ETV Bharat / sports

ఐపీఎల్ 2021: ఫ్రాంచైజీల వారిగా చిన్నోడు-పెద్దోడు!

author img

By

Published : Mar 30, 2021, 9:45 AM IST

Updated : Mar 30, 2021, 3:19 PM IST

మరో కొద్దిరోజుల్లో ఐపీఎల్ 14వ సీజన్​ మొదలుకాబోతుంది. అన్ని ఫ్రాంచైజీలు వారివారి ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని జట్లలో అతిపెద్ద, అతి చిన్న వయసు గల ఆటగాళ్లెవరో చూద్దాం.​

IPL 2021:
ఐపీఎల్ 2021

ఐపీఎల్ 14వ సీజన్​ కోసం ప్రాక్టీస్​ను ముమ్మరం చేశాయి ఫ్రాంచైజీలు. విజేతగా నిలిచేందుకు అన్ని జట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈసారి మెగా వేలం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా మినీ వేలం మాత్రమే నిర్వహించారు. ఇందులో కొన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయగా మరికొన్ని ఫ్రాంచైజీలు యువకుల వైపు ఆసక్తి కనబర్చాయి. ప్రస్తుతం ప్రతి జట్టు జూనియర్లు, సీనియర్లతో సమతూకంగా ఉన్నాయి. 40కి పైగా వయసున్న క్రిస్ గేల్, ఇమ్రాన్ తాహిర్ వంటి ఆటగాళ్లు ఇంకా తమ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే దేవదత్ పడిక్కల్, శుభ్​మన్ గిల్ వంటి యువకులు పరుగుల వరద పారించాలని కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో ప్రతి జట్టులోని అతిపెద్ద, అతిచిన్న వయసు గల ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్

పెద్దోడు-ఇమ్రాన్ తాహిర్

దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్​లోనే పెద్ద వయసు గల వాడు కాక.. ఈ సీజన్​లోనే అతి ఎక్కువ వయసు కలిగిన ఆటగాడు. ఇతడు శనివారం నాడు తన 42వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. 2019 సీజన్​లో 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ సాధించాడు. కానీ గతేడాది మాత్రం ఇతడికి తగిన అవకాశాలు ఇవ్వలేదు. ఎక్కువ మ్యాచ్​లకు బెంచ్​కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్​లో 58 మ్యాచ్​లాడిన తాహిర్ 80 వికెట్లు దక్కించుకున్నాడు.

tahir
తాహిర్

చిన్నోడు-భగత్ వర్మ

దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన హైదరాబాద్​కు చెందిన భగత్ వర్మ.. ఐపీఎల్​లోనూ రాణించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సీజన్​ వేలంలో ఈ 22 ఏళ్ల బౌలింగ్ ఆల్​రౌండర్​ను 20 లక్షలు పెట్టి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. తన నైపుణ్యాలు పెంపొందిచుకోవడానికి ఈ లీగ్​ ఎంతగానో దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. ​

దిల్లీ క్యాపిటల్స్

పెద్దోడు - అమిత్ మిశ్రా

ఇప్పటివరకు జరిగిన 13 ఐపీఎల్​ సీజన్​లలోనూ పాల్గొన్న అతి కొద్దిమంది ఆటగాళ్లలో అమిత్ మిశ్రా ఒకడు. 38 ఏళ్ల ఈ స్పిన్నర్​ను గత వేలంలో దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్​లో 150 మ్యాచ్​లాడిన మిశ్రా 160 వికెట్లు సాధించాడు. లీగ్​లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో మలింగ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. గత సీజన్​లోనూ మంచి ఫామ్​లో కనిపించినా.. గాయం కారణంగా దూరమయ్యాడు.

చిన్నోడు - పృథ్వీ షా

దిల్లీ క్యాపిటల్స్ జట్టులో 21 ఏళ్ల పృథ్వీ షా చిన్నవాడు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటున్న షా.. టీమ్​ఇండియా భవిష్యత్ స్టార్​గా గుర్తింపు పొందాడు. గత సీజన్​ ప్రారంభంలో మంచి స్కోర్లు సాధించినా.. వెంటనే ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడ్డాడు. ఐపీఎల్ 2020లో 13 మ్యాచ్​ల్లో 228 పరుగులు సాధించాడు. ఈ ఏడాది​ విజయ్ హజారే ట్రోఫీలో మూడు సెంచరీలతో సత్తాచాటాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ (227) కూడా ఉంది. దీంతో ఈసారి ఇతడిపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటివరకు 38 ఐపీఎల్ మ్యాచ్​లాడిన షా 139 స్ట్రైక్​ రేట్​తో 826 పరుగులు సాధించాడు.

