ETV Bharat / sports

ఈ బ్యాట్స్​మెన్​కు ఆ బౌలర్లతో చాలా ఇబ్బందే!

author img

By

Published : Nov 26, 2020, 6:02 PM IST

virat vs rohit
ఈ అత్యుత్తమ బ్యాట్స్​మన్​కు ఏ బౌలర్​తో కష్టం!

ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లుగా రాణిస్తున్న ఆటగాళ్లకు బౌలర్లంటే భయం ఉంటుందా? విరాట్​ కోహ్లీ, రోహిత్​శర్మ, కేన్​ విలియమ్సన్​, డేవిడ్​ వార్నర్​, డికాక్​ లాంటి ప్లేయర్లకు ఇబ్బందులు సృష్టించే బౌలర్లు ఉన్నారా? అంటే అవునని సమాధానాలు వచ్చాయి. ఆయా క్రికెటర్లు తాము ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల పేర్లను వారే గతంలో వెల్లడించారు.

వాళ్లంతా బ్యాట్​ పట్టుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. మైదానంలోని ప్రత్యర్థి ఎంతటి వాడైనా సరే వణుకు పుట్టించగలరు. వేగవంతమైన బంతులనైనా దీటుగా ఎదుర్కోగల ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లు. ఆయా దేశాల తరఫున రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ.. టాప్​ క్రికెటర్లుగా ముద్ర గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అలాంటి ఆటగాళ్లకూ కొందరు బౌలర్లతో ఇబ్బందులు ఉన్నాయట. వారిని ఎదుర్కోవడం కాస్త కఠినంగా ఉంటుందట. అందుకే వారితో మ్యాచ్​ ఉన్న సమయంలో ఎక్కువగా సాధన చేస్తారట. మరి ఈ జాబితాలో కోహ్లీ, రోహిత్​ శర్మ లాంటి స్టార్​ క్రికెటర్లూ ఉండటం విశేషం. ఓసారి ఆయా ఆటగాళ్లకు చెక్​ పెట్టే బౌలర్లు ఎవరో చూద్దామా?

8.క్వింటన్​ డికాక్​

మైదానంలో డైనమైట్​లా ఉండే ఈ బ్యాట్స్​మన్​.. నిలకడైన ప్రదర్శనకు కేరాఫ్​ అడ్రస్​. నెమ్మదిగా ఆడగలడు. రన్​రేట్​ ఎక్కువగా ఉన్న సమయంలో గేరు కూడా మార్చగలడు. ఇటీవల ఐపీఎల్​లోనూ ముంబయి ఇండియన్స్​ తరఫున అదరగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్​లోనూ డికాక్​కు మంచి రికార్డు ఉంది. దక్షిణాఫ్రికా తరఫున ఆడే ఇతడు.. ఇప్పటివరకు 5 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు ఉన్నాయి. సగటు 44.65గా ఉంది. టీ20ల్లో స్ట్రైక్​ రేటు దాదాపు 140గా కొనసాగుతోంది. మరి ఇంత విధ్వంసం సృష్టించగలిగే ఈ ఆటగాడికి.. ఓ బౌలర్​తో చిక్కులు ఉన్నాయట. అతడెవరో కాదు శ్రీలంక దిగ్గజ పేసర్​ లసిత్​ మలింగ. ఇతడి బౌలింగ్​ ఎదుర్కోవడం కాస్త కష్టమని ఓసారి చెప్పాడు. మలింగ యార్కర్లు తనతో పాటు ఇతర బ్యాట్స్​మెన్​ను బాగా ఇబ్బందిపెడతాయని పేర్కొన్నాడు. ఇప్పటికే మలింగ వన్డేల్లో 338 వికెట్లు సాధించాడు. టీ20ల్లో 107 వికెట్లు తీశాడు.

top batsmen in world class cricket
క్వింటన్​ డికాక్​

7.జో రూట్​

ఇంగ్లాండ్​ జట్టుకు వెన్నెముకలా ఉన్న ఆటగాడు జో రూట్​. ఇప్పటికే టెస్టుల్లో 8వేల పరుగులు సాధించిన ఈ సీనియర్​.. వన్డేల్లోనూ తన దేశం తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. 30 అంతర్జాతీయ సెంచరీలు ఇతడి ఖాతాలో ఉన్నాయి. నిలకడకు మారుపేరైన రూట్​కు ఆస్ట్రేలియా పేసర్​ కమిన్స్​ బౌలింగ్​ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందట. అందుకేనేమో కమిన్స్​ బౌలింగ్​లో 7 సార్లు ఔటయ్యాడు. ఇక లయన్​, హేజెల్​వుడ్​ కూడా ఏడేసి సార్లు రూట్​ను ఔట్​ చేశారు.

