ETV Bharat / sports

సైనీ X శార్దూల్​: తుదిజట్టులో స్థానం దక్కేదెవరికి?

author img

By

Published : Jan 5, 2021, 9:34 PM IST

గాయపడిన ఉమేశ్​ స్థానంలో ఏ బౌలర్​ను ఎంపికచేయాలన్న దానిపై టీమ్​ఇండియా యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. జట్టులో మూడో పేసర్​ స్థానం కోసం యువ ఆటగాళ్లు నవదీప్​ సైనీ, శార్దూల్​ ఠాకూర్​లలో ఎవర్ని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

shardul or saini big question in playing XI for Sydney test
సైనీXశార్దూల్​: తుదిజట్టులో స్థానం దక్కేదెవరికి?

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమ్‌ఇండియాకు మరో తలనొప్పి! గాయపడ్డ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో ఎవరిని ఆడించాలా అని జట్టు యాజమాన్యం తల పట్టుకొంది. యువపేసర్‌ నవదీప్‌ సైనీ, లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల శార్దూల్‌ ఠాకూర్‌లో ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధం నెలకొంది. ఫామ్‌లేమితో సతమతం అవుతున్న మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్‌ శర్మ రావడం ఖాయమైంది. స్థిరంగా, నిలకడగా ఆడుతున్న శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి హిట్‌మ్యాన్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గత ఎనిమిది టెస్టు ఇన్నింగ్సుల్లో ఏడింట్లో విఫలం కావడం వల్ల మయాంక్‌ చోటు కోల్పోక తప్పడం లేదు.

కొన్ని రోజుల క్రితం శార్దూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయమని చర్చ నడిచింది. కాగా అత్యంత వేగంగా బంతులు విసరగల సైనీని తీసుకుంటే బాగుంటుందని టీమ్‌ఇండియా సీనియర్లు భావిస్తున్నారని సమాచారం. మంగళవారం సిడ్నీ క్రికెట్‌ పిచ్‌పై కవర్లు తొలగించకపోవడం వల్ల బౌలింగ్‌ విభాగంపై అంచనాకు రాలేకపోయారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల పిచ్‌పై కవర్లు తొలగించలేదు. ఒకవేళ పిచ్‌పై తేమ ఉంటే ఠాకూర్‌ను తీసుకోవచ్చు. ఫ్లాట్‌గా ఉంటే మాత్రం పాత బంతిని రివర్స్‌స్వింగ్‌ చేయగల సైనీకే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఆసీస్‌ను దెబ్బకొట్టొచ్చన్నది టీమ్‌ఇండియా ప్రణాళిక.

సైనీకి జట్టులో చోటు దక్కితే ఈ మ్యాచ్​తో టెస్టుల్లో అతడు అరంగేట్రం చేస్తాడు. శార్దూల్‌ ఠాకూర్‌కూ ఇదొక అరంగేట్రం లాంటిదే. ఎందుకంటే రెండేళ్ల క్రితం అతనాడిన తొలి మ్యాచ్​లో తొలి ఓవర్‌ పూర్తికాకముందే గాయంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టులో చోటు లభించలేదు. తాజాగా మూడో పేసర్‌ స్థానంలో నటరాజన్‌ పేరూ వినిపిస్తోంది. తెలుపు రంగు జెర్సీలో అతడు ఫొటోషూట్‌లో పాల్గొనడం చర్చకు తావిచ్చింది. 20 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచులాడిన నట్టూ ఏడాది క్రితం దేశవాళీలో సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడాడు. చెపాక్‌ వేదికగా రైల్వేస్‌తో జరిగిన మ్యాచులో 11 ఓవర్లు విసిరి మూడు వికెట్లు తీశాడు. మొత్తానికి మూడో టెస్టులో మూడో పేసర్‌ ఎవరో తెలుసుకొనేందుకు బుధవారం వరకు ఆగాల్సిందే.

టీమ్‌ఇండియా అంచనా జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (కెప్టెన్​), హనుమ విహారి, రిషభ్‌ పంత్ ‌(వికెట్​ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌/నవదీప్‌ సైనీ.

ఇదీ చూడండి: స్కూల్​ లెవల్​​ క్రికెట్​ ఆడుతున్నారు: అక్తర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.