ETV Bharat / sports

IPL 2022: ఈ సీజన్​లోనూ సీఎస్కేనే ఫేవరేట్​!

author img

By

Published : Mar 8, 2022, 8:25 PM IST

Chennai Super Kings: ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్​కు చేరిన జట్టుగా.. అత్యధిక అభిమానులు గల జట్టుగా.. ఐపీఎల్​లోనే రెండో విజయవంతమైన జట్టుగా పేరు సంపాదించింది చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు. మార్చి 26 నుంచి ఐపీఎల్​ ఆరంభం అవుతున్న తరుణంలో ఆ జట్టు బలాలు, బలహీనతలు తెలుసుకుందాం.

chennai super kings team
చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టు

Chennai Super Kings: డిఫెండింగ్​ ఛాంపియన్ చెన్నై సూపర్​కింగ్స్​ ఐపీఎల్​ 2022 సీజన్​కు సిద్ధమవుతోంది. కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ సహా పలువురు ఆటగాళ్లు,సిబ్బంది సూరత్​లోని ప్రీ సీజన్​ క్యాంప్​కు చేరుకున్నారు. లాల్​బాయి కాంట్రాక్టర్​ స్టేడియంలో 20 రోజుల పాటు సాగే క్యాంప్​లో ఆటగాళ్లందరూ పాల్గొనాలని యాజమాన్యం కోరింది.​

ఐపీఎల్ 2022​ షెడ్యూల్​ను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మార్చి 26న ప్రారంభమయ్యే టోర్నీలో తొలి మ్యాచ్​లో చెన్నై, కోల్​కతా మధ్య జరగనుంది. ఈ ఐపీఎల్​ ప్రారంభం నేపథ్యంలో ఆ జట్టు బలాలు, బలహీనతలు ఎంటో ఒకసారి చూద్దాం.

బలాలు:

ప్రధాన ఆటగాళ్ల కొనసాగింపు..

చెన్నై జట్టు తమ ప్రధాన ఆటగాళ్లను కొనసాగిస్తునే ఉండటం వల్ల టీమ్​లో మార్పులు పెద్దగా ఉండే అవకాశం లేదు. అంబటి రాయుడు, డ్వేన్​ బ్రావో, రాబిన్​ ఉతప్ప, దీపక్ చాహర్​లను మెగా ఆక్షన్​లో తిరిగికొనుక్కుంది. ఆటగాళ్ల మధ్య సమన్వయం కుదరించడానికి ఫ్రాంచైజీలు అనేక ప్రయత్నాలు చేస్తాయి. కానీ చెన్నై జట్టుకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా మంది ఆటగాళ్లు గత కొన్నేళ్లుగా కలిసి ఆడుతున్నారు. ఇది చెన్నై జట్టుకు కచ్చితంగా ప్రయోజనం కలిగించేదే.

కీలక ఆటగాళ్లు..

చెన్నై జట్టు వ్యక్తిగత ప్రదర్శనల కన్నా జట్టు బలాన్నే విశ్వసిస్తుంది. జట్టులోని ప్రధాన ఆటగాడు, ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్​లో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్​లో 175 పరుగులు, 9 వికెట్లు తీసి భారత్​ను ఒంటిచేత్తో గెలిపించాడు. గత సీజన్లలో అన్ని విభాగాల్లో రాణించిన జడేజా అదే ఉత్సాహంతో ఈసారి ఐపీఎల్​లో అడుగుపెడుతున్నాడు. అతడితో పాటు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీపై చెన్నై జట్టు ఆధారపడుతోంది. గత సీజన్​లో మూడో స్థానంలో బ్యాటింగ్​ వచ్చిన మొయిన్​.. మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆఫ్​ స్పిన్నరైన అలీ గత సీజన్​లో చాలా తక్కువగా బౌలింగ్​ చేశాడు. జడేజా-మొయిన్ ద్వయం ఈ సారి ఐపీఎల్​లో కీలక పాత్ర పోషించనుంది.​

ఒత్తిడిని జయించే లక్షణం...

