ETV Bharat / opinion

గిరాకీని పెంచే బడ్జెట్​పై ఆశలు.. దేశార్థికానికి ఊపు తెస్తుందా?

author img

By

Published : Jan 31, 2022, 7:01 AM IST

Union Budget 2022 Expectations: కొవిడ్‌ కాలంలో జీవనోపాధి కోల్పోయిన కోట్లాది ప్రజల బతుకులు బాగుపడాలంటే దేశార్థికానికి కొత్త ఊపు తీసుకురావాలి. అంటే, ద్రవ్యోల్బణాన్ని, ఆర్థికాభివృద్ధిని సమతుల పరచుకుంటూ ముందుకు సాగాలి. మరి కేంద్ర బడ్జెట్‌ అందరి ఆశలనూ తీర్చగలదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

budget will give mileage to indian economy
కొత్త బడ్జెట్​ దేశార్థికానికి ఊపు తెస్తుందా?

Union Budget 2022 Expectations: కొవిడ్‌ దెబ్బకు కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను కేంద్ర బడ్జెట్‌ మళ్ళీ పట్టాలెక్కిస్తుందా అని భారతీయులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, సరఫరా గొలుసుల విచ్ఛిన్నం, ఉత్పత్తి వ్యయం పెరుగుదల అన్నీ కలిసి దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీశాయి. కొవిడ్‌ కాలంలో జీవనోపాధి కోల్పోయిన కోట్లాది ప్రజల బతుకులు బాగుపడాలంటే దేశార్థికానికి కొత్త ఊపు తీసుకురావాలి. అంటే, ద్రవ్యోల్బణాన్ని, ఆర్థికాభివృద్ధిని సమతుల పరచుకుంటూ ముందుకు సాగాలి. మరి కేంద్ర బడ్జెట్‌ అందరి ఆశలనూ తీర్చగలదా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రజల ఆదాయాలు పడిపోవడంతో వస్తుసేవల వినియోగం తగ్గిపోయింది. మరో విధంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో గిరాకీ పతనమైంది. అక్కడికీ 2022లో వ్యక్తిగత వినియోగ వ్యయం (గిరాకీ) 6.9శాతం పెరగనున్నా, 2020తో పోలిస్తే అది 2.9శాతం తక్కువే. ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఆడేలా చేస్తే, వస్తుసేవలకు గిరాకీ పెరుగుతుంది. పన్ను రేట్లు తగ్గించడం, ఇంటినుంచి పనిచేసేవారికి ఇచ్చే భత్యాలపై పన్ను మినహాయించడం వంటి చర్యలవల్ల వినియోగదారుల చేతిలో డబ్బు ఎక్కువ ఆడుతుంది. ఆ డబ్బును వస్తుసేవల కొనుగోలుకు ఖర్చు చేస్తారు. ఇంటి నుంచి పనిచేసే వేతన జీవులకు ఇప్పటికే అంతర్జాలం, ఫర్నిచర్‌ వంటి ఖర్చు అధికమైంది. కరెంటు బిల్లులూ పెరిగాయి. ఈ ఖర్చులను భర్తీ చేయడానికి పన్ను మినహాయించిన భత్యాలు ఇవ్వాలి. అలాగే స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని పెంచడంద్వారా మధ్యతరగతికి ఆర్థిక ఉపశమనం కల్పించాలి.

వృద్ధికి మార్గం

కొవిడ్‌ కాలంలో వ్యవసాయ రంగం ఎక్కువ వృద్ధిరేటు సాధించినా, వాస్తవ వేతనాలు మాత్రం పెరగలేదు. అంటే, గ్రామీణుల వేతనాలు ద్రవ్యోల్బణాన్ని మించి పెరగడం లేదు. అసలు కొవిడ్‌ విరుచుకుపడటానికి ముందే దేశంలో, ముఖ్యంగా గ్రామాల్లో గిరాకీ తగ్గిపోసాగింది. భారత శ్రామిక బలగంలో 43శాతం వ్యవసాయ రంగంలో ఉంది. వారి వాస్తవ వేతనాలు పెరగనందువల్ల యావత్‌ దేశంలో వస్తుసేవలకు గిరాకీ క్షీణించింది. ఫలితంగా పట్టణాల్లో పారిశ్రామిక వస్తూత్పత్తి తగ్గిపోయింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం బాగా దెబ్బతింది. పట్టణాల్లో లే ఆఫ్‌లు ఎక్కువయ్యాయి. పారిశ్రామికోత్పత్తి తగ్గిపోయింది. కరోనా వైరస్‌తో పరిస్థితి మరింత దిగజారిపోయి సంక్షోభానికి దారితీసింది. వ్యవసాయ రంగానికి ఎక్కువ పెట్టుబడులు, ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించడంవల్ల గ్రామాల్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచి దేశమంతటా వస్తుసేవలకు అధిక గిరాకీని సృష్టిస్తుంది. ఒక్కమాటలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చుపెట్టి గిరాకీకి అదనపు ఊతమివ్వాలి. పెరిగిన గిరాకీని తీర్చడానికి ఉత్పత్తి పెరుగుతుంది, దానితోపాటు ఉపాధి అవకాశాలు విజృంభిస్తాయి. జనం చేతిలో ఎక్కువ డబ్బు ఆడితే వినియోగమూ పెరిగి పారిశ్రామిక, వ్యావసాయిక రంగాలు వృద్ధి పథంలో పరుగు తీస్తాయి. పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద మరిన్ని పరిశ్రమలకు ప్రయోజనాలు అందించాలి. ఉద్యోగ నష్టాలను నివారించడంతోపాటు పాత, కొత్త ఉద్యోగులకు వేతన సబ్సిడీలు ఇవ్వాలి. రేపటి బడ్జెట్‌లో ఇలాంటి చర్యలన్నీ పొందుపరచాలి.

ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురావడానికి ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చుపెట్టడం వల్ల బడ్జెట్‌ లోటు, విత్త లోటు పెరిగే మాట నిజం. సర్కారు చేసే వ్యయం ఉత్పత్తిని, గిరాకీని పెంచేదిగా ఉండేలా చూసుకోవడమే అసలు సిసలు పరిష్కారం. ఏ రంగాల్లో ఖర్చు పెడితే ఎక్కువ ఫలితం సిద్ధిస్తుందో ఆయా రంగాల్లోనే ఎక్కువ నిధులు వ్యయం చేయాలి. ఎంత ఖర్చు పెట్టామనే దానికన్నా ఎలా ఖర్చు చేశామన్నదే ముఖ్యం. మూలధన వ్యయంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. మౌలిక వసతుల అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు ఎక్కువ మూలధనాన్ని వెచ్చిస్తే ఉత్పత్తి, గిరాకీ, ఉపాధి అవకాశాలు ఊపందుకుంటాయి. అలాంటి ఖర్చు ఉత్పాదకతను, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి కాలక్రమంలో అన్ని రకాల లోటులను భర్తీ చేస్తుంది. రోడ్లు, రేవులు, విమానాశ్రయాలను విస్తరిస్తుంది. అవి అభివృద్ధికి ఊపునిస్తాయి. ప్రభుత్వం చేసే వ్యయం వల్ల విత్త, బడ్జెట్‌ లోట్లు ఏర్పడటం సహజం. ఆ లోట్లు సహేతుకంగా, అభివృద్ధి జనకంగా ఉన్నాయా అనేది మదింపు చేయడానికి స్వయం నిర్ణయాధికారంగల రాజ్యాంగబద్ధ సంస్థను ఏర్పాటు చేయాలి. చేసిన ఖర్చు ఫలవంతమో కాదో ధ్రువీకరించే అధికారం ఆ సంస్థకు ఉండాలి. దానివల్ల ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు ప్రైవేటు సంస్థలూ ముందుకొస్తాయి. స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటాయి.

పెరిగిపోయిన అంతరాలు

కొవిడ్‌ వల్ల పెరిగిపోయిన ఆదాయ, ఆర్థిక అసమానతలను సరిదిద్దడానికి కేంద్ర బడ్జెట్‌ తగిన చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ మూలంగా భారీ ఉద్యోగ, వ్యాపార నష్టాలు సంభవించి సామాన్య, మధ్యతరగతి ప్రజలు జీవనాధారాలు కోల్పోగా, ధనవంతులు మరింత సంపన్నులయ్యారని ఇటీవలి ఆక్స్‌ఫామ్‌ నివేదిక తెలిపింది. నిరుడు భారత్‌లో శతకోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరగ్గా, 84 శాతం ప్రజల ఆదాయాలు దారుణంగా క్షీణించాయని వెల్లడించింది. విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు సామాన్యుల జీవితాలు అతలాకుతలమవుతుంటే సంపన్నులు సంపదలో ఉన్నత శిఖరాలకు ఎగబాకుతున్నారు. 2020 మార్చిలో రూ.23.14 లక్షల కోట్లుగా ఉన్న భారత కుబేరుల సంపద 2021 నవంబరుకల్లా రూ.53.16 లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఇదే కాలంలో 4.6 కోట్ల భారతీయులు దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. మన గడ్డపై రెండు భారతాలు ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం. సంపన్న ఇండియా పెరుగుతూ ఉంటే, పేద భారతం కునారిల్లుతోంది. సరైన విధానాలు చేపడితే ఈ అసమానతలను సాధ్యమైనంతగా తగ్గించడం సాధ్యమే. బడ్జెట్‌ను ఇందుకు సమర్థ సాధనంగా ఉపయోగించుకోవచ్చు. దేశంలోని మహా ధనికులపై ఈ బడ్జెట్‌లో సంపద పన్ను విధించే విషయం ఆలోచించాలి. తద్వారా వచ్చే మొత్తాలను సామాన్యుల జీవితాలను మెరుగు పరచడానికి వెచ్చించవచ్చు.

కీలక రంగాలకు ప్రాధాన్యం

దేశ శ్రామిక బలగంలో 80శాతం వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాల్లోనే పని చేస్తున్నారు. అందువల్ల ఈ రెండు రంగాలను పునరుద్ధరిస్తే తప్ప యావత్‌ దేశార్థికం మళ్లీ పుంజుకోదు. వ్యవసాయ ఉత్పత్తి సాధనాలపై పన్నులు తగ్గించడం, ఎంఎస్‌ఎంఈ రంగానికి రాయితీలు ఇవ్వడం, అధిక ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమలకు ముడి సరకులు నిరాటంకంగా అందేలా చూడటం ద్వారా దేశార్థికాన్ని త్వరగా అభివృద్ధి పథంలో పరుగు తీయించవచ్చు.

- డాక్టర్ మహేంద్రబాబు కురువ, హెచ్​ఎల్​బీ గఢ్వాల్​ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్​ డీన్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి: పరిమితుల మధ్యే నిర్మలమ్మ బడ్జెట్​ కసరత్తు.. వరాలిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.