ETV Bharat / opinion

నాణ్యమైన విద్య అందేదెప్పుడు?

author img

By

Published : Aug 6, 2021, 7:20 AM IST

ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా సమగ్రాభివృద్ధి సాధించాలంటే నాణ్యమైన విద్య కీలకం. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సమగ్ర విద్య అందితేనే దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తారు. దేశంలో పేరుగాంచిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పేరుకుపోయిన అధ్యాపకుల ఖాళీలను చూస్తుంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని స్పష్టం అవుతోంది.

విశ్వవిద్యాలయాలు
విశ్వవిద్యాలయాలు

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా భారత్‌ ప్రథమ స్థానం సంపాదించింది. కానీ, నాణ్యమైన విద్యను అందించడంలో వెనకబడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పోలిస్తే మన దేశంలోని యూనివర్సిటీలు తీసికట్టుగానే నిలుస్తున్నాయి. తాజా క్యూఎస్‌ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ తొలి 100 జాబితాలో భారత్‌ నుంచి ఒక్క విశ్వవిద్యాలయమూ చోటు సంపాదించుకోలేకపోవడమే దీనికి నిదర్శనం. యూనివర్సిటీల్లో సరిపడా మానవ వనరులు లేకపోవడం మన దేశంలో ప్రధాన సమస్య. భారత్‌లోని 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నేటికీ దాదాపు 32.7శాతం అధ్యాపకుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యార్థులు సమగ్ర అభివృద్ధిని సాధించాలంటే అన్ని రకాల కోర్సులపై దృష్టి సారించి అధ్యాపకుల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడం అత్యావశ్యకం.

ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా సమగ్రాభివృద్ధి సాధించాలంటే నాణ్యమైన విద్య కీలకం. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సమగ్ర విద్య అందితేనే దేశాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తారు. దేశంలో పేరుగాంచిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పేరుకుపోయిన అధ్యాపకుల ఖాళీలను చూస్తుంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని స్పష్టం అవుతోంది. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 19,355 పోస్టులుంటే, వాటిలో 6334 ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా పడిఉన్నాయి. విద్యానాణ్యత మెరుగుదల నివేదిక ప్రకారం దేశంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో 35శాతం, రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో 38శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు శాతం మెరుగుపడుతున్నా, అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

కొరవడిన ప్రోత్సహికాలు..

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యారంగంలో సుమారు అయిదు లక్షల మంది అధ్యాపకుల కొరత ఉందని అంచనా. విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల బోధకులపై భారం పెరుగుతోంది. ఫలితంగా వారు సొంత పరిశోధనల మీద దృష్టి సారించలేకపోతున్నారు. విద్యార్థులను పరిశోధన రంగంలో ప్రోత్సహించలేకపోతున్నారు. దీనివల్ల విద్యార్థులు ఏళ్ల తరబడి శ్రమించినా వారి పరిశోధనలు పూర్తికావడంలేదు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం పెరగడం వల్ల అధికార నిర్ణయాలు పాలక ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వారు చెప్పిందే వేదంగా అన్నీ సాగుతున్నాయి. పేరుకు రకరకాల కోర్సులు ప్రవేశపెడుతున్నా, అందుకు తగినట్టుగా అధ్యాపకులను నియమించడంలేదు. దిల్లీ విశ్వవిద్యాలయంతో పాటు దాని పరిధిలోని అనుబంధ కళాశాలల్లో సుమారు 140 కోర్సులను అందిస్తున్నారు. ఆ విశ్వవిద్యాలయ పరిధిలో చదవడానికి ఏటా దాదాపు 2.5 లక్షల మంది పోటీపడుతున్నారు. అయితే ఆయా కోర్సులను బోధించే అధ్యాపకులు సరిపడా లేకపోవడం విచారకరం.

రాజకీయ జోక్యం..

దిల్లీ విశ్వవిద్యాలయంలో భర్తీ చేయడానికి అనుమతి పొందిన పోస్టుల్లో 49శాతం ఖాళీగా ఉన్నాయి. అలహాబాద్‌ విశ్వవిద్యాలయానికి 863 పోస్టులు మంజూరవగా, 598 పోస్టులు (69శాతం) ఖాళీగా ఉన్నాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 33శాతం, ఒడిశా విశ్వవిద్యాలయంలో 89శాతం అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత విద్యలో విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి తగిన రీతిలో ఉంటేనే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ విషయంలో ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌ చాలా వెనకబడి ఉంది. విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి కెనడాలో 9:1, రష్యాలో 10:1, స్వీడన్‌లో 12:1, బ్రిటన్‌లో 16:1, బ్రెజిల్‌, చైనాల్లో 19:1 ఉండగా- భారత్‌లో 23:1. విశ్వవిద్యాలయాల్లో మానవ వనరుల కొరతతో పాటు నిధుల లేమీ మరో పెద్ద సమస్య. ఈ పరిస్థితులు మారాలంటే వాటిలో సమూల మార్పులు జరగాలి. విశ్వవిద్యాలయాల పరిపాలన విషయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. పరిపాలన అధికారులు లేక చాలా వర్సిటీల్లో పాలన కుంటువడుతోంది. అధికారులతో పాటు, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.

ఇందుకోసం నిపుణుల సూచనలు తీసుకొని న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలి. అవసరాన్ని బట్టి నియామకాలు క్రమబద్ధంగా జరిగేలా వార్షిక ఉద్యోగ భర్తీ ప్రక్రియను అమలు చేయవలసిన అవసరం ఉంది. బోధన, పరిశోధన, సేవల్లో రాణించడానికి సూక్ష్మ స్థాయిలో ప్రతి ఉన్నత విద్యాసంస్థలో సంస్థాగత అభివృద్ధి ప్రణాళికతో కూడిన స్వతంత్ర బోర్డు ఉండాలని జాతీయ విద్యావిధానం 2020 సూచిస్తోంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అధికారులు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి విశ్వవిద్యాలయాలను దేశ ప్రగతి దివ్వెలుగా తీర్చిదిద్దాలి.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ ('సెస్‌'లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.