ETV Bharat / sitara

అలా జరగాలంటే కొన్నింటిని వదులుకోవాల్సిందే: సూర్య

author img

By

Published : Mar 6, 2022, 6:49 AM IST

surya
hero surya

Surya new movie ET: టాలీవుడ్​ సినీ ప్రేమికుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమిళ హీరో సూర్య తన సరికొత్త చిత్రం 'ఈటి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

Surya new movie ET: సూర్య.. ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల సొంతం అయ్యారు. ఆయన సినిమా విడుదలవుతోందంటే తెలుగులోనూ ఆ సందడి ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. సూర్య చేసిన గత రెండు సినిమాలూ ఓటీటీ మాధ్యమాల్లోనే విడుదలయ్యాయి. ఈసారి ఆయన కథానాయకుడిగా నటించిన 'ఈటి' ఈ నెల 10న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సూర్య కొన్ని విశేషాలను తెలిపారు. ఆ విషయాలివే..

చాలా రోజుల తర్వాత మీ సినిమా థియేటర్‌లో సందడి చేయనుంది. దీనిపై మీ అభిప్రాయం?

కరోనా కష్ట సమయాల్లోనూ 'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్' సినిమాలతో ప్రేక్షకులకి వినోదం పంచడం ఎంతో తృప్తినిచ్చింది. తెలుగు సినిమాలు 'అఖండ', 'పుష్ప' మొదలుకొని 'భీమ్లానాయక్‌' వరకు ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్‌కి తీసుకు రావడం సాధ్యమనే భరోసానిచ్చాయి. ఆ భరోసాతోనే ఇతర పరిశ్రమలూ విరివిగా సినిమాలు నిర్మిస్తూ, విడుదలలకి సిద్ధమవుతున్నాయి. 'ఈటి' థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించింది.

'ఈటి'తో మహిళలకి సంబంధించిన విషయాల్ని ప్రస్తావిస్తున్నారా?

ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా సినిమాలు చేయడం ఓ బాధ్యతగా భావిస్తున్నా. నేను నటించిన 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌' సినిమా చూసి దర్శకుడు వెట్రిమారన్‌ ధూమపానం మానేశాడట. వినోదం కోసమే కాకుండా అలాంటి మార్పు కోసం సినిమాలు చేస్తే బాగుంటుంది కదా. మహిళల విషయంలో మన ఆలోచనా ధోరణి ఎలా ఉందో, మనలో ఎలాంటి మార్పు రావాలనే అంశాన్ని అంతర్లీనంగా చెప్పారు దర్శకుడు. ఇంటికి ఓ అతిథి వచ్చాడంటే వెంటనే నీళ్లు తీసుకురా అని ఆడవాళ్లకే చెబుతుంటాం. వాళ్లతో మాట్లాడే విధానం దగ్గర్నుంచి, పనిచెప్పడం వరకు ఎన్నో విషయాల్ని స్పృశిస్తూ ఇందులో దర్శకుడు ఆలోచన రేకెత్తించేలా చెప్పారు. మనం ఇంట్లో చర్చించుకోవడానికి అంతగా ఇష్టపడని ఎన్నో విషయాలు ఇందులో ఉంటాయి.

'ఆకాశం నీ హద్దురా', 'జై భీమ్'... ఆస్కార్‌ కోసం పోటీపడ్డాయి. వాటిలో నటించేటప్పుడు సాహసం చేస్తున్నట్టుగా భావించారా?