top batsmen in world class cricket
జో రూట్​

6.బాబర్​ అజమ్

యువ ఆటగాళ్లలో తమదైన ప్రదర్శనతో అందరి చేత శెభాష్​ అనిపించుకుంటున్న ఆటగాడు బాబర్​ అజామ్​. ఈ పాకిస్థాన్​ క్రికెటర్..​ ఫ్రంట్​ ఫుట్​, బ్యాక్​ ఫుట్​ను అలవోక మారుస్తూ అద్భుతంగా బ్యాటింగ్​ చేయగలడు. అందుకే టీ20ల్లో వేగంగా వేయి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో 50 సగటుతో కొనసాగుతున్నాడు. ఇతడు ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల జాబితా ఎక్కువగానే ఉంది. మిచెల్​ స్టార్క్​, జోష్​ హేజెల్​వుడ్​, పాట్​ కమిన్స్​, ట్రెంట్​ బౌల్ట్​ బౌలింగ్​లో కాస్త ఇబ్బందిపడతానని అతడే స్వయంగా గతంలో వెల్లడించాడు. వీరందరూ గంటకు 140 కి.మీ వేగంతో అలవోకగా బంతులు వేయగలరు. ఇందులో స్టార్క్​ 450 వికెట్లు తీశాడు. బౌల్ట్​ టెస్టు క్రికెట్​లో న్యూజిలాండ్​ తరఫున 250 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కమిన్స్​ ప్రస్తుతం ఐసీసీ బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో టాప్​లో ఉన్నాడు.

top batsmen in world class cricket
బాబార్​ అజామ్​

5.డేవిడ్​ వార్నర్​

అంతర్జాతీయ క్రికెట్​లో ఆస్ట్రేలియా తరఫున 15 వేల పరుగులు సాధించాడు డేవిడ్​ వార్నర్​. ఎలాంటి ప్రత్యర్థులనైనా దీటుగా ఎదుర్కోగలడు. మంచి ఓపెనర్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఐపీఎల్​లోనూ సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టును ముందుండి నడిపించాడు. టెస్టు క్రికెట్​లో ట్రిపుల్​ సెంచరీ చేసిన ఈ ఆసీస్​ ఆటగాడు.. వన్డేల్లో పాంటింగ్​ తర్వాత ఎక్కువ శతకాలు సాధించిన రెండో ఆస్ట్రేలియన్​గా రికార్డుల్లోకెక్కాడు. మరి ఇంతగా రాణిస్తున్న ఇతడికీ కొందరు బౌలర్లతో చిక్కులున్నాయట. దక్షిణాఫ్రికా పేసర్లు డేల్​ స్టెయిన్​, మోర్నీ మోర్కెల్​ను ఎదుర్కోవడం కాస్త కష్టమని వార్నర్ చెప్పాడు. స్టెయిన్​-మోర్కెల్​ జోడీ టెస్టు క్రికెట్​లో దాదాపు 700 వికెట్లు తీసింది. 10 ఏళ్ల పాటు సఫారీ జట్టు బౌలింగ్​ను ఈ ఇద్దరు యోధులు భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లారు.

top batsmen in world class cricket
డేవిడ్​ వార్నర్​

4.కేన్​ విలియమ్సన్​

నిలకడైన బ్యాటింగ్​, నెమ్మదైన​ వ్యక్తిత్వంతో అందరికీ ఇష్టమైన బ్యాట్స్​మన్​ కేన్​ విలియమ్సన్​. ఇటీవల ముగిసిన ఐపీఎల్​లో హైదరాబాద్​ తరఫున అదరగొట్టాడు. న్యూజిలాండ్​కు ఆల్​టైమ్​ గ్రేట్​ క్రికెటర్లలో ఇతడూ ఒకరు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​లో 14వేల పరుగులు​ చేశాడు. 50 సగటుతో తమ దేశ జట్టులో కెప్టెన్​గా, కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో కివీస్​ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మూడో బ్యాట్స్​మన్​గానూ గుర్తింపు పొందాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో న్యూజిలాండ్​ తరఫున ఎక్కువ సెంచరీలూ ఇతడి పేరిటే ఉన్నాయి. అయితే ఇలాంటి బ్యాట్స్​మన్​కు ఓ బౌలర్​ అంటే కాస్త భయం ఉంది. అతడే దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​. గతంలో తన వేగవంతమైన బౌలింగ్​తో కేన్​ గార్డును స్టెయిన్​ బ్రేక్​ చేశాడట. అప్పట్నుంచి స్టెయిన్​ బౌలింగ్​ అంటే కాస్త జాగ్రత్తపడతాడట. ఈ విషయాన్ని విలియమ్సన్​ స్వయంగా వెల్లడించాడు.

