ETV Bharat / sitara

బాలయ్యతో కుదరలేదు.. నాడు ఎన్టీఆర్​-చిరు.. నేడు తారక్​-చెర్రీ

author img

By

Published : Mar 24, 2022, 10:34 AM IST

RRR Movie
ntr chiranjeevi

RRR Movie: అగ్ర కథానాయకులు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తారా? అనే సినీ అభిమానుల సందేహానికి 'రౌద్రం రణం రుధిరం' (RRR) సినిమాతో దర్శకుడు రాజమౌళి సమాధానమిచ్చారు. సమాన స్థాయి అభిమానగణం ఉన్న హీరోలను ఒకే 'తెర'పైకి తీసుకొచ్చారు. వీరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని సగటు ప్రేక్షకుడితోపాటు సినీ ప్రముఖులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరే కాదు.. గతంలో సీనియర్‌ ఎన్టీఆర్‌- చిరంజీవి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కింది. ఆ వివరాలివీ..

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రంలో ప్రస్తుత స్టార్​ హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి ఇప్పుడు మల్టీస్టారర్​ చేయగా.. సీనియర్​ ఎన్టీఆర్​- చిరంజీవి గతంలోనే 'తిరుగులేని మనిషి' చిత్రంలో నటించారు. శుక్రవారం(మార్చి 25)న 'ఆర్ఆర్​ఆర్'​ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్ర విశేషాలు ఓసారి చూద్దాం.

ఆయన రాజా.. ఈయన కిశోర్‌

RRR Movie
'తిరుగులేని మనిషి'లో ఎన్టీఆర్​, చిరంజీవి

సీనియర్‌ ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన సినిమా 'తిరుగులేని మనిషి'. న్యాయవాది రాజాగా ఎన్టీఆర్‌, క్లబ్‌ల్లో పాటలు పాడే కిశోర్‌గా చిరంజీవి నటించారు. రతి అగ్నిహోత్రి, జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, ముక్కామల, చిడతల అప్పారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథేంటంటే.. రాజా తిరుగులేని న్యాయవాది. ప్రాక్టీస్‌ ప్రారంభంలోనే శభాష్‌ అనిపించుకుంటాడు. తన సోదరి పద్మ (జయలక్ష్మి) కిశోర్‌ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఈ వ్యవహారం రాజా తండ్రి శశిభూషణ రావు (జగ్గయ్య)కు నచ్చదు. కిశోర్‌కు ఆస్తిపాస్తులు లేని కారణంగా వారి పెళ్లిని తిరస్కరిస్తాడు. దాంతో.. పద్మ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంది. సకాలంలో ఆమెను రక్షించి, తండ్రికి తెలియకుండా కిశోర్‌తో వివాహం చేస్తాడు రాజా.

RRR Movie
ఎన్టీఆర్​తో చిరంజీవి మధ్యలో బాలకృష్ణ

ఒకానొక సమయంలో.. తన తండ్రికి వజ్రాల అక్రమ రవాణా చేసే వారితో సంబంధముందని తెలుసుకున్న రాజా దిగ్భ్రాంతికి గురవుతాడు. తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకునే ప్రయత్నంలో తన బావమరిది కిశోర్‌కూ ఈ ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుని షాక్‌ అవుతాడు. చిరంజీవి నెగెటివ్‌ రోల్‌ పోషించారనే ఈ ట్విస్ట్‌ సినిమాకే కీలకం. ఆ తర్వాత రాజా మాటలతో కిశోర్‌ మనసు మార్చుకుంటాడు. ఇద్దరు కలిసి స్మగ్లర్ల గుట్టు రట్టు చేస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. దేవీ వరప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కేవీ మహదేవన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం 1981 ఏప్రిల్‌ 1న విడుదలైంది.

వారిది బంధుత్వం.. వీరిది స్నేహం:

RRR Movie
రామ్​చరణ్​-తారక్​

సీనియర్‌ ఎన్టీఆర్‌, చిరంజీవి బావాబావమరిదిగా కనిపించగా.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో స్నేహితులుగా కనిపించనున్నారు. నిప్పు (అల్లూరి సీతారామరాజు- చరణ్‌), నీరు (కొమురం భీమ్‌- తారక్‌) దోస్తీ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆ కాంబోలో కుదరలేదు.. కానీ:

RRR Movie
చిరంజీవితో బాలకృష్ణ

బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించాలని పలువురు దర్శకులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. తెరపైనా ఈ ఇద్దరు కనిపించకపోయినా తెరవెనక ఎంతో స్నేహంగా ఉంటారు. బాలకృష్ణ నటించిన ఓ సినిమాను చిరంజీవి ప్రమోట్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు 'ఆదిత్య 369'. 1991 జులై 18న ఈ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేశారట. ఈ క్రమంలో చిరుతో ప్రచారం చేయిస్తే ఇంకా బాగుంటుందని భావించి.. ఆయన్ను సంప్రదించారట. అడిగిన వెంటనే చిరంజీవి ఓకే చెప్పారు.

ఇదీ చదవండి: 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్.. ప్రీమియర్స్​లో 'ఆర్​ఆర్​ఆర్' కలెక్షన్ల సునామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.