ETV Bharat / sports

IndvsEng: 'మూడో టెస్టులో అందుకే ఓడిపోయాం'

author img

By

Published : Aug 28, 2021, 7:26 PM IST

బ్యాటింగ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఇంగ్లాండ్​ బౌలర్లు అద్భుతంగా ఆడటం వల్ల మూడో టెస్టులో ఓటమి చెందినట్లు తెలిపాడు టీమ్​ఇండియా సారథి కోహ్లీ. ఈ మ్యాచ్​లో తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగుతామని చెప్పాడు.

kohli
కోహ్లీ

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్కోరుబోర్డుపై ఉన్న భారీ పరుగులే టీమ్‌ఇండియాను ఒత్తిడికి గురిచేశాయని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. శనివారం ఆతిథ్య జట్టు చేతిలో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 76 పరుగులతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ స్పందిస్తూ ఈ విధంగా మాట్లాడాడు.

"నాలుగో రోజు తమ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడికి గురయ్యారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తమను తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూల్చిన తర్వాత భారీ స్కోర్‌ సాధించినప్పుడు వెనుకబడిపోయామని అర్థమైంది. నాలుగో రోజు ఉదయం ఇంగ్లాండ్‌ బౌలర్లు అద్భుతంగా చెలరేగారు, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే మేము కూడా సరైన రీతిలో ఆడలేకపోయాం. అయితే, ఇంగ్లాండ్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఎవరైనా కుప్పకూలడం సాధారణ విషయం. బ్యాటింగ్‌ చేసేందుకు ఈ పిచ్‌ అనుకూలంగా ఉంది, కానీ ఇంగ్లాండ్‌ బౌలర్లు సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు సంధించడం వల్ల మేము తప్పులు చేశాం. అలాగే మా బ్యాటింగ్‌లోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాం. మరోవైపు ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ చేసినప్పుడు పిచ్‌లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పట్టుదలతో ఆడారు, ఈ విజయానికి వారు అర్హులు."

-కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మంచి స్కోర్లు సాధించాలని, దాంతో లోయర్‌ ఆర్డర్‌ పని తేలికవుతుందని కోహ్లీ వెల్లడించాడు. ప్రతిసారి టెయిలెండర్లు పరుగులు చేయలేరని వివరించాడు. ఇక రెండో స్పిన్నర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం అనేది పిచ్‌పై ఆధారపడి ఉంటుందని, దాని గురించి తర్వాత ఆలోచిస్తామని చెప్పుకొచ్చాడు. తమ తప్పులు తెలుసుకొని ముందుకు సాగుతామని, గతంలోనూ ఇలాంటి వైఫల్యాల నుంచి మెరుగైన ప్రదర్శన చేశామని విరాట్​ గుర్తుచేశాడు.

ఇదీ చూడండి: INDvsENG: మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.