ETV Bharat / sports

'మీరు చెప్పినట్లు వింటా.. వ్యాఖ్యాతగా తీసుకోండి'

author img

By

Published : Jul 31, 2020, 11:20 AM IST

sanjay manjrekar want to return as commentator
సంజయ్​ మంజ్రేకర్​

ఈ ఏడాది ఐపీఎల్​కు తనను వ్యాఖ్యాతగా తీసుకోవాలని మాజీ బ్యాట్స్​మన్​ సంజయ్​ మంజ్రేకర్​ బీసీసీఐని కోరాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఈ లీగ్​ ప్రారంభం కానుంది.

యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​కు తనను వ్యాఖ్యాతగా తీసుకెళ్లమని భారత మాజీ బ్యాట్స్​మన్​ సంజయ్​ మంజ్రేకర్​ బీసీసీఐని కోరాడు. ఈ మేరకు బోర్డుకు మెయిల్​ చేశాడు. ఈ ఏడాది మార్చిలో భారత్​- దక్షిణాఫ్రికా వన్డే సిరీస్​కు ముందు మంజ్రేకర్​ను బోర్డు కామెంటరీ ప్యానెల్​ నుంచి తొలగించింది బీసీసీఐ. అయితే, ఈ సిరీస్​ను కరోనా కారణంగా రద్దు చేశారు.

"అపెక్స్​ కౌన్సిల్​ గౌరవనీయ సభ్యులకు నమస్కారం. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నా. వ్యాఖ్యాతగా నా స్థానంపై ఇప్పటికే నేను పంపిన మెయిల్​ను మీరు స్వీకరించారు. ఐపీఎల్​ తేదీలు ప్రకటించిన నేపథ్యంలో బీసీసీఐ కామెంటరీ ప్యానెల్​ను ఎన్నుకుంటుంది. మీరు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ధన్యవాదాలు."

-సంజయ్​ మంజ్రేకర్​, వ్యాఖ్యాత​

గతేడాది ప్రపంచకప్​లో ఆల్​రౌండర్​ జడేజాపై మంజ్రేకర్​ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీమ్​ఇండియాలోని కొంతమంది ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కామెంటరీ ప్యానెల్​ నుంచి బోర్డు అతన్ని తొలగించింది. ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. "ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తూ.. మంజ్రేకర్​ను క్షమించాలి. జడేజాపై చేసిన వ్యాఖ్యలకు అతను ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు. అంతే కాకుండా టీవీ వ్యాఖ్యాతల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చాడు. అన్నింటికంటే అతను చాలా చక్కటి​ వ్యాఖ్యాత" అని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.