ETV Bharat / sports

ఆసియా కప్‌ సమరానికి సిద్ధం, ఈసారి అంతకుమించి

author img

By

Published : Aug 27, 2022, 7:04 AM IST

నాలుగేళ్ల విరామం తర్వాత ఆసియా కప్‌ తిరిగొచ్చింది. ఖండంలోని అగ్రశ్రేణి జట్ల మధ్య మరోసారి ఆసక్తికర సమరానికి వేళైంది. కరోనా కారణంగా రెండు సార్లు వాయిదా పడి.. వేదికను శ్రీలంక నుంచి యూఏఈకి తరలిన టోర్నీ.. ఎట్టకేలకు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌తో పోటీలకు తెరలేవనుంది. అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ ఆరంభం నేపథ్యంలో.. ఆ పొట్టి కప్పుపై కన్నేసిన జట్లు.. ఈ ఆసియా కప్‌ను మంచి సన్నాహకంగా ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ఉన్నాయి.

asia cup 2022
ఆసియాకప్

ఆరు జట్లు.. మొత్తం 13 మ్యాచ్‌లు.. 16 రోజులు.. చివరకు ఒక విజేత. శనివారం ఆరంభమయ్యే ఆసియా కప్‌లో తొలి రోజు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ తలపడనున్నాయి. ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఆరేళ్ల తర్వాత తిరిగి టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరగబోతోంది. 2018లో వన్డే ఫార్మాట్లో మ్యాచ్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. 2016 నుంచి ఆసియా కప్‌ తర్వాత ఏ ప్రపంచకప్‌ ఉంటే.. అందుకు సన్నాహకంగా ఈ టోర్నీని అదే ఫార్మాట్లో రొటేషన్‌ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. 2016లో టీ20, 2018లో వన్డే ఫార్మాట్లో మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడు పొట్టి ఫార్మాట్లోనే జట్లు తలపడతాయి.

అంతకుమించి.. ఆసియా కప్‌లో ఈ సారి జట్ల మధ్య మరింత పోటీ ఉండడం ఖాయమనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆసియా జట్ల ఆట ప్రమాణాలు పెరగడమే అందుకు కారణం. ఈ సారి టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌తో పాటు పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, హాంకాంగ్‌ బరిలో దిగాయి. హాంకాంగ్‌ను మినహాయిస్తే మిగతా అయిదు జట్లు కూడా ఉత్తమ ప్రదర్శన చేసేవే. బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లు తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేస్తాయి. అందుకే ఈ సారి ఎప్పుడూ లేనంత నాణ్యమైన క్రికెట్‌ను చూసే అవకాశం ఉందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గ్రూప్‌- ఎలో భారత్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌, గ్రూప్‌- బిలో శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి.

కూర్పు కోసం.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో ఆడించే తమ జట్లపై తుది అంచనాకు వచ్చేందుకు ఈ దేశాలకు ఇదే మంచి అవకాశం. ఈ టోర్నీలో ఆడే జట్లనే దాదాపుగా ప్రపంచకప్‌ బరిలో దించే ఆస్కారముంది. అందుకే అన్ని జట్లూ తమ కూర్పుపై దృష్టి సారిస్తాయనడంలో సందేహం లేదు. రికార్డు స్థాయిలో ఏడు సార్లు ఆసియా కప్‌ విజేతగా నిలిచిన భారత్‌.. మరోసారి టైటిల్‌పై కన్నేసింది. పేస్‌ బౌలింగ్‌లో అనుభవ లేమి మినహా జట్టు బలంగానే ఉంది. కానీ ఈ టోర్నీలో అందరి దృష్టి విరాట్‌ కోహ్లీపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. వరుసగా విఫలమవుతున్న అతను ఈ టోర్నీతో తిరిగి ఫామ్‌ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

పోటీ గట్టిగానే.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూసే భారత్‌, పాక్‌ పోరు ఈ ఆసియా కప్‌నకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సారి చిరకాల ప్రత్యర్థులు మూడు మ్యాచ్‌ల్లో పోటీపడే అవకాశం ఉంది. మొదట గ్రూప్‌ దశలో ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడతాయి. సూపర్‌-4కు అర్హత సాధిస్తే మరోసారి అక్కడ తలపడతాయి. ఫైనల్‌ చేరితో మూడోసారి పోటీపడతాయి. గత ఏడాదిగా నిలకడగా విజయాలు సాధిస్తున్న పాక్‌ మంచి ఫామ్‌లో ఉంది. చివరగా పదేళ్ల క్రితం (2012) ఆసియా కప్‌ గెలిచిన ఆ జట్టు.. ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలకాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కొత్త కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ శిక్షణలో శ్రీలంక మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఈ టోర్నీలో ఘనమైన రికార్డు ఉన్న ఆ జట్టు ఆరోసారి విజేతగా నిలవాలనే ధ్యేయంతో కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌.. మళ్లీ షకిబ్‌ సారథ్యంలో సత్తాచాటేందుకు సై అంటోంది. మూడు సార్లు రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టు.. టైటిల్‌ బోణీ కొట్టాలని చూస్తోంది. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న అఫ్గానిస్థాన్‌.. పెద్ద జట్లకు షాకివ్వాలనే లక్ష్యంతో ఉంది.

7.. ఇప్పటిదాకా జరిగిన 14 ఆసియా కప్‌ల్లో అత్యధికంగా భారత్‌ గెలిచిన టైటిళ్లు. మూడు సార్లు ఫైనల్లో ఓడింది. శ్రీలంక అయిదు, పాకిస్థాన్‌ రెండు సార్లు ట్రోఫీ గెలిచాయి.

ఇదీ చూడండి: పాక్​తో జాగ్రత్త, ఆ తప్పులపై రోహిత్​ సేనను హెచ్చరించిన స్టైరిస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.