ETV Bharat / sitara

చిరంజీవిలో నటుడిని మొదట గుర్తించింది ఎవరో తెలుసా?

author img

By

Published : Aug 22, 2021, 6:30 AM IST

చిరంజీవి.. ఈ పేరు వింటేనే తెలియని వైబ్రేషన్స్​ వస్తాయి. నటన, డ్యాన్స్​, కామిడీ టైమింగ్​, ఫైట్స్​తో సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మెగాస్టార్​లో నటుడున్నాడని మొదట గుర్తించింది ఎవరనేది తెలుసుకోవాలని ఉందా?

chiru
చిరు

సహాయ నటుడిగా సినీకెరీర్​ ప్రారంభించి.. ప్రతినాయక పాత్రల్లో మెరిసి.. ఆపై కథానాయకుడిగా తెలుగుతెరపై మెగాస్టార్‌లా కొలువుదీరిన చిరంజీవి జీవిత ప్రయాణం ఆద్యంతం స్ఫూర్తిదాయకమే. ఆయన కళామ్మతల్లి వైపు వేసిన తొలి అడుగులను, ఈ స్థాయికి చేరుకోవడంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు చిరు. కానీ, అసలు చిరులోని మెగాస్టార్‌ తొలుత గుర్తించింది ఎవరో తెలుసా? ఆయన్ని వెండితెరపైకి నడిపించింది ఎవరో తెలుసా? దీనికి చిరంజీవి ఓ సందర్భంలో సమాధానమిచ్చారు.

నేటి ఈ చిరు వెనుక నాటి చీరాల వీరయ్య అనే ఓ కానిస్టేబుల్ ఉన్నాడని ఓసారి తన గతాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్‌. "నా తండ్రి ఎస్సైగా చీరాలలో పనిచేస్తున్న రోజుల్లో అదే స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్‌ పనిచేస్తుండేవారు. ఆయన నేను చెప్పే సినిమా డైలాగ్స్‌, చేసే యాక్షన్‌ మూమెంట్స్‌ను చాలా ఇష్టపడేవారు. నా అభినయంపై ప్రశంసలు కురిపించేవారు. కానీ, ఆయన మాటల్నెప్పుడూ అంత సీరియస్‌గా తీసుకునేవాడిని కాదు. ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి 'బాబు మిమ్మల్ని చూస్తుంటే అచ్చు బాలీవుడ్‌ హీరో శత్రుఘ్నసిన్హా లాగే ఉన్నారు. ఆయనలాగే చేస్తున్నారు. మీరు అర్జెంటుగా సినిమా ఫీల్డ్‌కు వెళ్లిపోండి" అన్నారు. ఆరోజు ఆయన అన్న మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఆయనక్కడితో ఆగకుండా నన్ను అప్పటికప్పుడు స్టూడియోకు తీసుకెళ్లి ఫొటోలు తీయించి మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. వాటి వల్లే నేను అడయార్‌ ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నా. అలా ఓ సామాన్య కానిస్టేబుల్‌ నాలో నింపిన స్ఫూర్తితోనే ఈరోజున మీ ముందు నిలబడగలిగాను. ఇంతకీ ఆ కానిస్టేబుల్‌ మరెవరో కాదు.. చీరాల పక్కనే ఉన్న పేరాలకు చెందిన కానిస్టేబుల్‌ వీరయ్య" అంటూ నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు చిరు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్​గా నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చూడండి: మెగాస్టార్​ 153వ చిత్రం టైటిల్​ ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.