ETV Bharat / opinion

RTI Act: ప్రశ్నిస్తే... ప్రాణాలు తోడేస్తారా?

author img

By

Published : Oct 3, 2021, 7:31 AM IST

RTI act
ప్రశ్నిస్తే... ప్రాణాలు తోడేస్తారా?

ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాలను ప్రోదిచేయడమే లక్ష్యంగా పురుడు పోసుకున్న సమాచార హక్కు చట్టమంటే- అధిక శాతం అధికారులకు ఆది నుంచీ కడుపు మంటే! పత్రాల్లోని సమాచారం ప్రజల ముందుకొస్తే- తమ అవినీతి పీఠాలు కదిలిపోతాయన్న భయం కొందరిదైతే, సామాన్యుల ప్రశ్నలకు తాము సమాధానమిచ్చేది ఏమిటన్న అహంభావం మరికొందరిది! అవినీతిని నాయకులకు, అక్రమార్కులకు స.హ.చట్టం కంటగింపు అయ్యాక- ప్రశ్నించే గొంతులను కర్కశంగా నులిమేసే దారుణకృత్యాలు ఆరంభమయ్యాయి. (RTI activist shot dead)

'మా అబ్బాయికి పది రూపాయలు ఇచ్చి కిరాణాకొట్టుకు పంపితేనే తిరిగి వచ్చాక లెక్క అడుగుతా. అటువంటిది వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టే ప్రభుత్వాన్ని మనమెందుకు లెక్కలు అడగకూడదు?'

సమాచార హక్కు కోసం రెండున్నర దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా ఎగసిన చైతన్యోద్యమానికి ప్రేరణగా నిలిచిన ఒక దిగువ మధ్యతరగతి రాజస్థానీ గృహిణి ప్రశ్న అది! 'హమారా పైసా- హమారా హిసాబ్‌'(డబ్బు మాది-లెక్కలు మాకు తెలియాలి) అంటూ ఆనాడు జాగృత జనవాహిని కదంతొక్కింది. తత్ఫలితంగానే 2005 అక్టోబరు 12న సమాచార హక్కు చట్టం (Right To Information act) అమలులోకి వచ్చింది.

ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనాలను ప్రోదిచేయడమే లక్ష్యంగా పురుడు పోసుకున్న ఈ చట్టమంటే- అధిక శాతం అధికారులకు ఆది నుంచీ కడుపు మంటే! పత్రాల్లోని సమాచారం ప్రజల ముందుకొస్తే- తమ అవినీతి పీఠాలు కదిలిపోతాయన్న భయం కొందరిదైతే, సామాన్యుల ప్రశ్నలకు తాము సమాధానమిచ్చేది ఏమిటన్న అహంభావం మరికొందరిది! రహస్యాలకు రాజపోషకులైన వారందరూ కలిసి స.హ.చట్టాన్ని చాపచుట్టేయడానికి ఆనాటి నుంచే పన్నాగాలు ప్రారంభించారు. వెర్రిమొర్రి కారణాలతో దరఖాస్తులను తిరగ్గొట్టే పెడపోకడలకు లాకులెత్తారు. అవినీతిని తమ జన్మహక్కుగా భావించే నాయకులకు, ప్రజాధనాన్ని సుష్ఠుగా భోంచేసే అక్రమార్కులకూ స.హ.చట్టం కంటగింపు అయ్యాక- ప్రశ్నించే గొంతులను కర్కశంగా నులిమేసే దారుణకృత్యాలు ఆరంభమయ్యాయి. కీలక అంశాలపై సమాచార దరఖాస్తులను సంధించే ఉద్యమకారులపై ఇప్పుడు రాష్ట్రాలకు అతీతంగా భౌతిక దాడులు పెచ్చరిల్లుతున్నాయి. ప్రజావేగుల రక్తాన్ని కళ్లజూస్తున్న పేరుగొప్ప ప్రజాస్వామ్య దేశంలో చట్టబద్ధ పాలనాదర్శాలన్నీ నేతిబీరకు నకళ్లుగా వర్ధిల్లుతున్నాయి!

ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు గుటకాయ స్వాహా చేసే కబ్జారాయుళ్లకు భారతదేశంలో లోటులేదు. బిహార్‌లోని తూర్పు చంపారన్‌ జిల్లాలో సైతం కొందరు పెద్దలు సర్కారీ స్థలాలను గుప్పిటపట్టారు. ఆ గద్దల గుట్టుమట్లు బయటపెట్టడానికి స.హ. దరఖాస్తులు చేసిన పాపానికి బిపిన్‌ అగర్వాల్‌ అనే ప్రజావేగును పది రోజుల క్రితం పట్టపగలే ప్రభుత్వ కార్యాలయం ముందే కాల్చిచంపారు. అగర్వాల్‌ ఇంటిపై నిరుడే దాడికి తెగబడిన దుండగులు- అతడి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. రక్షణ కోసం బాధితుడు రక్షకభటులను ఆశ్రయించినా- మొర ఆలకించిన వారెవరూ లేరు! 'పోలీసులు పట్టించుకొని ఉంటే ఇవాళ మా అబ్బాయి బతికి ఉండేవాడు' అంటూ కన్నీరుమున్నీరవుతున్న బిపిన్‌ తండ్రిని ఎవరు సముదాయించగలరు?

