ETV Bharat / opinion

అనారోగ్య భారతావనికి విముక్తి కలిగేదెన్నడు?

author img

By

Published : Aug 21, 2020, 7:12 AM IST

పౌరుల ఆరోగ్యమే ఏ దేశానికైనా మహాభాగ్యం. సమర్థ మానవ వనరులు కలిగిన దేశాలే ఉత్పాదక శక్తులుగా రాణిస్తాయి. అందుకు అనుగుణంగా జీవనశైలిలో సర్దుబాట్లపై జనచేతన పెంపొందించి.. పోషకాహార లోపాల పరిహరణను ప్రభుత్వాలు ఉద్యమ స్థాయిలో చేపట్టి నెగ్గుకొస్తేనే- ఆరోగ్య భారతావని సాకారమయ్యేది!

India
ఆరోగ్య భారతావని

ప్రపంచ మానవాళితో ఏటేటా మృత్యుక్రీడలాడటంలో ఎయిడ్స్‌, క్షయ, మలేరియాలకన్నా క్యాన్సర్లదే పెద్దపద్ధు అధికశాతం క్యాన్సర్‌ కేసులకు పొగాకు వాడకమే పుణ్యం కట్టుకుంటున్నదనడానికి వివిధ అధ్యయన ఫలితాలే రుజువు. ఈ ఏడాది చివరికి దేశంలో 13.9లక్షలకు చేరనున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్య 2025నాటికి 15.7లక్షలకు ఎగబాకనుందంటూ భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌), వ్యాధుల గణాంకాలూ పరిశోధన జాతీయ కేంద్రం(ఎన్‌సీడీఐఆర్‌) రూపొందించిన సంయుక్త నివేదిక ఆందోళనకర దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఎకాయెకి 27శాతం క్యాన్సర్‌ కేసులకు పొగాకు వినియోగమే హేతువన్న నిర్ధారణ పెను విషాద మూలాల్ని పట్టిస్తోంది.

ప్రధానంగా పొగాకు సేవనంవల్లే ఇండియాలో ఏటా 85వేలమంది పురుషులు, 34వేలమంది స్త్రీలు నోటి క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు ఆ మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ లెక్క చెప్పింది. చూడబోతే, పోనుపోను ముప్పు మరింత తీవ్రతరమవుతున్నట్లు సరికొత్త అధ్యయనం చాటుతోంది! అణ్వస్త్రాలకన్నా ఏటికేడు పెచ్చరిల్లుతున్న ‘పొగ’ ఉత్పత్తులే అత్యంత హానికరమన్న జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ(ఎన్‌ఓటీఈ) ఆ పరిశ్రమలో పెట్టుబడుల్ని, లైసెన్సుల జారీని స్తంభింపజేయాలని గతంలోనే కేంద్రానికి సూచించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా సిగరెట్‌ పెట్టెలూ బీడీ కట్టలపై బొమ్మల ముద్రణలకే ప్రభుత్వాలు పరిమితమవుతున్నాయి.

ఈ-సిగరెట్లకే పరిమితం..

ఏడాది కిందట ఈ-సిగరెట్లపై ఆంక్షలు విధించారు. వాస్తవంలో పొగ తాగేవారిలో మూడుశాతమే ఆ అలవాటును మానుకోగలుగుతున్నారని పార్లమెంటరీ స్థాయీసంఘం వెల్లడించగా, ధూమపానాన్ని వదిలేసినా మూడు దశాబ్దాలపాటు దుష్ప్రభావాలు వెన్నాడతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అరకొర చర్యలతో పొగాకు ముప్పును తప్పించలేరెవరూ! దేశీయంగా 60లక్షలమంది పొగాకు రైతులకు తగిన ప్రోత్సాహకాలందించి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళించడంతోపాటు కార్మికులకూ కొత్తదారి చూపడంపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి కేంద్రీకరించాలి.

ఆహారపు అలవాట్లు..

సగటున ప్రతి పదిమంది భారతీయుల్లో ఒకరికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు క్యాన్సర్‌ బారినపడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మదింపు వేసింది. జీవితకాలంలో ఎన్నడూ ధూమపానం జోలికే పోనివారిపైనా క్యాన్సర్‌ పడగనీడకు ముఖ్యకారణాలుగా గాడితప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు- పైకి తేలుతున్నాయి. కనుకనే వాతావరణ వైపరీత్యాలు జలకాలుష్యం మూలాన సీజన్లవారీగా విషజ్వరాలు అంటురోగాలు పీడిస్తుండగా- మరోవైపున స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్‌, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సంబంధ వ్యాధుల ప్రకోపం హడలెత్తిస్తోంది.

పౌష్టికాహార లోపం..

క్యాన్సర్‌ రోగుల్లో కరోనా వైరస్‌ వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువని విశ్లేషణలు ధ్రువీకరిస్తున్నాయి. జీవనశైలి వ్యాధులూ జతపడి కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయని ‘పద్మభూషణ్‌’ డాక్టర్‌ నిర్మల్‌కుమార్‌ గంగూలీ ప్రభృతులు నిగ్గు తేలుస్తున్నారు. కరోనా సంక్షోభంలో పోషకాహార లోపాల విజృంభణ మరింత కలవరపరచే పార్శ్వం. దక్షిణాసియా బాలలపై విస్తృత అధ్యయనంలో భాగంగా, కరోనా వల్ల నాలుగు కోట్లమంది పిల్లల్లో పౌష్టికాహార లోపాలు ముమ్మరిస్తాయని, ప్రధానంగా నష్టపోయేది ఇండియా పాకిస్థాన్లేనని ‘యునిసెఫ్‌’ చెబుతోంది.

ఒకవైపు, సేద్యరంగాన ఇతోధిక దిగుబడులు; మరోపక్క, పౌష్టికాహార కల్పన దిశగా 2025నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భారత్‌ సహా 88 దేశాల వెనకంజ- విధానపరమైన ప్రక్షాళన ఆవశ్యకతను ఉద్బోధిస్తున్నాయి. పౌరుల ఆరోగ్యమే ఏ దేశానికైనా మహాభాగ్యం. సమర్థ మానవ వనరులు కలిగిన దేశాలే ఉత్పాదక శక్తులుగా రాణిస్తాయి. అందుకు అనుగుణంగా జీవనశైలిలో సర్దుబాట్లపై జనచేతన పెంపొందించి, పోషకాహార లోపాల పరిహరణను ప్రభుత్వాలు ఉద్యమ స్థాయిలో చేపట్టి నెగ్గుకొస్తేనే- ఆరోగ్య భారతావని సాకారమయ్యేది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.