెట్‌కు దూరమైన దిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer) కోలుకున్నాడని చెప్పాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నానని, పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరో నెలరోజుల సమయం పడుతుందని అన్నాడు. ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.

"నా భుజానికి అయిన గాయం పూర్తిగా నయమైంది. అయితే, నేనిప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే క్రమంలో ఉన్నాను. అందుకు సంబంధించి ట్రెయినింగ్‌ కూడా మొదలుపెట్టాను. దానికి మరో నెలరోజుల సమయం పడుతుంది. ఇది పక్కనపెడితే, నేను ఐపీఎల్‌లో ఆడతాననే నమ్మకం ఉంది. అయితే, నేను ఆడినప్పుడు కెప్టెన్సీ చేస్తానా లేదా అనే విషయం నాకు తెలియదు. అది జట్టు యాజమాన్యం చేతుల్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడుతోంది. టాప్‌లో నిలిచింది. నాకదే ముఖ్యం. నా లక్ష్యం మేం కప్పు సాధించడమే" అని శ్రేయస్‌ వివరించాడు.

అనంతరం అశ్విన్‌ను మన్కడింగ్‌ చేయకుండా ఒప్పించే విషయంపై మాట్లాడిన శ్రేయస్‌ అలా చేయడానికి కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు. "అశ్విన్‌ దిల్లీ జట్టులో చేరినప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైంది. మన్కడింగ్‌ చేయడానికి దిల్లీ జట్టు వ్యతిరేకమని నేనూ, పాంటింగ్‌ అతడికి చెప్పి చూశాము. దాంతో మేం చెప్పినదానికి కట్టుబడి ఉంటానన్నాడు. మేం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తూనే ఒక మెలిక పెట్టాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ అతి చేయనంతవరకు మాత్రమే అలా చేయనని మాతో అన్నాడ" అని శ్రేయస్‌ గుర్తుచేసుకున్నాడు.

మార్చిలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయస్‌ బంతిని ఆపే క్రమంలో డైవ్‌చేసి కిందపడ్డాడు. దాంతో అతడి ఎడమ భుజానికి గాయమైంది. తర్వాత సర్జరీ చేయడంతో ఐపీఎల్‌ 14వ(IPL) సీజన్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే జట్టు యాజమాన్యం పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. అతడు అంచనాలకుమించి రాణించి జట్టును టాప్‌లో నిలిపాడు. అయితే, కరోనా కేసుల కారణంగా ఈ సీజన్‌ అర్ధాంతరంగా ఆగిపోయింది. దాన్ని సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే శ్రేయస్‌ అప్పటివరకూ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: ఈ నలుగురు.. టీ20 ప్రపంచకప్​లో ఆడతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.