ETV Bharat / opinion

అసమ్మతి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం

author img

By

Published : Feb 18, 2021, 6:45 AM IST

హింసోన్మాద ప్రజ్వలనాన్ని ప్రేరేపిస్తూ, శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తూ రెచ్చిపోయే పంచమాంగ దళాల పీచమణిచేందుకు మాత్రమే అక్కరకు రావాల్సిన ఐపీసీ-124 ఎ (రాజద్రోహం) నిబంధన- సర్కారీ విధానాలను తప్పుపడుతున్న వారిమీద ఎత్తిన కత్తిగా మారడం తీవ్రాందోళన కలిగిస్తోంది. వివాదాస్పద సాగు చట్టాల నేపథ్యంలో రైతుల ఆందోళనను పక్కనపెట్టి, దేశంపై సామాజిక ఆర్థిక సాంస్కృతిక యుద్ధానికి ప్రాతిపదిక సిద్ధం చెయ్యడం సహా.. దేశాన్ని అప్రతిష్ఠ పాలు చేసే అంతర్జాతీయ కుట్ర సాగుతోందంటూ దిల్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై రాజద్రోహ అభియోగాలు మోపింది. దేశ సమైక్యత సమగ్రతలకు ముప్పు ముంచుకొచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాల చేతి వజ్రాయుధం కావాల్సిన రాజద్రోహ చట్టం- అసమ్మతి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంగా భ్రష్టుపడుతోంది.

The imposition of the IPC section on those who err on the side of government policy is a matter of concern
అసమ్మతి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం

'సమాజంలో శాంతి భద్రతల్ని కాపాడేందుకు ప్రభుత్వాల చేతిలోగల శక్తిమంతమైన సాధనం- రాజద్రోహ చట్టం. అరాచక శక్తుల్ని అదుపు చేస్తున్నామన్న మిషతో అసమ్మతివాదుల నోరు నొక్కేయడానికి దాన్ని ప్రయోగించనే కూడదు'- దిల్లీ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి చేసిన ఈ వ్యాఖ్య పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అంటున్న పోలీసు యంత్రాంగానికి చెంపపెట్టులాంటిది. హింసోన్మాద ప్రజ్వలనాన్ని ప్రేరేపిస్తూ, శాంతి భద్రతలకు చితిపేరుస్తూ రెచ్చిపోయే పంచమాంగ దళాల పీచమణిచేందుకు మాత్రమే అక్కరకు రావాల్సిన ఐపీసీ 124 ఎ (రాజద్రోహం) నిబంధన- సర్కారీ విధానాలను తప్పుపడుతున్న వారిమీద ఎత్తిన కత్తిగా మారడమే తీవ్రాందోళన కలిగిస్తోంది. వివాదాస్పద సాగు చట్టాల నేపథ్యంలో రైతుల ఆందోళనను ఎగదోసి, ఇండియాపై సామాజిక ఆర్థిక సాంస్కృతిక యుద్ధానికి ప్రాతిపదిక సిద్ధం చెయ్యడంతోపాటు, దేశాన్ని అప్రతిష్ఠ పాలు చేసే అంతర్జాతీయ కుట్ర సాగుతోందంటూ దిల్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై రాజద్రోహ అభియోగాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పక్షం రోజులైంది.

ఆ తీర్పుతో కనువిప్పు..