ఎలాంటి సమయంలోనైనా ఒత్తిడిని జయించడం గొప్ప జట్ల లక్షణం. ఈ విషయంలో చెన్నై జట్టు మొదటివరుసలో ఉంటుంది. ప్రతిసారి ఆ జట్టు విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి కొత్త దారులను వెతుక్కుంటుంది. అందుకే చెన్నై ముంబయి ఇండియన్స్ తర్వాత ఐపీఎల్​లో విజయవంతమైన ఫ్రాంచైజీగా కొనసాగుతుంది.

గతేడాది దిల్లీతో జరిగిన క్వాలిఫైయర్​ మ్యాచ్​లో ధోనీ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. సీజన్​ మొత్తం తడబడిన కెప్టెన్​ ధోనీ.. ఆ మ్యాచ్​లో 6 బంతుల్లో 18 పరుగులు చేసి విజయాన్ని అందించాడు. ఈ అనుభవం జట్టు కఠిన పరిస్థితుల్లో ఉన్నపుడు ఉపయోగపడుతుంది.

బలహీనతలు:

ప్రధాన బౌలర్​ దీపక్​ చాహర్​ దూరం..

అత్యధిక సార్లు ఫైనల్​కు చేరిన చెన్నై జట్టుకు ఈసారి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. సీజన్​ ఆరంభం కాకముందే జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో గాయం కారణంగా ప్రధాన బౌలర్​ దీపక్​ చాహర్​ జట్టునుంచి దూరమయ్యాడు. బీసీసీఐ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం చాహర్​ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. దీంతో ఈసారి ఐపీఎల్​ మొదటి భాగానికి దూరం కానున్నాడు.

29 ఏళ్ల దీపక్​ చాహర్​ను చెన్నై జట్టు రూ. 14 కోట్ల భారీ ధరకు వేలంలో దక్కించుకుంది. బంతిని స్వింగ్ చేయడమే కాకుండా ఇన్నింగ్స్​ ప్రారంభంలోనే వికెట్​ తీసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు చాహర్​. అతడు దూరం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది.

స్టార్ ఓపెనర్​ డుప్లెసిస్​ లేకపోవడం..

2021 ఐపీఎల్​లో​ చెన్నై జట్టు టైటిల్​ గెలవడంలో ఓపెనర్లు ఫాఫ్​ డుప్లెసిస్​, రుతురాజ్​ గైక్వాడ్​ల పాత్ర కీలకమైంది. డుప్లెసిస్​ 16 మ్యాచుల్లో 45.21 సగటుతో 633 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్​ గైక్వాడ్​ 45.35 సగటుతో 635 పరుగులు చేసి ఆరెంజ్​ క్యాప్​ను గెలుపొందాడు. 136.26 స్ట్రైక్​రేట్​తో సీజన్​లోనే తొలి సెంచరీని నమోదు చేశాడు.

కానీ, ఈ సారి వేలంలో చెన్నై ఫ్రాంచైజీ డుప్లెసిస్​ను కొనలేదు. దీంతో ఇప్పుడు కొత్త ఓపెనింగ్​ జంట కోసం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్​ ఆటగాడు డెవోన్​ కాన్వే, మొయిన్ అలీ ఇద్దరిలో ఒకరిని గైక్వాడ్​కు ఓపెనింగ్​ భాగస్వామిగా తీసుకునే అవకాశం ఉంది.

ఇలా.. జట్టు పేపర్​పై బలంగానే కనిపిస్తోంది. మరి.. డాడీస్ ఆర్మీగా చెప్పుకునే టీమ్.. ఈ ఐపీఎల్ సీజన్​లో ఎప్పటిలేగా సత్తా చాటుతుందా? డిఫెండింగ్ ఛాంపియన్​గా బరిలోకి దిగుతున్న సీఎస్కే... కప్పు నిలబెట్టుకుంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: ఆర్సీబీ కొత్త సారథి ఎవరో..? ఈసారైనా కప్పు కొట్టేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.