కొన్నింటిని వదులుకుంటే చాలా సంపాదిస్తామనే మాటని నేను బలంగా నమ్ముతాను. అహం మొదలుకొని అందులో చాలానే ఉన్నాయి. ఆ విషయంలో నాకు సత్యరాజ్‌ మామే స్ఫూర్తి. నా తొలి పుట్టినరోజు నన్ను బయటికి తీసుకెళ్లి చాక్లెట్‌ కొనిచ్చిన సత్యరాజ్‌ మామతో కలిసి నేను నటించిన తొలి సినిమా ఇదే. ఆయన మొదట విలన్‌గా చేశాడు, ఆ తర్వాత హీరో అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ కట్టప్ప తరహా పాత్రలు చేశాడు. నేటితరం నన్ను విలన్‌గా చూడలేదు కదా, అందుకే మళ్లీ విలన్‌గా నటిస్తా అంటున్నారు. అలా విభిన్నమైన ప్రయత్నాలు చేసేంత ఆత్మవిశ్వాసాన్నిచ్చిన సినిమాలే ఆ రెండూ. ఈ కథల గురించి చెప్పినప్పుడు నీ స్టైల్‌ సినిమాలు కాదన్నవాళ్లు చాలా మందే. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో పెళ్లాంతో చెంప దెబ్బ తింటాను, ఆమెని డబ్బు అడుగుతాను. ‘జై భీమ్‌’లో తొలి అరగంట వరకు నా పాత్ర కనిపించదు. హీరోయిజం గురించి ఆలోచిస్తే ఆ తరహా సినిమాలు చేయలేం. వాటి గురించి ఆలోచించకుండా చేశాను కాబట్టే ఆ సినిమాలు నాకు అంత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. గుర్తింపుకి నోచుకోని తెగల గురించి, వారి సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించేలా చేసింది ‘జై భీమ్‌’. సామాజిక మార్పుని తీసుకొచ్చిన చిత్రాలవి. ఫాంటసీ సినిమాలే కాదు, ఈ తరహా ప్రయత్నాలు అప్పుడప్పుడు చేయాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓటీటీ మాధ్యమంలో సినిమాలు విడుదల చేస్తున్నప్పుడు ఎదురైన ఒత్తిడిని ఎలా అధిగమించారు?

సహజంగా మనకు ఎప్పుడూ కనిపించే ఒత్తిడే అది. థియేటర్‌ వచ్చినప్పుడు రంగస్థల వేదికలు కలవరపడ్డాయి, టెలివిజన్‌ వచ్చినప్పుడు థియేటర్‌ మనుగడ ఎలా అనే ఆందోళన మొదలైంది. ఇప్పుడు మా పిల్లలు టెలివిజన్‌ కాకుండా యూ ట్యూబ్‌ని చూస్తున్నారు. ఇలాంటి మార్పుని మనం ఎవ్వరం ఆపలేం కదా. అన్ని వేదికలు కలిసి మనుగడ సాధించడమే కీలకం. కొత్త వేదికల తర్వాత తప్పకుండా మంచి కంటెంట్‌ వెలుగులోకి వస్తుంది. తమిళనాడులో దాదాపుగా 8 కోట్ల జనాభా ఉంది. అందులో 80 లక్షల మందే సినిమాలు చూస్తారు. మిగతా ప్రేక్షకుల్ని ఓటీటీ తరహా మాధ్యమాలతో సినిమాల్ని చేరువచేసే అవకాశం ఉంది. దానికితోడు ‘బాహుబలి’ తరహా సినిమాలతో భాషల మధ్య హద్దులు చెరిగాయి. ఓటీటీ మాధ్యమాలు ఆ హద్దుల్ని మరింతగా తుడిచేశాయి.

కొత్త సినిమాల సంగతులేమిటి?

బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. వెట్రిమారన్‌ దర్శకత్వం వహిస్తున్న 'వాడివాసల్‌' పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వందల మందికిపైగా కలిసి చేయాల్సిన సన్నివేశాలు అందులో ఉంటాయి. కరోనావల్ల అది సాధ్యపడటం లేదు. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తామేమో.

'ఈటి' కోసం తెలుగులో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. ఎలా అనిపించింది?

ఈ సినిమా కోసం తెలుగులో సంభాషణల్ని చెప్పడాన్ని చాలా ఆస్వాదించా. తమిళం కంటే ముందు తెలుగు డబ్బింగ్‌నే పూర్తి చేశా. తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ చాలా బాగుందని దర్శకుడు మెచ్చుకున్నారు. 'గ్యాంగ్‌' కోసం చెప్పాను కానీ.. ఇది ఎక్కువ తృప్తినిచ్చింది.

ఇదీ చదవండి: ఓటీటీలో రవితేజ 'ఖిలాడీ'.. 100 కోట్ల క్లబ్​లో గంగూబాయి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.