బిహార్​లో 20 మంది

అక్రమ ఇసుక తవ్వకాలపై పోరాడిన పంకజ్‌ కుమార్‌ సింగ్‌, ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిని వెలుగులోకి తెచ్చిన వాల్మీకి యాదవ్‌- ఇలా బిహార్‌లో గడచిన పదేళ్లలో 20 మంది దారుణ హత్యలకు గురయ్యారు. స.హ.చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు అయిదు వందల మంది ఉద్యమకారులపై దాడులు చోటుచేసుకున్నాయి. (RTI activist shot dead) వారిలో 95 మంది హతులయ్యారని, వేధింపులకు తాళలేక మరో ఏడుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనీషియేటివ్‌ గణాంకాలు సాక్ష్యమిస్తున్నాయి. నిలదీసేవారి నిండుప్రాణాలను బలిగొన్న వారికి నెలవులుగా మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌ దుష్కీర్తిని మూటగట్టుకొన్నాయి. ఏడు హత్యలతో ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఆ రక్తచరిత్రలో తమ వంతు పాపాలను పంచుకొంటున్నాయి. స.హ. ఉద్యమకారులకు రక్షణ కల్పించాలని గుజరాత్‌ సర్కారును జాతీయ మానవ హక్కుల సంఘం ఏనాడో ఆదేశించినా- అక్కడ అకృత్యాలు ఆగలేదు. అవినీతి, అక్రమాలపై ఉప్పందించేవారి భద్రత కోసం ఉద్దేశించిన ప్రజావేగుల రక్షణ చట్టం పూర్తిగా పట్టాలకు ఎక్కనేలేదు. ప్రత్యేక శాసనంతో నిమిత్తం లేకుండా అందరికీ తగిన రక్షణ కల్పించే పటుతర నిబంధనలు ప్రస్తుత చట్టాల్లో ఉన్నాయని రెండేళ్ల క్రితం పార్లమెంటులో కేంద్రం సెలవిచ్చింది. క్షేత్రస్థాయిలో అవేవీ ప్రజావేగుల ప్రాణాలకు రక్షరేకులు కాకపోవడమే జాతి దౌర్భాగ్యం!

'అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడం మంచి సంస్కృతి కాదు... దీనివల్ల అనవసర సందేహాలు, ప్రశ్నలను లేవనెత్తే అలవాటు ప్రజల్లో ప్రబలిపోతోంది' అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిరణ్‌ రిజుజు లోగడ ప్రవచించారు. ప్రశ్నకు స్థానం లేని వ్యవస్థ నియంతృత్వం అవుతుందే గాని ప్రజాస్వామ్యం కాజాలదు. ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకొన్న పౌరులు దేశవ్యాప్తంగా ఏడాదికి 40 నుంచి 60 లక్షల వరకు స.హ. దరఖాస్తులు పెడతున్నారు. వారిలో 45 శాతానికన్నా తక్కువ మందికే తాము కోరిన పూర్తి సమాచారం అందుతున్నట్లు అంచనా! అసలు ఎవరూ అడగకుండానే సెక్షన్‌-4 కింద సింహభాగం సమాచారాన్ని ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉన్నా- ఆ నిబంధన చాలా చోట్ల నీటి మీద రాతగా మిగిలిపోతోంది. చట్టాన్ని తుంగలో తొక్కే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన సమాచార కమిషన్లు తూతూమంత్రం విచారణలతో సరిపెడుతున్నాయి. దానికి తోడు పోనుపోను ఇంతలంతలవుతున్న పెండింగ్‌ కేసుల భారంతో అవి ఆపసోపాలు పడుతున్నాయి. నిరుడు అక్టోబరు నాటికి దేశవ్యాప్తంగా 20 సమాచార కమిషన్లలో 2.21 లక్షలకు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. తమకు విధేయులైన విశ్రాంత అధికారులు, అంతేవాసులను సమాచార కమిషనర్లుగా కొలువుతీరుస్తూ- ప్రభుత్వాధినేతలు సహ చట్ట స్ఫూర్తిని నీరుగార్చేస్తున్నారు. అటువంటి నియామకాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేస్తుండటంతో కొన్నేళ్లుగా కమిషన్లలో ఖాళీలను భర్తీ చేయడమే తగ్గించేశారు.

పెడపోకడల్లో మార్పు లేదు..

దేశవ్యాప్తంగా దాదాపు 50 శాతం సమాచార కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తూ- ఆయా కమిషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులు, నియామకాల వివరాలను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కమిషనర్ల నియామకాల్లో అలవిమాలిన జాప్యంపై న్యాయపాలిక రెండేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తంచేసినా పాలకుల పెడపోకడల్లో వీసమెత్తు మార్పు రాకపోవడమే విషాదకరం! 'తన చేతల గురించి ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ విధి. వ్యవస్థలో పారదర్శకత పెరిగేకొద్దీ ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం ఇనుమడిస్తుంది' అని ప్రధాని లోగడ అభిప్రాయపడ్డారు. తద్భిన్నంగా చీకట్లో పాలనకు పెద్దపీట వేస్తూ, నిర్లజ్జగా నిష్పూచీగా అక్రమాలకు అంటుకడుతున్న అధికార యంత్రాంగం, నేతాగణాల జుగుల్బందీ- జనస్వామ్య పునాదులనే కదలబారుస్తోంది!

- శైలేష్‌ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.