ETV Bharat / sports

భారత్ x ఆస్ట్రేలియా: 'గులాబి' ఏం మాయ చేస్తుందో?

author img

By

Published : Dec 16, 2020, 5:12 PM IST

తొలి టెస్టుకు అంతా సిద్ధమైంది. అడిలైడ్​లో ఐదురోజుల పాటు ఈ పోరు జరగనుంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. మరి గులాబి బంతి ఏం మాయ చేస్తుందో చూడాలి.

'Test of Night Life': India face Aussie might in Pink Ball affair
భారత్ x ఆస్ట్రేలియా: 'గులాబి' ఏం మాయ చేస్తుందో?

పింక్‌ బాల్‌ టెస్టుల్లో ఇంతవరకూ ఓటమే ఎరుగని ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్‌ సిద్ధమైంది. ఆసీస్‌కు అచ్చొచ్చిన ఆడిలైడ్‌ వేదికలో డే/నైట్‌ టెస్టు, గురువారం ఆడనుంది. సొంతగడ్డ, నైపుణ్యమున్న పేసర్లు, పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌తో కంగారులు... కోహ్లీ సేనకు సవాల్‌ విసురుతున్నారు. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు టీమ్​ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో గెలిచి, పట్టు బిగించాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి.

బ్యాటింగ్‌లో భారత్‌ పటిష్ఠంగా కనిపిస్తున్నా సరే భిన్నంగా స్పందించే గులాబి బంతిని ఎదుర్కోవడం పైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్‌ పంపనున్నారు. మరి ఎలా ఆడతారో చూడాలి. విరాట్‌ కోహ్లీ, పుజారా, రహానే, విహారీలతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తుండగా.. పుజారాపై మేనేజ్​మెంట్​ భారీగా ఆశలు పెట్టుకుంది. సాహా వికెట్​ కీపింగ్ చేయనున్నాడు.

team india
టీమ్​ఇండియా జట్టు

భారత పేస్‌ బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. గులాబీ బంతితో బుమ్రా, షమి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వీరికి ఉమేశ్ యాదవ్‌ తోడయ్యాడు.

గులాబీ టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సహా అత్యధిక పరుగులు చేసిన డేవిడ్‌ వార్నర్‌ ఆస్ట్రేలియా జట్టులో లేకపోవడం కోహ్లీ సేనకు కలిసొచ్చే అంశం. స్పిన్నర్‌గా అశ్విన్​కు తుది జట్టులో చోటు దక్కింది.

పింక్‌ టెస్టుల్లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన మిచెల్‌ స్టార్క్‌ను భారత్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. నెట్స్‌లో నటరాజన్‌ గులాబీ బంతితో 130 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతులకే ఇబ్బందిపడ్డ బ్యాట్స్‌మెన్‌కు స్టార్క్‌ను ఎదుర్కోవడం సవాల్‌గా మారనుంది. డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌ల్లో అనుభవలేమీ భారత్‌కు ఇబ్బందే!

టీమిండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఒకే ఒక్క పింక్‌ టెస్టు ఆడింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన భారత్‌... సునాయస విజయాన్ని సొంతం చేసుకుంది.

australia team
ఆస్ట్రేలియా బృందం

పింక్‌ టెస్టుల్లో ఇప్పటివరకూ ఓటమి లేని ఆసీస్‌ ఆ రికార్డును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై ఆడుతుండడం కంగారూలకు కలిసి రానుంది. లైన్‌కు భిన్నంగా ఆడే స్టీవ్‌ స్మిత్‌, లబుషెన్‌, టిమ్‌ పైన్‌లతో బ్యాటింగ్‌లో బలంగా కనిపిస్తోంది.

గులాబీ బంతితో స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఆస్ట్రేలియా ఆడిన ఏడు గులాబి టెస్టు మ్యాచ్‌ల్లో ఈ త్రయం 80కిపైగా వికెట్లను సాధించింది. గులాబీ బంతితో చెలరేగిపోయే కంగారులు.. తొలి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని భావిస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.