ETV Bharat / sports

Women T20 World Cup : ఫైనల్లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీ.. టైటిల్​ ఫేవరెట్​గా ఆసీస్​

author img

By

Published : Feb 26, 2023, 10:29 AM IST

Australia Vs South Africa
Australia Vs South Africa

మొట్టమొదటి సారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగు.. సొంతగడ్డపై పోరాటమే ఆయుధంగా టోర్నీలో సంచలన ప్రదర్శన.. తొలిసారి కప్పును ముద్దాడాలనే కలతో దక్షిణాఫ్రికా. మరోవైపు ఇప్పటివరకూ జరిగిన ఏడు మహిళల టీ20 ప్రపంచకప్‌ల్లో అయిదుసార్లు టైటిల్‌.. ఓసారి రన్నరప్‌.. ఇప్పుడు వరుసగా ఏడోసారి ఫైనల్లో చోటు.. అన్ని విభాగాల్లో మేటి క్రికెటర్లతో పటిష్ఠంగా ఆస్ట్రేలియా. ఇక ఆదివారం ఈ రెండు జట్లు సమరానికి సిద్ధం కానుంది. దీంతో అభిమానులు గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్​ చివరి అంకానికి చేరింది. ఆదివారం సాయంత్రం జరగనున్న ఈ తుదిపోరుకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో పోటీ పడేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమయ్యింది. మరి కలకు, కప్‌నకు మధ్యలో ఉన్న మన కంగారూ జట్టును ఓడించి సఫారీ సేన తొలిసారి విశ్వవిజేతగా నిలుస్తుందా? లేదా ఇక ఆసిస్​ టీమ్​ తమ ఆధిపత్యాన్ని చలాయించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడనుందా అన్న విషయం ఈ మ్యాచ్​ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు అభిమానులు.

అయితే ఈ గ్రూప్‌ దశలో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థిపై కంగారూ జట్టుదే స్పష్టమైన ఆధిపత్యం. ఇప్పటివరకు జరిగిన టీ20ల్లో ఒక్కసారి కూడా దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్‌ ఓడలేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్​దే పై చేయి. ఆ మ్యాచ్‌లన్నీ టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్​లో భాగంగా జరిగినవే కావడం మరో విశేషం.

మరోవైపు వరుసగా ఏడో సారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడనున్న ఆస్ట్రేలియా టీమ్​.. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉంది. టీమ్‌ ఇండియాతో సెమీస్‌లో తడబడినప్పటికీ ఆఖరికి విజయాన్ని ముద్దాడింది. ఆఖరి బాల్​ వరకు పట్టు వదలకుండా పోరాడే తత్వమే ఆ జట్టును ప్రపంచ క్రికెట్లో తిరుగులేని స్థానంలో నిలబెట్టిందని అభిమానులు అంటున్నారు. తీవ్ర ఒత్తిడి ఉండే ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు నిలదొక్కుకోగలిగింది. దూకుడైన ఆటతీరుతో ఫలితాలు తారుమారు చేస్తున్న ఈ కంగారు జట్టు.. ఇప్పుడు ఈ తుదిపోరులోనూ సఫారీ జట్టును చిత్తుచేయాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ ఆస్ట్రేలియాను సమర్థంగా నడిపిస్తుండగా.. ఆమెతో పాటు అలీసా హీలీ, బెత్‌ మూనీ, ఆష్లీ గార్డెనర్‌ పరుగుల వేటలో సాగుతున్నారు. గార్డెనర్‌ బంతితోనూ సత్తాచాటుతోంది. బౌలింగ్‌లో ఆమెతో పాటు డార్సీ బ్రౌన్‌, మెగాన్‌ షట్‌ కీలకం కానున్నారు.

ఆస్ట్రేలియాను ఓడించేలా ప్లాన్​ చేస్తే.. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు ఓ అద్భుతమైన ముగింపు దక్కుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్​లో విజయాన్ని సాధించిన సఫారీ జట్టు.. ఫైనల్లో ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే మరింత గొప్పగా ఆడాలి. గత ఏడాది నుంచి అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా మంచి జోరు కొనసాగిస్తోంది. అలా వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌ వరకు వెళ్లగలిగింది. ఇప్పుడు ఈ పొట్టి కప్పులో తుది సమరానికి సై అంటోంది దక్షిణాఫ్రికా.

కంగారు టీమ్​లో లారా వోల్వార్ట్‌, తజ్మిన్‌ బ్రిట్స్‌ లాంటి అత్యుత్తమమైన ఓపెనర్లు ఉన్నారు. సెమీస్‌లో చెరో అర్ధశతకం సాధించిన ఈ సూపర్​ జోడీ మంచి ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఆల్‌రౌండర్‌ మరిజేన్‌ కాప్‌ కూడా ఆ జట్టులో కీలక పాత్ర పోషిస్తోంది. సెమీస్‌లో చెలరేగిన పేసర్లు షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, అయబొంగా ఖకా కూడా కప్పును గెలుచుకునేందుకు జోరులో ఉన్నాపు. ఇక ఈ జట్టుకు స్వదేశంలోని అభిమానుల మద్దతు కొండంత బలాన్ని చేకురుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.