ETV Bharat / sports

'2021లోనూ సన్​రైజర్స్​తోనే విలియమ్సన్'

author img

By

Published : Nov 15, 2020, 1:22 PM IST

Warner says SRH will not lose Williamson in auctions
విలియమ్సన్​ హైదరాబాద్​తోనే ఉంటాడు:వార్నర్​

ఐపీఎల్​ పద్నాలుగో సీజన్​లో సన్​రైజర్స్​ తరఫున కేన్​ విలియమ్సన్​ ఆడడంటూ వస్తోన్న పుకార్లపై స్పష్టతనిచ్చాడు ఆ జట్టు సారథి డేవిడ్​ వార్నర్. ​విలియమ్సన్‌ 2021లోనూ తమతోనే ఉంటాడని అభిమానులకు భరోసానిచ్చాడు.

వచ్చే ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తరఫున కేన్‌ విలియమ్సన్‌ ఆడడనే పుకార్లపై ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. సామాజిక మాధ్యమాల్లో పలువురు క్రికెట్‌ అభిమానులు విలియమ్సన్‌ గురించి అడిగిన ప్రశ్నలకు వార్నర్‌ సమాధానమిచ్చాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్​ పదమూడో సీజన్​లో ముంబయి ఎప్పటిలాగే సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి ఐదోసారి విజేతగా నిలిచింది. టోర్నీ అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో 14వ సీజన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మరో కొత్త ఫ్రాంఛైజీని తీసుకురావాలని చూస్తున్నారు.

అయితే, ఇప్పటికే అహ్మదాబాద్‌ కేంద్రంగా ఆ నూతన ఫ్రాంఛైజీ రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా తర్వాతి సీజన్‌కు ముందు 2021 వేలం నిర్వహిస్తారని, అందులో అన్ని జట్ల ఆటగాళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ టీమ్‌ నుంచి విలియమ్సన్‌ను తీసేస్తారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. అది నిజమేనా అని నెటిజన్లు వార్నర్‌ను ప్రశ్నించారు. అతడిని తొలగించొద్దని, మీ(వార్నర్‌) తర్వాత హైదరాబాద్‌ ఆశలన్నీ అతడిపైనే అని పేర్కొన్నారు. వాటికి స్పందించిన కెప్టెన్‌.. విలియమ్సన్‌ను తీసేయరని, తాను కూడా అతడు జట్టులో ఉండాలనే కోరుకుంటానని బదులిచ్చాడు. కచ్చితంగా కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను వదులుకోమని స్పష్టం చేశాడు.

హైదరాబాద్‌ ఈ సీజన్‌లో అనూహ్యంగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లి అక్కడ దిల్లీ చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా వార్నర్‌ టీమ్‌ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇదీ చూడండి:క్రికెట్​ రారాజు.. అంతర్జాతీయంగా వెలిగిన రోజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.