top batsmen in world class cricket
కేన్​ విలియమ్సన్​

3.స్టీవ్​ స్మిత్​

ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ టెస్టు బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకున్నాడు ఆసీస్ ప్రముఖ ఆటగాడు స్టీవ్​ స్మిత్​. ఇప్పటికే టెస్టుల్లో 7వేల పరుగులు చేశాడు. మొత్తం 26 సెంచరీలు తన ఖాతాలో ఉన్నాయి. టెస్టు రన్​ మెషీన్​ అయిన స్మిత్​.. తనకు రవీంద్ర జడేజా బౌలింగ్ అంటే కొంచెం కష్టమని పేర్కొన్నాడు. ఉపఖండం పిచ్​లలో జడేజా అద్భుతంగా రాణిస్తాడని అన్నాడు. విభిన్న వేరియేషన్లు​ మారుస్తూ.. ఒకే లెంగ్త్​లో బంతులు వేయడం జడేజాకే సాధ్యమని​ చెప్పాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా-భారత్​ సిరీస్​లో తలపడనున్నారు.

top batsmen in world class cricket
స్టీవ్​ స్మిత్​

2.రోహిత్​ శర్మ

ఆధునిక​ క్రికెట్​లో హిట్​మ్యాన్​గా, సిక్సర్ల వీరుడిగా రోహిత్​శర్మకు మంచి పేరుంది. ఎలాంటి బంతినైనా అలవోకగా బౌండరీకి తరలించగల సమర్థుడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో అయితే పరుగులు సాధించడంలో దిట్ట. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, మూడు ద్విశతకాలు లాంటి రికార్డులు రోహిత్​కే సాధ్యమయ్యాయి. ఇప్పటివరకు వన్డేల్లో 29 శతకాలు నమోదు చేశాడు. ఇంతటి ట్రాక్​ రికార్డు ఉన్న రోహిత్​కు బ్రెట్​ లీ, స్టెయిన్​ బౌలింగ్​ అంటే కాస్త కష్టమట. ఈ విషయాన్ని రోహిత్ గతంలో వెల్లడించాడు. ఐపీఎల్​లో ఐదోసారి ముంబయి జట్టుకు ట్రోఫీ అందించిన ఈ సారథి.. గాయం కారణంగా త్వరలో ప్రారంభం కానున్న భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​లకు దూరమయ్యాడు.

top batsmen in world class cricket
రోహిత్​ శర్మ

1.విరాట్​ కోహ్లీ

పరుగులు వీరుడు.. వన్డే క్రికెట్​లో 10వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న బ్యాట్స్​మన్​ ఇతడు. ఇప్పటివరకు టెస్టుల్లో 7 డబుల్​ సెంచరీలు చేశాడు. మొత్తంగా కెరీర్​లో 70 అంతర్జాతీయ శతకాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రత్యర్థినైనా ఎదుర్కోగల బ్యాటింగ్​ టెక్నిక్​ ఇతడి సొంతం. అందుకే మూడు ఫార్మాట్లలో ఇతడు అలవోకగా పరుగుల వరద పారిస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో 50 సగటు ఉన్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మరి ఎందరో కఠినమైన బౌలర్లను ఎదుర్కొన్న విరాట్​.. తనకు పాకిస్థాన్​ పేసర్​ మహ్మద్​ ఆమిర్​ బౌలింగ్​ ఎదుర్కొన్నప్పుడు కాస్త కష్టంగా అనిపించినట్లు చెప్పాడు. ప్రపంచ టాప్​-3 కఠినమైన బౌలర్లలో ఆమిర్​ కచ్చితంగా ఒకడని విరాట్​ ప్రశంసించాడు.

top batsmen in world class cricket
విరాట్​ కోహ్లీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.