ETV Bharat / sports

ఐపీఎల్​కు 'కరోనా' లేదు.. టోర్నీ జరగడం పక్కా!

author img

By

Published : Mar 12, 2020, 6:33 AM IST

మార్చి 29 నుంచి షెడ్యూల్​ ప్రకారం ఐపీఎల్​ జరుగుతుందని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. కరోనా కారణంగా ఏ దేశంలోనూ మెగా క్రికెట్​ టోర్నీలు వాయిదా పడటం, రద్దవడం లేదని చెప్పాడు. అయితే మహరాష్ట్రలోని శివసేన ప్రభుత్వం మాత్రం ఐపీఎల్​ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.

Sourav Ganguly confirms 'no IPL postponement' even as Maharashtra opposes the tourney for corona Outbreak
క్రికెట్​కు 'కరోనా' లేదు.. ఐపీఎల్​ జరగడం పక్కా

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్​) నిర్వహణపై నానాటికీ అనుమానాలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు టోర్నీని వాయిదా వేయాలని ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కోరాయి. మద్రాస్‌ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించిందని తాజా సమాచారం!

వార్తల్లో నిజమెంత.?

షెడ్యూలు ప్రకారం ఈ నెల 29న ఐపీఎల్‌-2020 ఆరంభమవుతుంది. ముంబయిలోని వాంఖడే వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆరంభ పోరులో తలపడాల్సి ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా భారీ జన సమూహాలు ఏర్పడకుండా చూడాలని శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌ టికెట్ల విక్రయాన్ని నిషేధించిందని వార్తలు వస్తున్నాయి.

Sourav Ganguly confirms 'no IPL postponement' even as Maharashtra opposes the tourney for corona Outbreak
ఐపీఎల్​ ట్రోఫీ

రోడ్​ సేఫ్టీ సిరీస్​కు నో ప్రాబ్లమ్​!

ప్రస్తుతం ముంబయిలోని వాంఖడేలోనే రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ జరుగుతోంది. భారత్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్​లను భారీ సంఖ్యలోనే అభిమానులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇందుకు మాత్రం కూటమి ప్రభుత్వం వ్యతిరేకించలేదు! ఇదిలా ఉండగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ మాత్రం ఐపీఎల్‌ జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాడు.

"ఐపీఎల్‌ జరుగుతుంది. అన్ని దేశాల్లో క్రికెట్‌ టోర్నీలు కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్‌ ఇప్పటికే శ్రీలంక చేరుకుంది. దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఇబ్బందులేమీ లేవు. కౌంటీ జట్లైతే ప్రపంచమంతా పర్యటిస్తున్నాయి. అబుదాబి, యూఏఈకీ వెళ్తున్నాయి. అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. మేం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. అవి ఎలాంటి జాగ్రత్తలో నాకైతే తెలియదు. వైద్య సిబ్బంది వాటి గురించి వివరిస్తారు. వైద్యపరమైన ఇబ్బందులన్నీ ఆ బృందమే పరిష్కరిస్తుంది. షెడ్యూల్​ ప్రకారమే అన్ని టోర్నీలు జరుగుతాయి"

గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

నేడు కోర్టులో విచారణ..

కరోనా వైరస్ (కొవిడ్‌-19) వ్యాప్తి కారణంగా ఐపీఎల్​ టోర్నీ​ నిర్వహించొద్దని.. మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై నేడు విచారణ జరగనుంది. దీనిపై జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, జస్టిస్​ కృష్ణన్‌ రామస్వామి డివిజన్ బెంచ్‌ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.