ETV Bharat / priya

సంక్రాంతి విందు.. పిండి వంటలతో పసందు

author img

By

Published : Jan 10, 2021, 7:10 PM IST

special-recipes-for-sankranthi-festival
సంక్రాంతి విందు.. పిండి వంటలతో పసందు

ముంగిట ముత్యాల ముగ్గులూ...పచ్చని తోరణాల అలంకరణతో ఇళ్లు కళకళలాడే సంక్రాంతి వేళ... చేసే పిండివంటలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి చేసుకునే పిండివంటల జాబితాలో వీటినీ చేర్చుకుంటే సరి.

కోవా తిల్‌ బర్ఫీ

special-recipes-for-sankranthi-festival
కోవా తిల్‌ బర్ఫీ

కావలసినవి

నువ్వులు: రెండు కప్పులు, కోవా: కప్పు, బెల్లం: కప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, బాదం: ఇరవై, యాలకులపొడి: చెంచా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నువ్వులు వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో కోవాను కూడా రెండు నిమిషాలు వేయించి తీసుకోవాలి అందులోనే చెంచా నెయ్యి వేసి అది వేడెక్కాక బెల్లం వేయాలి. ఇది కరిగాక రెండు చెంచాలు తప్ప మిగిలిన నువ్వుల్ని ముద్దలా చేసి బెల్లంలో వేసి బాగా కలిపి తరువాత యాలకులపొడి, కోవా, బాదం పలుకులు వేసి మరోసారి కలిపి స్టౌని కట్టేయాలి. ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడే కావాల్సిన ఆకృతిలో ముక్కల్లా కోసి నువ్వులు అద్దాలి.

మినప చెక్కలు

special-recipes-for-sankranthi-festival
మినప చెక్కలు

కావలసినవి

మినప్పప్పు: కప్పు, మిరియాలపొడి: రెండు చెంచాలు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం

మినప్పప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత నీళ్లు వంపేసి మిక్సీలో వేసి, మిరియాలు, బియ్యప్పిండితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరం అనుకుంటే ఒకటిరెండు చెంచాల నీళ్లు పోసుకోవాలి. ఇందులో చెంచా నూనె, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక ఈ పిండిని కొద్దిగా తీసుకుని పల్చగా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిన పిండీ చేసుకోవాలి. ఈ చెక్కలు ఎంత పల్చగా ఉంటే అంత కరకరలాడుతూ ఉంటాయి. ఇవి నాలుగైదు రోజుల వరకూ నిల్వ ఉంటాయి.

చంద్రకాంతలు

special-recipes-for-sankranthi-festival
చంద్రకాంతలు

కావలసినవి పెసరపప్పు: కప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పు, కొబ్బరి తురుము: అరకప్పు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, యాలకులపొడి: చెంచా ఉప్పు: చిటికెడు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం

పెసరపప్పును గంటముందు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు పూర్తిగా వంపేసి మిక్సీలో వేసి... అవసరమైతే కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి చక్కెర, పెసరపప్పు ముద్ద, కొబ్బరి తురుము, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి. చక్కెర కరగడం మొదలయ్యాక స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమం పూర్తిగా చిక్కగా అవుతున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసి దింపేసి నెయ్యిరాసిన ప్లేటులో తీసుకుని కావాల్సిన సైజులో ముక్కల్లా కోయాలి. ఇలా చేసుకున్న వాటిని ఆ తరువాత కాగుతున్న నూనెలో వేసి
ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

రింగు మురుకులు

special-recipes-for-sankranthi-festival
రింగు మురుకులు

కావలసినవి

బియ్యప్పిండి: రెండు కప్పులు, వేయించిన మినప్పప్పు పొడి: పావుకప్పు, వేయించిన పెసరపప్పు పొడి: పావుకప్పు, కొబ్బరి పాలు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం

ఓ గిన్నెలో బియ్యప్పిండి, మినప్పిండి, పెసరపప్పు పిండి తీసుకుని బాగా కలిపి అందులో తగినంత ఉప్పు, కొబ్బరిపాలు వేసి మరోసారి కలిపి... తరువాత నీళ్లు చల్లుకుంటూ మురుకులపిండిలా చేసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్‌పకోడాలు చేసే ప్లేటును మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఈ పిండిని నూనె రాసిన మురుకుల గొట్టంలో తీసుకుని... ప్లేటులో చిన్నచిన్న ముక్కల్లా ఒత్తుకుని గుండ్రంగా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని అయిదారు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.