ETV Bharat / sitara

ఏ మాయ చేసిందో గాని అందరూ ఆమెకు ఫిదానే

author img

By

Published : Apr 28, 2020, 5:21 AM IST

నటిగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ సమంత.. నేడు 33 వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణంపై ఓ లుక్కేద్దాం.

Samantha Birthday Special story
తొలి ప్రయత్నం ఆగినా... హ్యాట్రిక్‌ హిట్లతో స్టార్​గా

సినిమా అందమైన అబద్దం. రంగుల కలల్ని కలబోసే కట్టుకథ. కళ్లకు గంతలు కట్టి మాయ చేసి ఆకట్టుకునే కథ. వాటిలో అందాలు ఆరబోసే నాయికలు... వారితో ఆడిపాడి వీక్షకులను అలరించే నాయకులు... కొంత ప్రేమ, కొన్ని ఆలింగనాలు, ఇంకొన్ని గాఢ చుంబనాలు, మరికొన్ని ప్రేమ గీతాలు, అలరించే జలపాతాలు. వావ్‌! మరో రమణీయ కమనీయ ప్రపంచాన్ని మనముందుకు తెస్తుందీ సినిమా. అందుకే కడివెడు కష్టాలు, కన్నీళ్లున్నవాళ్లు అన్నీ మరిచేందుకు ఈ మాయా ప్రపంచపు తలుపులు తడతారు. కనుసైగతో... చిన్ని చిరునవ్వులతో నడకే నర్తనంగా, పలుకే కీర్తనంగా మలచే మహా మంత్రగత్తెల్ని కళ్లారా చూసి ప్రేక్షకులు సంతృప్తి పొందుతారు. లైట్లారిన థియేటర్లలో నిండయిన విగ్రహంతో కవ్వించే భామలకు అభిమానులవుతారు. ఇలానే తన మొదటి సినిమాతోనే మాయ చేసి, అవధుల్లేని ప్రతిభ కనబరిచిన ఆ తారక.. తర్వాత తర్వాత గ్లామర్‌ డోస్‌ పెంచి మరీ మెస్మరైజ్‌ చేస్తూ వస్తోంది. ప్రత్యేకించి ప్రేమకథా చిత్రాల హీరోయిన్​గా, తనను తాను ఆవిష్కరించుకున్న తీరు చెప్పలేం. ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ మీదుగా నేటి ‘జాను’ వరకూ ప్రేక్షకుల ప్రసంశలు పొందింది. ఆమె నటన ఆకాశమంత పేరు సమంత. ఈ వెండితెర తారక పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె సినీ ప్రయాణానికి సంబంధించిన విశేషాలు మీకోసం.

ఇది గౌతముడు తెచ్చిన పల్లావరం పిల్ల..

గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో వచ్చిన 'ఏం మాయ చేశావే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ సమంత. అసలు పేరు సమంత రుతుప్రభు. మత్తెక్కించే చూపులు, చూపు తిప్పుకోనివ్వని అందం, ఆకట్టుకునే అభినయంతో తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇండస్ట్రీకి వచ్చిన అతికొద్ది కాలంలోనే అగ్రకథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. 1987 ఏప్రిల్‌ 28న తమిళనాడులోని చెన్నైకు సమీపంలోని పల్లావరంలో జన్మించింది. తల్లి నింటె ప్రభు (మలయాళీ), తండ్రి జోసెఫ్‌ ప్రభు (తెలుగు).

అక్కినేని కుర్రాడితో ప్రేమ.. పెళ్లి
సమంత

తొలి ప్రయత్నం ఆగినా.. నందితో మెరిసి!

కెరీర్‌ తొలినాళ్లలో మోడలింగ్‌ చేసిన సమంత.. 2007లో రవివర్మన్‌ దర్శకత్వంలో 'మాస్కోవిన్‌ కావేరి' సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. అనుకోకుండా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత సమంత 2010లో నాగచైతన్యకు జోడీగా 'ఏ మాయ చేశావే'లో నటించి తొలిచిత్రంతోనే, ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమా మంచి విజయాన్నందుకుంది. ఇందులో జెస్సీగా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా అరంగేట్ర నటిగా నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డును అందుకుంది. అనంతరం 'బృందావనం'లో ఎన్టీఆర్‌ సరసన నటించి.. అందం, అభినయంతో మరోసారి అభిమానులను కట్టిపడేసింది. 2011లో 'దూకుడు'తో మహేశ్‌ సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఆ సినిమా భారీ విజయం దక్కించుకోవడంతో సమంతకు లక్కీ హీరోయిన్‌ అనే ముద్ర పడిపోయింది.