prithvi shah
పృథ్వీ షా

కోల్​కతా నైట్​రైడర్స్

పెద్దోడు - హర్భజన్ సింగ్

గతేడాది వ్యక్తిగత కారణాల వల్ల సీజన్​కు దూరంగా ఉన్న టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ఈ సీజన్​లో మళ్లీ బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది వేలానికి ముందు ఇతడిని చెన్నై సూపర్ కింగ్స్ వదిలేయగా.. కోల్​కతా నైట్​రైడర్స్ 2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 40 ఏళ్ల భజ్జీ ఇప్పటివరకు 160 మ్యాచ్​లాడి 150 వికెట్లు సాధించాడు.

చిన్నోడు - కమలేశ్ నాగర్​కోటి

2018 అండర్​-19 ప్రపంచకప్​లో టీమ్ఇండియా విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు యువ పేసర్ కమలేశ్ నాగర్​కోటి. ప్రస్తుతం ఈ టీమ్​లో ఉన్న ముగ్గురు కోల్​కతా నైట్​రైడర్స్​కు ఆడుతున్నారు. గత రెండు సీజన్లలోనూ గాయాల కారణంగా ఎక్కువగా మ్యాచ్​లు ఆడని ఇతడు.. చివరి సీజన్​ ఆఖర్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్​లాడిన ఇతడు 5 వికెట్లు దక్కించుకున్నాడు.

kamalesh
కమలేశ్ నాగర్​కోటి

ముంబయి ఇండియన్స్

పెద్దోడు - రోహిత్ శర్మ

ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఈ జట్టులో అందరి కంటే పెద్దవాడు. ఈ జట్టులోని విండీస్ విధ్వంసకర వీరుడు పొలార్డ్ కంటే హిట్​మ్యాన్ 15 రోజులు పెద్ద. ప్రస్తుతం వీరిద్దరికి 33 ఏళ్లు. ఐపీఎల్​లో 2008లో అరంగేట్రం చేసిన రోహిత్ 2011లో ముంబయి జట్టులో చేరాడు. ఇప్పటివరకు జట్టుకు 5 ట్రోఫీలు అందించి కెప్టెన్​గా ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 200 మ్యాచ్​లాడి 5230 రన్స్ సాధించాడు. లీగ్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. గత సీజన్​లో 12 మ్యాచ్​లాడి 332 పరుగులు సాధించాడు.

Rohit
రోహిత్ శర్మ

చిన్నోడు - మార్కో జాన్సెన్

దక్షిణాఫ్రికా యువ బౌలర్ మార్కో జాన్సెన్​ను ఈ సీజన్​ వేలంలో 20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబయి. ఇప్పటివరకు తానేంటో నిరూపించుకోని ఈ 20 ఏళ్ల ఆటగాడిని తీసుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్లో ఆడుతోన్న ఇతడిని డికాక్​ కారణంగా జట్టులోకి తీసుకున్నారు.

పంజాబ్ కింగ్స్

పెద్దోడు - క్రిస్ గేల్

నాలుగు తరాల క్రికెటర్లతో ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇటీవల చోటు సంపాదించాడు క్రిస్ గేల్. 41 ఏళ్ల గేల్​ ఇప్పటికీ తనలో బ్యాటింగ్ నైపుణ్యం తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉన్నాడు. గత సీజన్​లో 7 మ్యాచ్​లాడి 137 స్ట్రైక్​ రేట్​తో 288 పరుగులు సాధించాడు. అలాగే లీగ్​లో 132 మ్యాచ్​లాడి 4772 రన్స్​తో కొనసాగుతున్నాడు.

