ETV Bharat / sports

శ్రీకాంత్​ గాయంపై వివరణ.. టోర్నీ నుంచి కశ్యప్​ ఔట్

author img

By

Published : Jan 13, 2021, 4:04 PM IST

థాయ్​లాండ్​లో ఓపెన్​లో ఆడుతున్న శ్రీకాంత్​కు కరోనా టెస్టులో భాగంగా ముక్కులో రక్తం రావడంపై బీడబ్ల్యూఎప్ వివరణ ఇచ్చింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాలి పిక్క పట్టేయడం వల్ల తొలి మ్యాచ్​లోనే ఓడిపోయాడు కశ్యప్.

kashyap
కశ్యప్​

కరోనా పరీక్షల విషయంలో థాయ్​లాండ్​ ఓపెన్​లో పాల్గొన్న ఆటగాళ్లకు భరోసా కల్పించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్​) రంగంలోకి దిగింది. టోర్నీ​ నిర్వాహకులతో ఈ విషయమై కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపింది. వైరస్​ నిర్ధరణ పరీక్షలను మరింత సురక్షితంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. మంగళవారం(జనవరి 12) ప్రారంభమైన థాయ్​ ఓపెన్​లో తనకు చేసిన కరోనా పరీక్షలో అక్కడి వైద్యుల నిర్లక్ష్యంగా ప్రవర్తించారని, దీని వల్ల తన ముక్కులో గాయమై రక్తం వచ్చిందని భారత స్టార్​ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ ఆరోపించాడు​. ఈ నేపథ్యంలోనే టెస్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది​.

శ్రీకాంత్​కు ముక్కులో నుంచి రక్తం రావడానికి గల కారణాన్ని బీడబ్ల్యూఎఫ్ వివరించింది​. "శ్రీకాంత్​కు కరోనాకు సంబంధించిన స్వాబ్​ పరీక్షలు చాలా సార్లు చేయడం వల్ల ముక్కు నుంచి రక్తం కారింది. చివరిసారి చేసిన టెస్టుకు ముందే అతడికి మూడు సార్లు పరీక్షలు నిర్వహించారు. దీంతో అతడి ముక్కులో ఉండే చిన్న రక్త నాళాలు దెబ్బతిన్నాయి. ముక్కులో సన్నని పొడవైన పుల్ల సరిగ్గా పెట్టకపోవడం వల్లే ఇలా జరిగింది. అందుకే నాలుగోసారి చేసిన పరీక్షల్లో గాయమై స్వల్ప మోతాదులో రక్తం కారింది" అని బీడబ్ల్యూఎఫ్​ వివరణ ఇచ్చింది.

కశ్యప్​ నిష్క్రమణ

బుధవారం తొలి మ్యాచ్​ ఆడిన భారత​ షట్లర్​ పరుపల్లి కశ్యప్​.. కాలి పిక్క పట్టేయడం వల్ల మధ్యలోనే వైదొలిగాడు. కెనడాకు చెందిన జాసన్​ ఆంథోనీ హో షూతో తలపడి, తొలి రౌండ్​లో 9-21, 21-13, 8-14 తేడాతో ఓడిపోయాడు.

పురుషుల డబుల్సలో దక్షిణా కొరియాకు చెందిన కిమ్​ గి జంగ్​, లి యోంగ్​ డే జోడీపై 19-21, 21-16, 21-14 తేడాతో భారత ద్వయం సాత్విక్​ సాయిరాజ్, చిరాగ్​ శెట్టి విజయం సాధించింది. మలేసియా జోడీ ఓంగ్​ యే సిన్, తియో యే యై చేతిలో 21-13, 8-21, 22-24 తేడాతో భారత జోడీ అర్జున్​ రమాచంద్రన్​, ధ్రువ్​ కపిలా ఓటమిపాలయ్యారు.

మిక్స్​డ్​ డబుల్స్​లో హాంకాంగ్​ జోడీ చంగ్​ మన్​ తంగ్​, యోంగ్​ సూ సేపై 20-22, 17-21తేడాతో భారత జోడీ సిక్కీ రెడ్డి, సుమిత్​ రెడ్డి పరాజయం చెందారు.

ఇదీ చూడండి : కరోనా పరీక్ష పేరుతో షట్లర్​ శ్రీకాంత్​పై హింస!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.