ETV Bharat / sitara

ఈ స్టార్స్.. వంటల్లో సూపర్​డూపర్

author img

By

Published : Jul 25, 2021, 9:00 AM IST

తాము చేస్తున్న రంగాల్లో అత్యుత్తమంగా నిలిచి, ఎంతోపేరు తెచ్చుకున్న పలువురు ప్రముఖులు.. వంటింట్లోనూ అద్భుతాలు చేస్తున్నారు! ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ వాళ్లెవరు? ఏయే వంటలు చేస్తున్నారు?

.
.

తీరిక దొరికినా, మనసు బాగాలేకపోయినా ఎవరైనా ఓ పుస్తకం చదవడం, సరదాగా బయటకు వెళ్లడం, లేదా విశ్రాంతి తీసుకోవడం వంటి పనులు చేస్తుంటారు. కానీ ఈ ప్రముఖులు మాత్రం సరదాగా వంటింట్లోకి దూరిపోయి గరిటె తిప్పడానికి ఇష్టపడుతుంటారు. 'వంట చేయడంలో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు తెలుసా..' అని చెప్పే వీళ్లు ఇంకా ఏమంటున్నారంటే?

ఆ ప్రత్యేకత అమ్మదే

చిన్నప్పుడు మా అమ్మ రకరకాల వంటకాలు చేసేది. వాటిల్లో ఒకటి చిన్నచేపలూ, చింతకాయల వేపుడు. దాన్ని ఇన్నేళ్ల తరువాత నేను నేర్చుకుని మా అమ్మకు స్వయంగా వండిపెట్టినప్పుడు గర్వంగా అనిపించింది. నేను ఇప్పుడు బాగా వంట చేస్తున్నానంటే దానికి కారణం మా అమ్మే. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు అమ్మ వంట చేస్తుంటే తనతోపాటూ ఉండి... అమ్మకు చిన్నచిన్న సాయాలు చేస్తూనే అన్నీ నేర్చుకున్నా. పెద్దయ్యాక సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల వంట చేయడం తగ్గింది కానీ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. ఉప్మా, నూడుల్స్‌, ఫ్రైడ్‌రైస్‌, దోశ... ఇలా ఒకటేమిటి ఏదయినా చేయగలను!

chiranjeevi
చిరంజీవి

ప్రయోగాలు చేయడమంటే ఇష్టం

నాకు ఇష్టమైన అభిరుచుల్లో మొదటి స్థానం వంటదే. చిన్నప్పటి నుంచీ మంచి భోజన ప్రియుడిని కావడం, అమ్మ రకరకాల వంటకాలను చేసి పెట్టడం, క్రికెట్‌ టోర్నమెంట్లలో భాగంగా వెళ్లిన ప్రతిచోటా కొత్తరకాల పదార్థాలను రుచి చూడటం.. ఇవన్నీ నాకు వంటపైన ఇష్టాన్ని పెంచాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు నాకు పూర్తిగా విశ్రాంతి దొరికింది కాబట్టి అవకాశం వచ్చినప్పుడల్లా వంటింట్లోకి వెళ్లిపోయి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా. అమ్మకోసం బైంగన్‌బర్తా, మా పెళ్లిరోజున మ్యాంగోకుల్ఫీ లాంటివే కాదు, చికెన్‌, ఇతర విదేశీ వంటకాలనూ అద్భుతంగా చేయగలను. అలాగే బంగాళాదుంపల్ని ఉడికించిన నీటినీ, వాడేసిన టీపొడినీ, ఇతర కూరగాయల తొక్కల్నీ వృథాగా పారేయకుండా... మొక్కలకు ఎరువుగా వేయడం అలవాటుగా చేసుకున్నా.

