ETV Bharat / sports

'నాపై రవిశాస్త్రి.. సిరాజ్​పై నేను విరుచుకుపడాల్సిందే'

author img

By

Published : Jan 28, 2021, 11:15 AM IST

పేసర్​ సిరాజ్​ టీమ్​ఇండియాకు ఎంపికవ్వకముందే పరిచయముందని అన్నాడు భారత జట్టు బౌలింగ్​ కోచ్​ అరుణ్​. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పాడు. సిరాజ్​కు తనతో చీవాట్లు పెట్టించుకోవాలంటే ఇష్టమని వెల్లడించాడు. మ్యాచులో భారత బౌలర్​ బౌండరీని సమర్పించుకుంటే హెడ్​ కోచ్​ రవిశాస్త్రి తనపై విరుచుకుపడతాడని చెప్పాడు. ​

siraj
సిరాజ్​

టీమ్‌ఇండియా నయా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తనతో చీవాట్లు పెట్టించుకోవాలంటే ఇష్టమని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అన్నాడు. తాజాగా ఆయన రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం వెల్లడించాడు. సిరాజ్‌ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వకముందే పరిచయం ఉందని, హైదరాబాద్‌ జట్టుకు తాను బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నప్పటి నుంచే తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని భరత్‌ పేర్కొన్నాడు.

"సిరాజ్‌ కొన్నిసార్లు ప్రణాళికలకు దూరంగా బంతులేస్తాడు. అలాంటప్పుడు అతడిని కోపగించుకుంటాను. అది అతడిని బాధపెట్టడం కాదు కానీ, అర్థమయ్యేలా చెప్పడం. నేను అలా చీవాట్లు పెడితే అతడికి ఇష్టం. నేను కోప్పడినప్పుడు సిరాజ్‌ నవ్వి, 'ఓకే సర్‌, ప్రణాళిక ప్రకారమే బౌలింగ్‌ చేస్తా' అని అంటాడు. తర్వాత అతడు హైదరాబాద్‌ తరఫున రాణించి ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, నేను టీమ్‌ఇండియాకు వచ్చాక తరచూ నాతో మాట్లాడేవాడు. 'నన్నెందుకు పిలవట్లేదు. నేను టీమ్‌ఇండియాకు ఆడాలనుకుంటున్నా' అని నాతో అనేవాడు" అని భరత్‌ అరుణ్‌ సిరాజ్‌ గురించి వివరించారు.

కాగా, సిరాజ్‌ ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు అందరీ ప్రశంసలు పొందాడు. గబ్బా టెస్టులో 5 వికెట్లతో చెలరేగి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

మ్యాచ్​ జరిగే సమయాల్లో ఎవరైనా భారత బౌలర్​ బౌండరీ సమర్పించుకున్న(ప్రత్యర్థి బ్యాట్స్​మన్​ బౌండరీ బాదడం) ప్రతిసారీ హెడ్​ కోచ్​ రవిశాస్త్రి తనపై అరుస్తాడని అన్నాడు అరుణ్​.

"రవిశాస్త్రి డ్రెసింగ్​ రూమ్​ నుంచి మ్యాచ్​ను వీక్షిస్తుంటాడు. ఈ సమయంలో ఎవరైనా బౌలర్​ బౌండరీ ఇస్తే అతడికి బాగా కోపం వచ్చేస్తుంది. బౌలర్​ ఒక్క పరుగును కూడా సమర్పించడానికి అసలు ఇష్టపడడు. బంతి విసిరితే వికెట్​ పడాలి. అదే తన ఆలోచన. అదే ప్రత్యర్థి జట్టు బౌలింగ్​ చేస్తే మన బ్యాట్స్​మన్​ భారీగా పరుగులు మాత్రమే చేయాలి. భారత బౌలర్​ వరుసగా రెండు బౌండరీలు ఇస్తే ఇక నాపై అరుస్తూనే ఉంటాడు. అందుకే ప్రత్యర్థి బ్యాట్స్​మన్​ బౌండరీ బాదితే నన్ను రవిశాస్త్రి తిట్టడానికి సిద్ధంగా ఉంటాడని నాకు ముందుగానే తెలిసిపోతుంది." అని అన్నాడు.

ఇదీ చూడండి: ఆసీస్​ పర్యటనలో సిరాజ్​ విజయ రహస్యం అదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.