ETV Bharat / sports

'ఎలా ఆడాలో రోహిత్‌ చూపించాడుగా!'

author img

By

Published : Feb 28, 2021, 8:03 AM IST

టెస్టు బ్యాట్స్​మన్​గా ఉన్నప్పుడు ఎలాంటి బంతినైనా ఎదుర్కొవాల్సిందేనని లెజెండరీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ అన్నారు. ఇటీవలే పింక్​-బాల్​ టెస్టు పిచ్​పై వస్తున్న భిన్నాభిప్రాయలపై స్పందించిన ఆయన.. పరుగులు ఎలా చేయాలో టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్​శర్మ చూపించాడని తెలిపారు.

Rohit Sharma showed you could score runs on Motera pitch, says Gavaskar
'ఎలా ఆడాలో రోహిత్‌ చూపించాడుగా!'

మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ చూపించాడని సునీల్‌ గావస్కర్‌ అన్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్‌ అన్నప్పుడు బంతి టర్నైనా, ఎదురుగా వచ్చినా ఆడాల్సిందేనని స్పష్టం చేశారు. డే/నైట్‌ టెస్టులో బంతి మరీ విపరీతంగా ఏమీ టర్నవ్వలేదని పేర్కొన్నారు. అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ బౌలింగ్‌ అద్భుతమని ప్రశంసించారు.

"పిచ్‌పై విసిరిన ప్రతి బంతీ విపరీతంగా స్పందించలేదు. ప్రమాదకరంగానూ అనిపించలేదు. ఊహించలేనంత బౌన్స్‌ కనిపించలేదు. నిజానికి ఇక్కడ ఉండాల్సిన స్థాయిలోనే బౌన్స్‌ ఉంది. బంతి మాత్రం కొద్దిగా స్పిన్‌‌ అయ్యింది. కానీ టెస్టు బ్యాట్స్‌మన్‌ అన్నప్పుడు బంతి టర్న్‌ అయినా నేరుగా వచ్చినా ఆడాల్సిందే. ఇది సవాలే కానీ, మరీ ఆడలేనంత కాదు. బ్యాట్స్‌మెన్‌ ఔటైన విధానం చూస్తుంటే వారి గోతులు వారే తవ్వుకున్నట్టు ఉంది. పిచ్‌ కన్నా బ్యాట్స్‌మెన్‌ వైఖరే ఎక్కువగా దెబ్బతీసింది. మొతేరా పిచ్‌పై పరుగులు ఎలా చేయాలో రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్సుల్లోనూ తన బ్యాటింగ్ ‌ద్వారా చూపించాడు"

- సునీల్​ గావస్కర్​, లెజెండరీ క్రికెటర్​

అహ్మదాబాద్‌లో జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగిసింది. అక్షర్‌, అశ్విన్​ చెలరేగడం వల్ల మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 112కే ఆలౌట్‌ అయింది. అయితే ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జాక్‌లీచ్‌, కెప్టెన్‌ జోరూట్‌ సైతం బంతిని టర్న్‌ చేయడం వల్ల భారత్‌ 145కు ఇన్నింగ్స్‌ ముగించింది. ఆ తర్వాత జరిగిన రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లాండ్‌ 81కే కుప్పకూలడం వల్ల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ 10 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది.

ఇదీ చూడండి: మొతేరా పిచ్​పై మాజీల భిన్నాభిప్రాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.