sachin tendulkar
సచిన్ తెందుల్కర్

పిల్లల కోసమే వంట నేర్చుకున్నా

సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ నేను చాలా సీరియస్‌గా ఉంటానని చాలామంది అనుకుంటారు కానీ వంట చేస్తున్నప్పుడు మాత్రం నా ముఖంలో చాలా ఆనందం కనిపిస్తుందని చెబుతారు కుటుంబసభ్యులు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు ఏదో ఒకటి చేసిపెట్టాలనే ఉద్దేశంతోనే వంటలు నేర్చుకున్నా. ఇప్పుడు అన్ని రకాలూ వండటమే కాదు నాకు నచ్చినట్లుగా ప్రయోగాలూ చేసేస్తుంటా. అయితే... మా ఇంట్లో నేనూ, కాజోల్‌తోపాటూ మా పిల్లలిద్దరు కూడా ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటిస్తుంటారు. దాంతో వారాంతంలో లేదా ఎప్పుడైనా ఒకసారి 'ఫ్యామిలీ చీట్‌మీల్‌ డే' అని పెట్టుకుంటాం. అప్పుడు మాత్రం మొఘలాయి, చైనీస్‌, చికెన్‌ కర్రీలూ, బిర్యానీ... ఇలా ఒకటేమిటి, నేను ఏది చేసినా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తుంటారు. పని ఒత్తిడి పోగొట్టుకునే మార్గాల్లో వంట కూడా ఒకటని నా అభిప్రాయం.

ajay devgan chef
అజయ్ దేవ్​గణ్

ఒత్తిడిగా అనిపిస్తే వంటింట్లోకే

ఎప్పుడైనా నాకు బాగా పని ఒత్తిడి పెరిగితే మా ఆవిడకు మంచి వంట చేసి పెడతా. అది తిని తన నుంచి ప్రశంస వస్తే నా ఒత్తిడి చేత్తో తీసేసినట్లు పోతుంది. అప్పుడనే కాదు, ఇంటికెవరైనా వస్తున్నారంటే నాకు ఖాళీ గనుక ఉంటే- వంట చేసేందుకు రెడీ అయిపోతా. చిన్నప్పుడు మా అమ్మ వంట చేస్తుంటే నేను పక్కనే ఉండి తనని గమనించేవాడిని. అలా చూడటం వల్లే నాకు వంటలపైన ఆసక్తి పెరిగిందనుకుంటా. ఇప్పుడు సినిమాల నుంచి విరామం వచ్చినప్పుడల్లా వండటంలో నా నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. నిజానికి లాక్‌డౌన్‌ సమయం అందుకు బాగా ఉపయోగపడింది. అప్పుడు ఎన్నో కిటుకులు నేర్చుకోవడం సహా ఎప్పటినుంచో ప్రయత్నించాలనుకున్న వంటకాలన్నింటినీ చేశా. నాకు అన్నింటికన్నా బార్బెక్యూ చేయడం అంటే చాలా ఇష్టం.

NTR
ఎన్టీఆర్

వంట ఒక కళ

అప్పుడు నాకు పదహారేళ్లుంటాయేమో. పాకెట్‌మనీ వస్తుందనే ఉద్దేశంతో వేసవి సెలవుల్లో మెక్‌డోనాల్డ్స్‌లో చేరి బర్గర్లను ఫ్రై చేసేవాడిని. అప్పటినుంచీ నాకు వంట చేయడం ఓ అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా నాకు అవకాశం వస్తే ఇంట్లోవాళ్ల కోసం బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటా. పొద్దుటిపూట నేను చేసే ఇష్టమైన పనుల్లో అది కూడా ఒకటి. నేను టిఫిన్లు బాగా చేయగలనని పిల్లలూ అంటుంటారు కాబట్టి ఆ ప్రశంసను నిలబెట్టుకునేందుకు అయినా అప్పుడప్పుడూ ఏదో ఒకటి చేస్తుంటా. వండటం ఒక కళ మాత్రమే కాదు.. సృజనను పెంచుతుందని నమ్ముతా.

jeff bezos
జెఫ్ బెజోస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.