ETV Bharat / sitara

సినిమాల విడుదల వెండితెరపైనే!

author img

By

Published : Apr 15, 2020, 7:45 AM IST

కరోనాతో అన్ని రంగాలూ కుదేలైపోయాయి. సినిమా రంగంపై కూడా ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. కరోనాతో మొట్టమొదట నిలిచిపోయినవి సినిమా ప్రదర్శనలే. ఆ తర్వాత చిత్రీకరణలు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలన్నీ విడుదలకి నోచుకోక ల్యాబుల్లోనే మగ్గుతున్నాయి. వాటి పెట్టుబడులపై వడ్డీల భారం నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాతైనా సినిమా హాళ్లు తెరచుకుంటాయా? వెంటనే సినిమాల్ని విడుదల చేసుకోవచ్చా? ప్రేక్షకులు మునుపటిలా వచ్చే అవకాశం ఉంటుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఈ దశలో డిజిటల్‌ వేదికల్లో సినిమాల విడుదల గురించి చర్చ ఊపందుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ 5 తదితర ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) మాధ్యమాలు కొత్త సినిమాలపై కన్నేస్తున్నాయి. నేరుగా మా వేదికల్లో విడుదల చేయండంటూ నిర్మాతల్ని సంప్రదిస్తున్నాయి.

Silver Screen Insider: Movie Theater Marketing
సినిమాల విడుదల వెండితెరపైనే!

అడుగు బయట పెట్టలేని ఈ పరిస్థితుల్లోనూ ప్రేక్షకుడి వినోదానికి లోటు లేకుండా చేస్తున్నాయి ఓటీటీ వేదికలు. వెబ్‌సిరీస్‌లనీ, ఇప్పటికే విడుదలైన సినిమాల్నీ అందుబాటులో ఉంచుతూ ప్రేక్షకుడిని కట్టిపడేస్తున్నాయి ఆయా వేదికలు. ఒక రకంగా ప్రేక్షకుడికి ఈ మాధ్యమాల్ని మరింత బలంగా అలవాటు చేసినట్టయింది ఈ లాక్‌డౌన్‌ కాలం. ఇప్పుడు తమ వేదికల్ని ఆశ్రయిస్తున్న ప్రేక్షకుడిని మరింత రంజింపజేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి ఓటీటీ ఛానళ్లు. థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న సినిమాల్ని కొనేసి ఈ వేదికల్లో అందుబాటులో ఉంచేలా నిర్మాతలతో బేరసారాలు సాగిస్తున్నాయి. వడ్డీల భారం మోయడం కంటే ఓటీటీ ఛానళ్లలో విడుదల చేసుకోవడమే శ్రేయస్కరమా? కొన్నాళ్లు ఓపిక పట్టి థియేటర్లలోనే విడుదల చేసుకోవడం మంచిదా అని ఆలోచిస్తున్నారు నిర్మాతలు. కానీ ఎక్కువమంది థియేటర్ల వైపే మొగ్గు చూపుతున్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో కొన్ని అనువాద చిత్రాలు నేరుగా ఓటీటీ వేదికల్లోకి వచ్చేశాయి. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక వాటిని విడుదల చేసుకునే పరిస్థితులు ఉంటాయో లేదో అని నిర్మాతలు డిజిటల్‌ వేదికల్లోనే విడుదల చేశారు. ‘శక్తి’, ‘షూట్‌ అట్‌ ది సైట్‌ ఉత్తర్వు’ లాంటి అనువాద చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌లోవిడుదలయ్యాయి. తెలుగులో విడుదల తేదీని ప్రకటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అవన్నీ లాక్‌డౌన్‌ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాయి. కానీ లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే థియేటర్లు తెరుస్తారా? అప్పుడు ప్రేక్షకుడు థియేటర్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపుతాడా? అనే ప్రశ్నలు నిర్మాతల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. వీటికి తోడు పెట్టుబడి మీద వడ్డీల భారం కూడా నిర్మాతల్ని ఓటీటీ వేదికల్లో విడుదల గురించి ఆలోచించేలా చేస్తున్నాయి. అయితే పరిమిత వ్యయంతో తెరకెక్కిన ఒకట్రెండు చిత్రాలు ఓటీటీల వైపు వెళతాయేమో కానీ, అధిక వ్యయంతో తెరకెక్కిన సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేలా కనిపిస్తున్నాయి.

ఓటీటీ వేదికలు ఇస్తున్న మొత్తాలు నిర్మాతలకి గిట్టుబాటు కావడం లేదు. దాంతో కొన్నాళ్లు ఓపిక పట్టి థియేటర్లలోనే విడుదల చేసుకోవడమే ఉత్తమమనే ఆలోచనలో ఉన్నారు. ‘వి’, ‘ఒరేయ్‌ బుజ్జిగా’, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’, ‘రెడ్‌’, ‘ఉప్పెన’, ‘నిశ్శబ్దం’, ‘అరణ్య’ తదితర చిత్రాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. కానీ కరోనా వాటి ప్రణాళికల్ని తారుమారు చేసింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీల్ని ఖరారు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఆయా చిత్ర నిర్మాతలు. ఒక్కసారి జనం బయటికొస్తే అంతా మామూలైపోతుందని వారు భావిస్తున్నారు. కరోనా అనేది విపత్తు కాబట్టి వడ్డీల భారం నుంచి మినహాయింపు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. చలన చిత్ర వాణిజ్య మండలి ఆ దిశగా ఫైనాన్షియర్లను ఒప్పించేందుకు కసరత్తులు చేస్తోందని సమాచారం. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక పరిస్థితుల్నిబట్టి టికెట్ల ధరల్ని సమీక్షించబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఆలోపుగా చోటు చేసుకునే పరిస్థితులు, ఓటీటీ వేదికలు ఇచ్చే మొత్తాలు నిర్మాతలపై ఏమైనా ప్రభావం చూపిస్తాయేమో చూడాలి.

‘రెడ్‌’ను ఓటీటీలో విడుదల చేస్తారన్న ప్రచారంపై ఆ చిత్ర హీరో రామ్‌ స్పందిస్తూ ‘‘అభిమానులకి పెద్ద తెరపై సినిమాని చూపించడం గురించే ఎదురు చూస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. ‘ఉప్పెన’ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్‌ ‘ఈనాడు సినిమా’తో మాట్లాడుతూ ‘‘సినిమాల్ని ఓటీటీల్లో విడుదల చేసుకునే పరిస్థితులైతే లేవు. ఏదో ప్రచారం జరుగుతోంది తప్ప... నిర్మాతల పెట్టుబడితో పోలిస్తే వాళ్లు ఇచ్చే డబ్బు చాలా తక్కువ’’ అన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ ‘‘వెంటనే ప్రేక్షకులు భారీగా థియేటర్లకి రాకపోవచ్చు. కానీ కొత్త కరోనా కేసులు రాకపోతే మళ్లీ హడావుడి మొదలైపోవడం ఖాయం. సినిమా థియేటర్‌ దగ్గర సందడి మొదలవ్వడానికి ఎంతో సమయం పట్టదు. మన దగ్గర కరువు కాలాల్లో కూడా సినిమాల్ని చూస్తూ సాంత్వన పొందుతుంటార’’ని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.