ETV Bharat / sitara

బాలీవుడ్​లో 'సెట్​' చేయాలి.. లేదంట కష్టమే!

author img

By

Published : Apr 30, 2021, 11:08 AM IST

పలు హిందీ సినిమాల షూటింగ్​లు కరోనా ప్రభావంతో నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు వాటికి సంబంధించిన సెట్​ల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే వీలైనంత త్వరగా వాటిలో చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందాలు భావిస్తున్నాయి.

salman khan alia bhatt
సల్మాన్-ఆలియా భట్

భారీ స్థాయిలో సినిమాల్ని మొదలుపెట్టారు. ఇంతలోనే కరోనా మొదలైపోయింది. తొలి దశ గండాన్ని దాటి చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ సెట్స్‌పైకి తీసుకెళ్లారు దర్శక నిర్మాతలు. అనుకున్న ప్రాంతాలకు వెళ్లి చిత్రీకరణ చేయడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. విదేశాలకు వెళ్లాలంటే మరింత కష్టం. అందుకే బృందాలు ప్రత్యేకంగా సెట్లను నిర్మించుకుని చిత్రీకరణలను షురూ చేశాయి. కానీ ఇప్పుడు రెండో దశ భయపెడుతోంది. మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో ప్రభుత్వం సినిమాల విషయంలో కఠిన నిబంధనలు విధించింది. ఆ నిబంధనలు పాటిస్తూ సినిమాలు చేయడం ఇబ్బందిగా మారడం వల్ల చాలా వరకూ బృందాలు చిత్రీకరణలను ఆపేశాయి. అదే సమయంలో సినిమా బృందంలో కీలకమైన వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగులు ఆపక తప్పలేదు. ఇప్పుడు దర్శకనిర్మాతల్ని మరో కొత్త సమస్య వెంటాడుతోంది. అదే సెట్లు. పనిగట్టుకుని వేసిన సెట్లలో సాధ్యమైనంత తొందరగా చిత్రీకరణ చేయకపోతే అవి పాడవుతాయి. పైగా ఒక నెల ఆగితే వర్షాలు మొదలవుతాయి. అప్పుడు కష్టం అంతా నీటిపాలు అవుతుందనే ఆందోళన బాలీవుడ్‌లో ప్రస్తుతం కనిపిస్తోంది.

అలియాభట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. అలియా, వేశ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం గతేడాదే కామాటిపుర ప్రాంతానికి సంబంధించిన సెట్‌ను తీర్చిదిద్దారు. కానీ తొలి దశ కరోనా ప్రభావంతో చిత్రీకరణ చేయడం వీలుగాక ఆ సెట్‌ను కూల్చేశారు. కరోనా ప్రభావం తగ్గాక కామాటిపుర సెట్‌ను మళ్లీ కొత్తగా తీర్చిదిద్దారు. ఇప్పుడు పరిస్థితి షూటింగులకు అనువుగా లేదు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.

*సల్మాన్‌ఖాన్‌ ‘టైగర్‌ 3’ చిత్రీకరణ కోసం టర్కిష్‌ విలేజ్‌ సెట్‌ను తీర్చిదిద్దారు. ఇస్తాంబుల్‌ వెళ్లి షూటింగు చేయడం కుదిరేలా లేదు కాబట్టి ఈ సెట్‌ను వేశారు.

*ఇదే క్రమంలో షారుక్ ఖాన్‌ ‘పఠాన్‌’, అమితాబ్‌బచ్చన్‌ ‘గుడ్‌బై’ కోసం కూడా ముంబయిలోనే సెట్లను నిర్మించారు. అక్షయ్‌కుమార్, ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ కలయికలో వస్తోన్న ‘అతరంగీ రే’ కోసం కూడా ప్రత్యేకంగా సెట్‌ వేశారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇలా ఇప్పుడు భారీ చిత్రాల కోసం సెట్లు సిద్ధంగా ఉన్నాయి.

akshay dhanush sara ali khan
అత్రాంగి రే షూటింగ్​లో అక్షయ్-ధనుష్-సారా అలీఖాన్

*అయితే షూటింగులు జరిపే పరిస్థితుల్లేవు. ఆలస్యమైతే ఆర్థికంగా నిర్మాతలు బాగా నష్టపోవాల్సి వస్తుంది. అదేసమయంలో సినిమాల విడుదల కూడా మరింత ఆలస్యం అవుతుంది. ఇది ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ చిత్రసీమను దెబ్బతీస్తుంది. అందుకే ఏది ఏమైనా వీలైనంత త్వరగా ప్రత్యేకంగా వేసిన ఈ సెట్లలో సినిమాలను పూర్తి చేయాలని చిత్రబృందాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.