చిన్నోడు - రవి బిష్ణోయ్

20 ఏళ్ల రవి బిష్ణోయ్ పంజాబ్ టీమ్​లో అతి చిన్నవాడు. 2020లో జరిగిన అండర్-19 ప్రపంచకప్​లో పాల్గొన్న భారత జట్టులో సభ్యుడు. ఈ టోర్నీలో భారత్ రన్నరప్​గా నిలిచింది. ఈ టోర్నీలో ప్రదర్శనతో ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన ఇతడు సత్తాచాటాడు. గత సీజన్​లో 14 మ్యాచ్​లాడిన రవి 12 వికెట్లు సాధించాడు. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ 7 మ్యాచ్​ల్లో 11 వికెట్లు సాధించి మెప్పించాడు.

ravi bishnoi
రవి బిష్ణోయ్

రాజస్థాన్ రాయల్స్

పెద్దోడు - ఆండ్రూ టై

కొన్నేళ్లుగా టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకుని వివిధ లీగ్​ల్లో సత్తాచాటుతున్నాడు ఆండ్రూ టై. 34 ఏళ్ల ఈ బౌలర్​ ఈ ఏడాది రాజస్థాన్​లో అతి పెద్ద వయసు గల ఆటగాడు. ​డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించే ఇతడు 2018లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ కూడా సాధించాడు.

Andrew tye
ఆండ్రూ టై

చిన్నోడు - ఆకాశ్ సింగ్

ఈ సీజన్​లో అతిచిన్న వయసు గల ఆటగాళ్ల జాబితాలో ముందున్నాడు ఆకాశ్ సింగ్. ఇతడికి ప్రస్తుతం 18 ఏళ్లు. ఈ వేలానికి ముందు ఇతడిని వదులుకున్న రాజస్థాన్​.. మళ్లీ 20 లక్షలకు కొనుగోలు చేసింది. జోఫ్రా ఆర్చర్, క్రిస్ మోరిస్​ లాంటి బౌలర్లతో ఉన్న ఆర్​ఆర్​.. ఈసారి కొత్త బంతితో ఇతడిని ప్రయత్నించొచ్చు. ఇప్పటివరకు 2 టీ20లు ఆడిన ఆకాశ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

పెద్దోడు - డేనియల్ క్రిస్టియన్

2019, 2020 సీజన్​లలో ఎవరూ కొనుగోలు చేయని డేనియల్ క్రిస్టియన్ ఈ సీజన్​తో ఐపీఎల్​లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ 37 ఏళ్ల ఆల్​రౌండర్​ను ఈ ఏడాది వేలంలో 4.8 కోట్ల ధరకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఇప్పటివరకు 40 మ్యాచ్​లాడిన క్రిస్టియన్ 119 స్ట్రైక్​ రేట్​తో 446 పరుగులు సాధించాడు. అలాగే 34 వికెట్లు దక్కించుకున్నాడు.

చిన్నోడు - దేవదత్ పడిక్కల్

గతేడాది ఆర్సీబీకి ఓపెనింగ్ చేసిన 20 ఏళ్ల దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టులో ప్రధాన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. గత సీజన్​లో పరుగుల వరద పారించి ఐపీఎల్​లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 15 మ్యాచ్​లాడిన దేవదత్​ 125 స్ట్రైక్​ రేట్​తో 473 పరుగులు సాధించాడు.

Devdatt
దేవదత్​ పడిక్కల్

సన్​రైజర్స్ హైదరాబాద్

పెద్దోడు - వృద్ధిమాన్ సాహా

ధోనీ తరంలో వికెట్ కీపర్​గా కెరీర్​ ప్రారంభించి వెలుగులోకి రాని క్రికెటర్ల జాబితాలో వృద్ధిమాన్ సాహా ఒకడు. 36 ఏళ్ల ఈ క్రికెటర్ ప్రస్తుతం టీమ్ఇండియాలో చోటు కోసం పోరాడుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్​ చివర్లో అవకాశం దక్కించుకున్న సాహా నాలుగు మ్యాచ్​ల్లో 139 స్ట్రైక్​ రేట్​తో 214 పరుగులు చేసి మెప్పించాడు. ఇప్పటివరకు 124 ఐపీఎల్ మ్యాచ్​లాడిన సాహా 132 స్ట్రైక్​ రేట్​తో 1979 పరుగులు సాధించాడు.

saha
సాహా

చిన్నోడు - అబ్దుల్ సమద్

టీమ్ఇండియా యువ క్రికెటర్లలో అద్భుత ఫినిషర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు సమద్. గతేడాది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సన్​రైజర్స్ బ్యాటింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా మారాడు. దేశవాళీ టోర్నీలో జమ్ము కశ్మీర్​కు ఆడే సమద్.. పార్ట్​టైమ్ లెగ్ స్నిన్నర్​గాను సేవలు అందించగలడు. ఇప్పటి వరకు 12 ఐపీఎల్ మ్యాచ్​లాడిన సమద్ 170 స్ట్రైక్​ రేట్​తో 111 పరుగులు సాధించాడు.

Last Updated : Mar 30, 2021, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.