ETV Bharat / opinion

టన్నుల కొద్దీ కరోనా వ్యర్థాలతో ప్రాణాలకు ముప్పు​!

author img

By

Published : Aug 8, 2020, 7:09 AM IST

పర్యావరణానికి ప్రమాదంగా ఉన్న ప్లాస్టిక్ చెత్తకు కొవిడ్ వ్యర్థాలు జతపడ్డాయి. మాస్కులు, టెస్టింగ్ కిట్లు, చికిత్స పరికరాలు టన్నుల కొద్దీ పేరుకుపోతున్నాయి. వీటిని సకాలంలో తరలించకపోతే వైరస్ గాలిలోకి వ్యాపించే ముప్పుంది. వీటిని పునర్వియోగించేలా కార్యాచరణ రూపొందించి అమలు పరిస్తేనే ఈ ప్రమాదం నుంచి బయటపడేది!

corona waste
కొవిడ్ వ్యర్థాలు

పర్యావరణానికి కర్కశంగా తూట్లు పొడుస్తున్న ఘన-రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్‌ చెత్తకు కొన్నాళ్లుగా కొవిడ్‌ వ్యర్థాలు జతపడి హడలెత్తిస్తున్నాయి. ఏడు కోట్లలోపు జనాభా కలిగిన ఒక్క యూకేలోనే ప్రతి వ్యక్తీ ఏడాది పాటు రోజూ ఒక మాస్క్‌ వాడి పారేస్తే 66 వేల టన్నుల చెత్త పేరుకుపోతుందన్న అంచనా- ప్రపంచానికి కొవిడ్‌ ఎంతటి గడ్డు సవాలు విసిరిందో చాటుతుంది.

కొవిడ్‌ కారణంగా రోజూ దేశంలో బయోమెడికల్‌ వ్యర్థాలే 700 మెట్రిక్‌ టన్నులకు పైబడుతున్నాయన్న జాతీయ హరిత ట్రైబ్యునల్‌- సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్రాలకు ఇటీవలే సూచించింది.. కొవిడ్‌ వ్యర్థాల వాహనాల్ని ఎక్కడా ఆపవద్దని పోలీస్‌ యంత్రాంగాన్ని కోరిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, 48 గంటల్లో వాటిని తరలించకపోతే వైరస్‌ గాలిలోకి వ్యాపించే ముప్పుందనీ హెచ్చరించింది.

టీకా వస్తేనే..

వ్యర్థాల భస్మీకరణానికి తగిన ఏర్పాట్లు చేశామని ఎవరేం చెబుతున్నా- వాస్తవిక స్థితిగతులు బెంబేలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 84 వేలకు పైగా లెక్కతేలిన ఆస్పత్రుల్లో సొంతంగా వ్యర్థాల నిర్మూలన ప్లాంట్లు కలిగినవి రెండు వందలకు లోపే. ఆస్పత్రులతోపాటు ఇళ్లలో ఐసొలేషన్‌లో ఉన్నవారు ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులు, సిరంజీలు తదితరాల తరలింపునకు విస్తృత ఏర్పాట్లు కొరవడి- సాధారణ చెత్తలోనే అవీ కలిసిపోతున్నట్లు క్షేత్రస్థాయి కథనాలు స్పష్టీకరిస్తున్నాయి.

టీకాలు అందుబాటులోకి వచ్చి కరోనా నియంత్రణ సాధ్యపడితే సహజంగానే కొవిడ్‌ వ్యర్థాల తాకిడి తగ్గుముఖం పడుతుంది. అక్కడితోనే సమస్య సమసిపోదు. దేశంలో ఏటా 62 మిలియన్‌ టన్నుల మేర చెత్త పోగుపడుతుండగా, అందులో శుద్ధీకరణకు నోచనిది ఎకాయెకి 45 మిలియన్‌ టన్నులు. ఈ ప్రాణాంతక వ్యర్థాల ముప్పును ఎదుర్కొనే సమర్థ కార్యాచరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా ముందడుగేయాలి.

వివిధ దేశాల్లో ఇలా..

ప్లాస్టిక్‌ వ్యర్థాల పాలబడి కడతేరిపోతున్న అసంఖ్యాక జలచరాలు, రోడ్లపై ఎక్కడికక్కడ పారేస్తున్న సంచులు తిని నరకయాతన అనుభవిస్తూ చనిపోతున్న పశువులు, అనర్థదాయక వ్యర్థాలు మేటవేసి పోటెత్తుతున్న వరదలు... దేశీయంగా సంక్షోభం తాలూకు భిన్నపార్శ్వాల్ని కళ్లకు కడుతున్నాయి. నిషేధం, పునర్వినియోగాల రూపేణా వ్యర్థాల నియంత్రణలో ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, స్వీడన్‌, ఐర్లాండ్‌ ప్రభృత దేశాలు ధీమాగా పురోగమిస్తున్నాయి.

మూడొంతులకుపైగా ప్లాస్టిక్‌ ఉత్పాదనల్ని వ్యర్థాల్ని తిరిగి ఉపయోగిస్తూ రి-సైక్లింగ్‌లో జపాన్‌ తనదైన ఒరవడి దిద్దుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల్ని కరిగించి మాస్కులు రూపొందిస్తున్న ఉగాండా- కొవిడ్‌ విసిరిన సవాలును ఆర్జన అవకాశంగా మలచుకొంది. స్కాట్లాండ్‌ వంటిచోట్ల వ్యర్థాలతో పటిష్ఠ రహదారుల నిర్మాణ సాంకేతికత పదును తేలుతోంది. నిర్మాణ వ్యర్థాల్ని 98శాతం మేర రి-సైకిల్‌ చేస్తూ సింగపూర్‌ విస్మయపరుస్తోంది.

మరి దేశంలో?

ప్లాస్టిక్‌ నుంచి పెట్రోలు, డీజిలు తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత పెట్రోలియం సంస్థ (ఐఐపీ) రూపొందించింది. పట్టణ వ్యర్థాలతో గ్రామాలకు ఎరువుల తయారీకి సంబంధించి విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. చెత్తనుంచి విద్యుదుత్పత్తికి ప్రత్యేక విభాగం భాగ్యనగరంలో ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

వ్యర్థాలనుంచి వెలుగులు విరబూయించే అటువంటి ప్లాంట్లు దేశంలో తక్కినచోట్లా సమధికంగా నెలకొనాలి. పునర్వినియోగానికి విశేష ప్రాముఖ్యం కల్పించి నీటిని గాలిని సంరక్షించుకునేలా పౌర చేతన వ్యూహాల్ని ప్రభుత్వాలు పట్టాలకు ఎక్కించాలి. రేపటితరంలో సామాజిక స్పృహ రగిలించేలా బోధనాంశాల్నీ ప్రక్షాళించాలి. ఈ బహుముఖ కార్యాచరణే ప్లాస్టిక్‌ సహా రకరకాల వ్యర్థాల బారినుంచి గట్టెక్కించి జాతికి ఊరట ప్రసాదించగలిగేది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.