ETV Bharat / sitara

Maa oori polimera review: ట్విస్టులతో 'మా ఊరి పొలిమేర'

author img

By

Published : Dec 16, 2021, 6:30 PM IST

maa oori polimera review
మా ఊరి పొలిమేర మూవీ రివ్యూ

Movie review: మూడనమ్మకాల అంశానికి థ్రిల్లర్​ కథను జోడించి తీసిన సినిమా 'మా ఊరి పొలిమేర'. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఎందులో చూడొచ్చు? తదితర విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

చిత్రం: మా ఊరి పొలిమేర; నటీనటులు: 'సత్యం' రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను తదితరులు; సంగీతం: జ్యానీ; నిర్మాత: భోగేంద్రగుప్త; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాక్టర్‌ విశ్వనాథ్‌; డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ రిలీజ్

ఇటీవల కాలంలో కొందరు దర్శకులు సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే కొందరికి మాత్రమే సరైన వేదికలు దొరుకుతున్నాయి. అలాంటి సినిమాలకు మంచి ప్రచారమూ లభిస్తోంది. మరికొందరు దర్శకులకు ఆ అవకాశం లేక తక్కువ బడ్జెట్‌లో సినిమా చేయడానికి రాజీపడాల్సి వస్తోంది. అయితే, ఇలాంటి చిత్రాలే వాస్తవికతకు దగ్గరగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది. 'మా ఊరి పొలిమేర' చిత్రం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు 'పొలిమేర'లో ఏం జరిగింది?

maa oori polimera movie telugu review
సత్యం రాజేశ్- గెటప్ శ్రీను-బాలాదిత్య

కథేంటంటే: కొమిరి (సత్యం రాజేశ్‌), జంగయ్య(బాలాదిత్య) అన్నదమ్ములు. తెలంగాణలోని జాస్తిపల్లి అనే మారుమూల గ్రామం. కొమిరి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఊళ్లో ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాడు. భార్యబిడ్డలను పోషించడం సహా తమ్ముడు జంగయ్యను చదివిస్తాడు. జంగయ్య చదువుకుని అదే ఊళ్లో కానిస్టేబుల్‌ అవుతాడు. మద్యం మత్తులో కొమిరి స్నేహితుడు బలిజ(గెటప్‌ శ్రీను) సర్పంచ్‌ మనిషిని కొడతాడు. దీంతో అతడిని ఇంటికి తీసుకెళ్లి చావగొడతారు. సర్పంచ్‌ బందీలో ఉన్న బలిజను విడిపించటానికి వెళ్లిన కొమిరి, అతడి భార్యకు అవమానం ఎదురవుతుంది. పెద్దవాళ్లను ఎదిరించలేక ఆ అవమాన భారంతో ముగ్గూరు ఇంటికి వస్తారు. కొన్ని రోజులకు ఊరి సర్పంచ్‌తో పాటు, కవిత(రమ్య)అనే గర్భిణి అనుమానాస్పద రీతిలో చనిపోతారు. దీనికి కారణం కొమిరేనంటూ కవిత బంధువులు అతడిని చంపేస్తారు. అసలు వారి చావులకు కారణం ఎవరు? కానిస్టేబుల్‌ జంగయ్య ఈ కేసును ఎలా పరిష్కరించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ప్రేక్షకులకు బోరు కొట్టకుండా, ఉత్కంఠతో ఊపేస్తూ అలరిస్తాయి క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌లు‌. ఇక దెయ్యాలు, భూతాలు, చేతబడి, బాణామతి వంటి నేపథ్యాలతోనూ పలు చిత్రాలు, ధారావాహికలు ప్రేక్షకులను అలరించాయి. ఈ రెండింటి మిళితమే ఈ చిత్రం. కథ, కథనాలతో ప్రేక్షకుడిని ఎంతవరకూ ఎంగేజ్‌ చేశామన్న దానిపై ఈ తరహా సినిమాల విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో 'మా ఊరి పొలిమేర' విజయం సాధించింది. కొమిరి, బలిజ, జంగయ్య పాత్రలను పరిచయం చేస్తూ, జాస్తిపల్లి వాతావరణాన్ని, అక్కడి మూఢ నమ్మకాలు, పెత్తందారీ వ్యవస్థను చూపిస్తూ సినిమాను మొదలు పెట్టాడు దర్శకుడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఒక పట్టాన కథ ముందుకు నడవదు. మరోవైపు ఓటీటీలో విడుదల చేద్దామన్న ఉద్దేశంతోనే అసభ్య సన్నివేశాలు, పదాలను యథేచ్చగా వదిలేశారు. మరీ వాస్తవికతకు అంత దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదేమో అనిపించింది. జంగయ్య కానిస్టేబుల్‌ అయిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఊరి సర్పంచ్‌కు కారు ప్రమాదం, ఐదు నెలల గర్భిణి అయిన కవిత అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వల్ల సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. మరోవైపు కవిత మృతికి కొమిరి కారణమంటూ అతడిని హత్య చేసేసరికి కథ కీలక మలుపు తిరుగుతుంది. కొమిరి మృతిని సవాల్‌ చేస్తూ జంగయ్య కోర్టు వెళ్లడం, ఈ హత్యల వెనుక కారణాలను అతడు అన్వేషించడం, తదితర సన్నివేశాలన్నీ ఉత్కంఠగా అనిపిస్తాయి. కోర్టు తుది తీర్పు వెలువరించే సమయంలో జంగయ్య కేసు వాపసు తీసుకునేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. చివరి 30 నిమిషాలు దర్శకుడు ట్విస్ట్‌లతో నింపేశాడు. ఒక్కో చిక్కుముడి విడిపోతుంటే తెరపై కనిపించే పాత్రలే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడూ ఆశ్చర్యపోతాడు. అవేంటో తెరపై చూస్తేనే మజా!

