ETV Bharat / priya

చికెన్‌ కూరలు.. కమ్మగా, కారంగా..!

author img

By

Published : Nov 27, 2022, 9:35 AM IST

Chicken Recipes
Chicken Recipes

Chicken Recipes: సండే వచ్చిందంటే.. ఇంట్లో నాన్​వెజ్ ఉండాల్సిందే. మటన్​కు ప్రియులు ఎక్కువగా ఉన్నా.. దాని ధర వల్ల చాలా మంది చికెన్​వైపే మొగ్గుచూపుతారు. మరి ప్రతి సండే చికెన్ కర్రీ అంటే చిరాకేగా. అందుకే చికెన్​లో రకరకాల వెరైటీలు చేస్తూ ఆస్వాదిస్తుంటారు. ఎప్పుడూ చికెన్​తో కర్రీసే చేసుకుంటున్నారా? కాస్త డిఫరెంట్​గా ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ సండే.. ఇలా చేసేయండి మరి..

Chicken Recipes: చికెన్‌తో ఎన్నిరకాల కూరలు చేసుకుంటున్నా.. ఇంకా వెరైటీగా ఎలా వండొచ్చని ఆలోచిస్తుంటారు చికెన్‌ ప్రియులు. అలాంటివారికోసమే ఈ కూరలు. అన్నం, రోటీ, పులావ్‌... ఇలా దేంతోనైనా తినగలిగే ఈ వంటకాలనూ మీరూ చూసేయండోసారి.

దహీ మసాలా కర్రీ:

కావలసినవి: చికెన్‌: అరకేజీ, పెరుగు: కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, పచ్చిమిర్చి ముద్ద: చెంచా, జీలకర్రపొడి: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నెయ్యి: పావుకప్పు, టొమాటోలు: రెండు, ఉల్లిపాయలు: రెండు, జీడిపప్పు ముద్ద: రెండు చెంచాలు, పచ్చిమిర్చి: మూడు, గోరువెచ్చని నీళ్లు: కప్పు, కసూరీమేథీ: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: ఓ గిన్నెలో పెరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, జీలకర్రపొడి, మిరియాలపొడి, గరంమసాలా, పసుపు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, చికెన్‌ ముక్కలు వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయముక్కలు, టొమాటో తరుగు వేయించాలి. తరువాత చికెన్‌ ముక్కలు వేసి ఓసారి వేయించి స్టౌని సిమ్‌లో పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక జీడిపప్పు ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, మరికొంచెం ఉప్పు, గోరువెచ్చని నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికాక కొత్తిమీర తరుగు, కసూరీమేథీ వేసి దింపేయాలి.

మలై చికెన్‌:

..

కావలసినవి: చికెన్‌ ముక్కలు: కేజీ, అల్లం-వెల్లుల్లి పేస్టు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు: రెండు, చిక్కటి పెరుగు: అరకప్పు, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, కారం: చెంచా, పచ్చిమిర్చి: నాలుగు, కసూరీమేథీ: రెండు టేబుల్‌స్పూన్లు (పావుకప్పు నీటిలో నానబెట్టుకోవాలి), తాజా క్రీమ్‌: పావుకప్పు, చిక్కని పాలు: అరకప్పు, బాదం పేస్టు: రెండు చెంచాలు, దాల్చినచెక్క: చిన్న ముక్క, యాలకులు: నాలుగు, మిరియాలు: చెంచా, నూనె: పావుకప్పు.

తయారీ విధానం: మూడు గంటల ముందు చికెన్‌ ముక్కలపైన కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు, కారం, అల్లం-వెల్లుల్లి పేస్టు, గరంమసాలా వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద కడాయి పెట్టి... నూనె వేయాలి. అది వేడెక్కాక దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు వేయించి ఉల్లిపాయముక్కలు వేసి కలపాలి. అవి వేగాక చికెన్‌, పచ్చిమిర్చి వేసి వేయించాలి. చికెన్‌ ఉడికాక పావుకప్పు నీళ్లు, మిగిలిన పదార్థాలు వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. కూర దగ్గరకు అయ్యాక దింపేయాలి.

చికెన్‌ ఫ్రై:

..

కావలసినవి: చికెన్‌ బ్రెస్ట్‌: అరకేజీ, కారం: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, అల్లంవెల్లుల్లి తరుగు: టేబుల్‌స్పూను,
మిరియాలపొడి: చెంచా, దనియాలపొడి: మూడు చెంచాలు, చికెన్‌ మసాలా: చెంచా, సోయాసాస్‌: చెంచా, కొత్తిమీర: కట్ట,ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు.

తయారీ విధానం: ఓ గిన్నెలో కారం, పసుపు, తగినంత ఉప్పు కలిపి... ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన చికెన్‌ బ్రెస్ట్‌కు పట్టించాలి. పదినిమిషాలయ్యాక చికెన్‌ను ఉడికించుకుని తీసుకోవాలి. చికెన్‌ వేడి పూర్తిగా చల్లారాక ఫోర్కుతో వీలైనంత సన్నగా తరుగు మాదిరి చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తరుగు వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి తరుగు, మిరియాలపొడి, దనియాలపొడి, చికెన్‌ మసాలా, సోయాసాస్‌ వేసి వేయించుకోవాలి. ఇందులో చికెన్‌ తరుగు వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు వేసి రెండుమూడు నిమిషాలయ్యాక దింపేయాలి. ఒకవేళ చికెన్‌ తరుగు మరీ ఎండిపోయినట్లుగా ఉంటే.. స్టౌమీద ఉన్నప్పుడే రెండుమూడు చెంచాల గోరువెచ్చని నీరు చల్లుకోవచ్చు.

సుక్కా చికెన్‌ మసాలా:

..

కావలసినవి: చికెన్‌: అరకేజీ, ఉల్లిపాయలు: ఆరు (సన్నగా తరగాలి), అల్లంవెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: పావుకప్పు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, దాల్చినచెక్క: చిన్న ముక్క, లవంగాలు: ఆరు, యాలకులు: రెండు, జీడిపప్పు: పన్నెండు (నానబెట్టుకుని పేస్టులా చేసుకోవాలి). మసాలాకోసం: దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: చెంచా, మిరియాలు: అరచెంచా, సోంపు: చెంచా, ఎండుమిర్చి: అయిదు, కరివేపాకు రెబ్బలు: మూడు, ఎండు కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను.

తయారీ విధానం: బాణలిలో మసాలా పదార్థాలను వేయించుకుని ఆ తరువాత పొడి చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి చికెన్‌ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. పది నిమిషాలయ్యాక చేసి పెట్టుకున్న మసాలా, జీడిపప్పు ముద్ద, అరకప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికి కూర దగ్గరకు అయ్యాక నిమ్మరసం వేసి దింపేయాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.