ETV Bharat / sitara

దిలీప్ కుమార్ ప్రేమ కథలు- సైరాభానుతో పరిణయం ఇలా..!

author img

By

Published : Jul 7, 2021, 12:40 PM IST

దివికెగిసిన లెజండరీ యాక్టర్​ దిలీప్​ కుమార్​ ప్రేమ ప్రస్థానం సినిమా కథను తలపిస్తుంది. కన్నీళ్లు తెప్పించే ఆయన నటన వెనుక​ మనసును కరిగించే ప్రేమ కథలు కూడా ఉన్నాయి. తొలుత కామినీ కౌశల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ అది ఆదిలో అంతమైపోయింది. తర్వాత మధుబాలతో ప్రణయం నిశ్చితార్థం వరకు సాగింది. అయితే ఓ వివాదంతో దానికీ తెర పడింది. ఇలా ప్రేమ కథల నుంచి.. చివరకు సైరాభానును పరిణయణం చేసుకునే వరకు సాగిన ఆయన జీవితంలోని విశేషాలను తెలుసుకుందాం.

Dilip Love stories
దిలీప్​ కుమార్​ ప్రేమ కథలు

దర్శక నిర్మాత కిషోర్‌ సాహు 1948లో నిర్మించిన 'నదియా కే పర్‌' చిత్రంలో దిలీప్‌ కుమార్, కామినీ కౌశల్‌ జంటగా నటించారు. అదే సంవత్సరం ఫిల్మిస్థాన్‌ సంస్థ రమేశ్‌ సైగల్‌ దర్శకత్వంలో 'షహీద్‌' అనే సూపర్‌ హిట్‌ చిత్రాన్ని నిర్మించింది. అందులో కూడా దిలీప్‌ కుమార్‌ సరసన కామినీ కౌశల్‌ హీరోయిన్‌గా నటించింది. అప్పుడే దిలీప్‌ కుమార్‌.. కామినీ కౌశల్‌తో ప్రేమలో పడ్డారు. అయితే వీరి పెళ్ళికి కామిని అన్న అడ్డుపడ్డాడు. అందుకు కూడా ఓ కారణముంది.

కామిని అక్క ఒక కారు ప్రమాదంలో మరణించింది. ఆమెకు కుంకుమ్, కవితా అనే ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ చిన్నవాళ్లే కావడంతో వారిని పెంచే బాధ్యతను కామిని తీసుకుంది. బొంబాయి పోర్టు ట్రస్టులో చీఫ్‌ ఇంజనీరుగా పనిచేసే తన అక్క భర్త బి.ఎస్‌.సూద్‌ని వివాహం చేసుకొని, పిల్లల సంరక్షణ భారాన్ని కామినీ కౌశల్‌ తనమీద వేసుకుంది. దిలీప్‌ కుమార్‌ మీద ప్రేమ వుండి కూడా పరిస్థితుల ప్రభావం చేత కామినీ కౌశల్‌ జీవితంతో రాజీపడి అతనికి దూరమైంది.

మధుబాలతో నిశ్చితార్థం వరకు..

1951లో కృషిన్‌ మూవీటోన్‌ సంస్థ అధిపతి కె.ఎస్‌.దర్యాని, దిలీప్‌ కుమార్, మధుబాల జంటగా 'తరానా' సినిమా నిర్మించాడు. మధుబాలకు దిలీప్‌ కుమార్‌తో నటించడం అదే మొదటిసారి. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారి ప్రేమ అప్రతిహతంగా ఆరేళ్లు నడిచింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం వారిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. దిలీప్‌ తరచూ మధుబాల ఇంటికి వెళుతుండేవారు. ఇరు కుటుంబాలు 'పఠాన్‌' వంశానికి చెందినవి కావడం వల్ల వివాహానికి అభ్యంతరం రాలేదు.

వివాదంతో పెళ్లికి తెర..