maa oori polimera movie telugu review
మా ఊరి పొలిమేర మూవీ పాత్రధారి

ఎవరెలా చేశారంటే: కొమిరి, జంగయ్య పాత్రల్లో సత్యం రాజేశ్‌, బాలాదిత్య ఒదిగిపోయి నటించారు. సత్యం రాజేశ్‌ కెరీర్‌లో కొమిరి పాత్ర నిలిచిపోతుంది. కేవలం ఒక కమెడియన్‌గా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన సత్యం రాజేశ్‌, ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. జంగయ్య పాత్ర కోసం బాలాదిత్య పడిన కష్టం, అతడి డిక్షన్‌ బాగుంది. మిగిలిన వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జ్యానీ నేపథ్య సంగీతం, జగన్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి. ఎడిటర్‌ కేఎస్‌ఆర్‌ ఆరంభ సన్నివేశాలను ఇంకొద్దిగా ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది. డాక్టర్‌ విశ్వనాథ్‌ ఎంచుకున్న కథ, కథనాన్ని నడిపిన తీరు బాగుంది. క్రైమ్‌, స్పస్పెన్స్‌ థ్రిల్లర్‌కు చేతబడి వంటి మూఢనమ్మకాలను జోడించి చూపించిన విధానం బాగుంది. అయితే, సంభాషణలు, కొన్ని సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ఓటీటీ సినిమా అంటే కేవలం యువత మాత్రమే చూస్తారనుకుంటే పొరపాటు. ఇంటింటికీ నెట్‌ అందుబాటులో ఉన్న నేటి పరిస్థితుల్లో కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూడాలంటే కాస్త ఇబ్బందికరమే!

బలాలు

+ కథ, కథనం

+ నటీనటులు

+ దర్శకత్వం

బలహీనతలు

- ప్రథమార్ధం

-అసభ్య సంభాషణలు, సన్నివేశాలు

చివరిగా: 'మా ఊరి పొలిమేర'కు మలుపులెక్కువ..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.