జక్కన్న చెక్కిన అభినయ ‘బిందు’

చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుస హిట్లు అందుకోవడం.. తొలి అడుగుల్లోనే అగ్రకథానాయకులతో నటించే అవకాశం రావడం అరుదుగా దొరికే అవకాశం. అలాంటి అరుదైన ఛాన్స్​లు సొంతం చేసుకుని హ్యాట్రిక్‌ హిట్లతో లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది. అందుకే దర్శకధీరుడు రాజమౌళి.. ఆమెపై నుంచి దృష్టి మరల్చలేకపోయాడు. ఆయన తీసిన 'ఈగ'లో సామ్​ను తప్ప వేరొకరిని ఊహించుకోలేకపోయాడు. ఈ చిత్రంలో బిందుగా అద్భుతమైన నటనతో మరో భారీ హిట్ సొంతం చేసుకోవడమే కాకుండా, జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే సమంతకు తొలి పరాభావాన్ని రుచి చూపించిన చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. కథానాయికగా ఓవైపు గ్లామర్‌ పాత్రలను పోషిస్తూనే.. నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సమంత అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2013లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', పవన్‌తో నటించిన 'అత్తారింటికి దారేది' ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అక్కినేని కుర్రాడితో ప్రేమ.. పెళ్లి
'మహానటి' పాత్రికేయురాలిగా

అక్కినేని కుర్రాడితో ప్రేమ.. పెళ్లి

'నాగచైతన్య, సమంత ప్రేమించుకుంటున్నారటగా'? ఈ వార్తలు బయటకొచ్చినప్పటి నుంచి అందరి చూపు ఈ జంటవైపే. ఎందుకంటే 'ఏమాయ చేశావే' చిత్రంతో నిజమైన ప్రేమికుల్లా అందమైన ప్రేమ కథను ఆవిష్కరించారు. నిజ జీవితంలోనూ ఆ జంట అలాగే ముచ్చటగా ఉంటే చూడాలని ఆశపడ్డారు అభిమానులు. కానీ చాలా కాలం ఇద్దరూ బయటపడనప్పటికీ తరచూ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వచ్చిందీ ప్రేమ జంట. 'ఆటోనగర్‌ సూర్య', 'మనం' చిత్రాల్లో వారి కెమిస్ట్రీ చూశాక ఎట్లాగైనా వారు కలిసి ఏడడుగులు వేస్తే చూసి తరించాలని ఆశించారు. మధ్యమధ్యలో సామాజిక మాధ్యమాల ద్వారా సమంత, చైతూ తన అనుబంధం గురించి పరోక్షంగా బయటపెట్టి కవ్విస్తుండటం.. ఆ తర్వాత ఇరు కుటుంబాలకు విషయం చెప్పడం.. ఇద్దరూ ఒక్కటవడం అంతా ఓ అందమైన ప్రేమ కావ్యంలా జరిగిపోయింది. 2017 అక్టోబర్‌ 7న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరిద్దరూ కలిసి 'మజిలీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చి, మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

అక్కినేని కుర్రాడితో ప్రేమ.. పెళ్లి
అక్కినేని కుర్రాడితో ప్రేమ.. పెళ్లి

అప్పుడు ఇప్పుడూ అదే జోరు..

సమంత తన కెరీర్‌లో చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం విజయం సాధించాయి. 'అత్తారింటికి దారేది' తర్వాత 'ఆటోనగర్‌ సూర్య', 'అల్లుడు శీను', 'కత్తి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి', '2'’, 'అఆ', 'రాజుగారి గది−2', 'అదిరింది' సినిమాలు సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పెళ్లి తర్వాత ఆమె నటించిన 'రంగస్థలం'తోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో రామలక్ష్మి అనే పల్లెటూరి యువతిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. కథానాయికలకు నటించడానికి పెళ్లి అవరోధం కాదని నిరూపిస్తూ.. పెళ్లి తర్వాతా వరుస సినిమాలతో యువ హీరోయిన్లకు దీటుగా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

అక్కినేని కుర్రాడితో ప్రేమ.. పెళ్లి
రంగస్థలం

మహానటి, అభిమన్యుడు, యూటర్న్‌, మజిలీ, ఓ బేబీ, మన్మథుడు 2, సూపర్​డీలక్స్, 'జాను'​ వంటి చిత్రాలతో సత్తా చాటింది సమంత. ఓవైపు నటిస్తూనే, మరోవైపు ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అందంతో పాటు అందమైన మనసున్న నాయికగా ప్రజల మన్ననలు అందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటివరకు సుమారు 40 చిత్రాల్లో నటించింది.

అక్కినేని కుర్రాడితో ప్రేమ.. పెళ్లి
మజిలీ చిత్రంలో చైతూకూ జోడిగా

ఇదీ చూడండి : అదాశర్మతో ఆ నటుడు డేటింగ్​లో ఉన్నాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.