అయితే బి.ఆర్‌.చోప్రా 'నయాదౌర్‌' (1957) చిత్రాన్ని నిర్మించినప్పుడు వివాదం చెలరేగింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు మొదట మధుబాలను ఎంపిక చేశారు. పదిహేను రోజులపాటు సినిమా షూటింగు జరిగింది. తరువాత అవుట్‌ డోర్‌ షూటింగు జరిపేందుకు భోపాల్‌ వెళ్లాలని దర్శకనిర్మాత బి.ఆర్‌.చోప్రా నిర్ణయించారు. అయితే ఈ అవుట్‌ డోర్‌ షెడ్యూలు కేవలం దిలీప్‌ కుమార్‌ - మధుబాలల ప్రేమ ప్రయోజనం కోసమే రూపొందించారని మధుబాల తండ్రి అతవుల్లా ఖాన్‌ అభ్యంతరపెట్టి, ఆ అవుట్‌ డోర్‌ షెడ్యూలుకు అంతరాయం కలిగించాడు. దీంతో మధుబాల మీద కోర్టులో దావా వేసిన చోప్రా.. ఆమె తీసుకున్న పారితోషికం అడ్వాన్స్‌ కూడా తిరిగి ఇచ్చేయాలని వాదించారు. మధుబాల మాత్రం తన తండ్రి వాదనకే కట్టుబడింది. కోర్టులో దిలీప్‌ కుమార్‌ దర్శక నిర్మాత బి.ఆర్‌.చోప్రాకు మద్దతు పలికి సాక్ష్యం ఇవ్వడంతో కోర్టు చోప్రాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఈ కేసు మధుబాల సినీ భవిష్యత్తు మీద ప్రతికూల ప్రభావం చూపింది. చోప్రా మధుబాల స్థానాన్ని వైజయంతిమాలతో ప్రతిక్షేపించి సినిమా పూర్తిచేసి విజయం సాధించారు. మధుబాలను ఇల్లు విడిచి వస్తే ఆమెను పెళ్లిచేసుకుంటానని దిలీప్‌ కుమార్‌ చాలాసార్లు ఫోన్‌లో చెప్పిచూశారు. కానీ మధుబాల మాత్రం అహం ప్రదర్శిస్తూ తన తండ్రికి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టింది. దిలీప్‌ కుమార్‌ ససేమిరా అన్నాడు. దాంతో దిలీప్‌-మధుబాలల ప్రణయం విఫలమైంది.

ఆయనకు 44.. ఆమెకు 22

ఈ తతంగం జరిగాక దిలీప్‌ కుమార్‌ కొన్నేళ్లు పెళ్లి జోలికి వెళ్లలేదు. రాజేంద్రకుమార్‌ హీరోగా లేఖ్‌ టాండన్‌ నిర్మించిన 'ఝుక్‌ గయా ఆస్మాన్‌' సినిమా సందర్భంగా నటి సైరాభానుకు దిలీప్‌ కుమార్‌తో పరిచయం పెరిగింది. దాంతో వారిద్దరూ దగ్గరయ్యారు. తన పన్నెండవ యేటనుంచే ఆమెకు దిలీప్‌ కుమార్‌ అంటే పెద్ద క్రేజ్‌గా వుండేది. దిలీప్‌కు 44 ఏళ్ల వయసు వచ్చినప్పుడు 22 ఏళ్ల సైరాభాను అతణ్ణి పెళ్లాడేందుకు సిద్ధపడింది. తల్లి నసీమ్‌ భాను కూడా సమ్మతి తెలపడంతో వారి పెళ్లి 1966లో జరిగింది.

సాఫీగా సాగుతున్న సంసారంలో అపశ్రుతులు చోటు చేసుకోవడం సహజం. 1980లో హైదరాబాదులో జరిగిన ఒక క్రికెట్‌ మ్యాచ్‌లో దిలీప్‌ కుమార్‌కు ఆస్మా రెహమాన్‌ అనే పాకిస్థానీ మహిళతో పరిచయమై ప్రేమ చిగురించింది. అయితే సైరాభాను చేసుకున్న పుణ్యమా అని త్వరలోనే దిలీప్‌ తన తప్పును తెలుసుకొని ఆస్మా రెహమాన్‌ నుండి దూరంగా జరిగారు. పిల్లలు లేకపోయినా, పెళ్లై యాభై యేళ్లు గడిచినా దిలీప్‌-సైరాల కాపురం కలతలు లేని కాపురంగా వర్ధిల్లింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.