ETV Bharat / science-and-technology

మొబైల్ ఫోన్​ లేకుండానే వాట్సాప్​!

author img

By

Published : Mar 22, 2021, 1:10 PM IST

వాట్సాప్ వెబ్​కు సంబంధించి ఓ కొత్త ఫీచర్​ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వాట్సాప్​ వెబ్​ను ఒక సిస్టమ్​లో మాత్రమే వాడేందు వీలుంది. ఈ పరిమితిని నాలుగు సిస్టమ్స్​కు పెంచనున్నట్లు సమాచారం. దీనితో పాటు వెబ్​కు కనెక్ట్ చేశాక.. మొబైల్​కు డేటా/వైఫై కనెక్టివిటీ లేకపోయినా వెబ్​ వెర్షన్​ పని చేయనున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp to launch Multi device Support soon
వాట్సాప్​ వెబ్​ వాడితే మొబైల్ డేటా అవసరం లేదు

వెబ్‌ ఆప్షన్‌ ద్వారా డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌లో వాట్సాప్‌ వాడుకోవడం మనకు తెలిసిందే. అయితే మొబైల్‌ డేటా/వైఫైకు కనెక్ట్‌ అయి ఉంటనే.. వాట్సాప్‌ వెబ్‌ పని చేస్తుంది. అది కూడా ఒకసారి ఒక సిస్టమ్‌లో మాత్రమే వాట్సాప్‌ వెబ్‌ వాడగలం. అయితే ఈ సమస్య లేకుండా.. మల్టీ డివైజ్‌ సపోర్ట్ తీసుకొస్తామని గతంలోనే వాట్సాప్‌ ప్రకటించింది. ఒకేసారి ఒకటికి మించిన సిస్టమ్స్‌లో వాట్సాప్‌ వాడుకునేలా చేయడమే ఈ మల్టీ డివైజ్‌ సపోర్టు విధానం. ప్రస్తుతం ఈ పనులు చివరి దశకొచ్చినట్లు తెలుస్తోంది.

ముందు బీటా యూజర్లకు మాత్రమే..

వాట్సాప్‌ బీటా ప్రోగ్రామ్‌లో తొలుత మల్టీ డివైజ్‌ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఆ ప్రోగ్రామ్‌లో మీరూ చేరితే మొబైల్‌ లేకుండానే వాట్సాప్‌ వెబ్‌ను వాడుకోవచ్చు. దీని కోసం పెద్ద ప్రక్రియే ఉంది. వెబ్‌ బీటా పేరుతో వాట్సాప్‌ ఈ ప్రక్రియను నిర్వహించనుంది. ఈ ప్రోగ్రామ్‌ త్వరలో మొదలవుతుంది. అప్పుడు వాట్సాప్‌ ఇచ్చే లింక్‌ ద్వారా బీటా ప్రోగ్రామ్‌లో జాయిన్‌ అవ్వాలి. మీ ప్రవేశాన్ని వాట్సాప్‌ ఆమోదిస్తే.. మీ ఖాతాలో కొన్ని మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా మీ మొబైల్‌కు డేటా/నెట్‌ కనెక్టవిటీ లేకుండా వాట్సాప్‌ వెబ్‌ పని చేస్తుంది.

వాట్సాప్‌ వెబ్‌ కేవలం ఒక సిస్టమ్‌లోనే కాదు.. ఏకంగా నాలుగు సిస్టమ్స్‌లో వాడుకోవచ్చు. అయితే బీటా ప్రోగ్రామ్‌ కావడం వల్ల వాట్సాప్‌ వాడే సమయంలో మెసేజ్‌ల డిలీట్‌ లాంటి కొన్ని రెగ్యులర్‌ ఫీచర్లు పని చేయవు. తర్వాతి రోజుల్లో ఆ ఫీచర్లనూ అందుబాటులోకి తీసుకొస్తారట.

బీటా ప్రోగ్రామ్‌లో చేరాక.. మీరు ఎవరితోనైనా చాట్‌ చేయాలన్నా, కాల్స్‌ మాట్లాడాలన్నా అవతలి వ్యక్తి వాట్సాప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ వాడుతుండాలి. ఈ బీటా ప్రోగ్రామ్‌ వాట్సాప్‌, వాట్సాప్‌ బిజినెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయి, వాట్సాప్‌కు సంతృప్తికర ఫలితాలు వస్తే అందరూ మొబైల్‌ లేకుండానే.. వాట్సాప్‌ వెబ్​ను వాడుకోవచ్చు. అంటే లాగిన్‌ అయిన తర్వాత ఆ మొబైల్‌కు డేటా/వైఫై కనెక్టివిటీ లేకపోయినా వాట్సాప్ వెబ్ పని చేస్తుంది.

ఇదీ చదవండి:ఛార్జర్​ లేదని యాపిల్​కు రూ.15 కోట్లు ఫైన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.