ETV Bharat / sitara

హద్దులు చెరిపేస్తూ.. దేశమంతా విస్తరిస్తూ..

author img

By

Published : Jun 18, 2021, 8:37 AM IST

samantha and shriya
సమంత, శ్రియ

నాయికల సినీ ప్రయాణం చిన్నది. కథానాయకులతో పోల్చితే వీరి మార్కెట్‌ పరిధి మాత్రం ఎక్కువే. ఒక్క హిట్టు చేతిలో పడిందంటే చాలు.. అన్ని భాషల్లోనూ తమ జెండాను రెపరెపలాడించే ప్రయత్నం చేస్తుంటారు. తెలుగు, తమిళం, హిందీ.. అన్న ప్రాంతీయ భాషా హద్దులు చెరిపేస్తూ అందరికీ దగ్గరైపోతుంటారు. ఇప్పుడీ ఆదరణనే అస్త్రంగా మలచుకొని పాన్‌ ఇండియా కథలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు పలువురు ముద్దుగుమ్మలు. మరి వారెవరు..? వారి సినిమాల కబుర్లేంటి?

నాయికా ప్రాధాన్య చిత్రాలతో మెప్పించడం అనుకున్నంత తేలిక కాదు. సోలోగా కథని నడిపించగలగాలి.. ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించగల సత్తా.. స్టార్‌ డమ్‌ ఉండాలి. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇక పాన్‌ ఇండియా చిత్రమంటే.. అన్ని భాషల్లో ఆమెకున్న ఆదరణ.. మార్కెట్‌ వంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ నటి సమంతలో పుష్కలంగా ఉన్నాయి.

samantha akkineni
సమంత అక్కినేని

అందుకే సమంతతో 'శాకుంతలం' అనే పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు గుణశేఖర్‌. మహాభారతం.. ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో శకుంతలగా ప్రధాన పాత్రలో నటస్తోంది సామ్‌. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా. అలాగే ఆమె నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం. అందుకే దీనిపై దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఇతిహాసచిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


  • 20ఏళ్ల సినీ ప్రయాణంలో అటు కమర్షియల్‌ చిత్రాలతోనూ.. ఇటు నాయికా ప్రాధాన్య సినిమాలతోనూ అందరినీ మెప్పించింది నటి శ్రియ. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ అశేష ప్రేక్షక గణాన్ని సంపాదించుకుంది. ఇప్పుడీ ఆదరణను అస్త్రంగా చేసుకునే.. 'గమనం' సినిమాతో పాన్‌ ఇండియా నాయికగా మెరుపులు మెరిపించే ప్రయత్నం చేస్తోంది శ్రియ. ఇది ఆమె నటిస్తున్న తొలి బహుభాషా చిత్రం. క్రిష్‌ శిష్యురాలు సుజనా రావు తెరకెక్కిస్తున్నారు. ఓ చెవిటి ఇల్లాలి జీవిత గాథ.. ఓ జంట ప్రేమకథ.. మరో అనాథ జీవన ప్రయాణం.. ఇలా మనసుల్ని కదిలించే మూడు విభిన్నమైన కథలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. నగరంలో కురిసిన జడివాన.. వీళ్ల జీవితాల్ని ఎలా చిన్నాభిన్నం చేసిందన్నది ఇతివృత్తం. ఇందులో శ్రియ ఓ చెవిటి ఇల్లాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
shriya saran
శ్రియ

రేసులో మరికొన్ని


నాయికా ప్రాధాన్య కొత్త ప్రాజెక్ట్‌లలోనూ పలు పాన్‌ ఇండియా సినిమాలున్నాయి. ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో దేశానికి పతకాన్ని అందించిన తెలుగు తేజం కరణం మల్లేశ్వరి. ఈమె జీవితకథతో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు కోన వెంకట్‌. దీనికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో సెట్స్​పైకి వెళ్లనుంది. ఇందులో మల్లేశ్వరి పాత్రను పోషించే నాయికెవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పాత్ర కోసం రకుల్‌ ప్రీత్‌, అంజలి వంటి నాయికల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

  • కర్ణాటక సంగీతకారిణి, మహిళా హక్కుల కోసం పోరాడిన నాయకురాలు బెంగళూరు నాగరత్నమ్మ జీవిత కథ వెండితెరపైకి రానుంది. ఇందుకోసం సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ కథ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. దీన్ని పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ బయోపిక్‌ కోసం అనుష్క, సమంత వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
  • బ్యాడ్మింటన్‌ అగ్ర క్రీడాకారిణి పీవీ సింధు జీవిత కథను.. సినిమాగా తీసుకురానున్నట్లు నటుడు సోనూసూద్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఆయన దీన్ని పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ముస్తాబు చేయనున్నట్లు సమాచారం. ఇందులో సింధు పాత్రలో నటి దీపికా పదుకొణె కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి : కొత్త దర్శకులతో యువ హీరోలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.