రైతుల ట్రాక్టర్‌ ర్యాలీలో దొర్లిన అపశ్రుతిపై తొలి వార్తల మేరకు స్పందించిన జర్నలిస్టులపైనా రాజద్రోహ కేసులు పెట్టిన యంత్రాంగం- కిసాన్‌ ఆందోళనకు సంఘీభావం చాటుతూ రూపొందించిన 'టూల్‌కిట్‌' రూపకర్తలంటూ దిశా రవి అనే పర్యావరణ కార్యకర్త సహా మరికొందరిపై అదే ముద్రవేస్తోంది. ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ 'పొయటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌' టూల్‌కిట్‌ను రూపొందించినట్లు భావిస్తున్న పోలీసులు- అందులో హింసోన్మాద అజెండా ఆనుపానులు నిర్ధారించకుండానే రైతు ఆందోళనకు వత్తాసు పలికినవారిపై ఒంటెత్తున పోతున్నారు. రాజద్రోహ చట్టంతో అసమ్మతిని అణచివేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందంటూ నిరుడు అక్టోబరులో ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు- ప్రభుత్వాలకు కావాలి కనువిప్పు!

ఇవీ చదవండి:

పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా..

దేశ సమైక్యత సమగ్రతలకు ముప్పు ముంచుకొచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వాల చేతి వజ్రాయుధం కావాల్సిన రాజద్రోహ చట్టం- అసమ్మతి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంగా భ్రష్టుపడుతోంది. 'ముఖ్యమంత్రి లంచం తీసుకొన్నాడని ఆరోపించారే అనుకొన్నా- దానికీ రాజద్రోహానికీ సంబంధం ఏమిటి?' అని న్యాయ పాలికే సూటిగా ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ విధానాల్నీ చర్యల్నీ ఎంత కటువుగా విమర్శించినప్పటికీ అది ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకే వస్తుందన్న సుప్రీంకోర్టు- రాజద్రోహ కేసులకు గీటురాయి కాగల లక్ష్మణ రేఖల్ని లోగడే నిర్ధారించింది. దానికి ప్రభుత్వాలు, రక్షక భట వ్యవస్థ కట్టుబడకపోబట్టే కొన్నేళ్లుగా పాశవిక చట్టం పౌరస్వేచ్ఛను కబళించే స్థాయిలో బుసలు కొడుతోంది. దేశంలో పెరిగిపోతున్న మూక దాడుల్ని, అసహనాన్ని నియంత్రించాలంటూ భారత ప్రధానికి అభ్యర్థన లేఖ రాసిన 42మంది లబ్ధ ప్రతిష్ఠులపైనా రాజద్రోహం కేసులు బనాయించేంతగా పరిస్థితి విషమించింది. కాలదోషం పట్టిన రాజద్రోహ చట్టానికి 2009లో కొరత వేసిన బ్రిటన్‌- అసమ్మతిని కాలరాసేందుకు ఆ పాశవిక శాసనాన్ని అమలు చేస్తున్న దేశాలు మరేమాత్రం తమను వేలెత్తి చూపలేవని స్పష్టీకరించింది.

ప్రభుత్వాలు గుర్తించి..

బ్రిటిషర్ల జమానాలో ఆ రాజద్రోహ శాసనాలకు ఎదురొడ్డి ఆత్మబలిదానాలతో స్వాతంత్య్రం పొందిన భారతావనిలో ఏడు దశాబ్దాల తరవాతా అవే క్రూర చట్టాల పీడన- జాతి గౌరవాన్నే పలుచన చేస్తోంది. ఒక హక్కుగా అధికార స్థానాల్లోని వారిని ప్రశ్నించడం, విమర్శించడం, హింసకు తావులేని పంథాలో ప్రజా ప్రతినిధుల్ని, ప్రభుత్వాల్నీ మార్చేయడం- ఇదీ ప్రజాస్వామ్య సారం. కేదార్‌నాథ్‌, బల్వంత్‌ సింగ్‌ కేసుల్లో 'సుప్రీం' ఇచ్చిన మార్గదర్శకాల్ని ప్రభుత్వాలు పెడచెవిన పెట్టడమే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తోంది. అహింసాయుతంగా అసమ్మతి తెలిపే హక్కు ఎవరి దయాధర్మమో కాదని, అది రాజ్యాంగ ప్రసాదితమని ప్రభుత్వాలు గుర్తించాల్సిన సమయమిది!

ఇవీ చదవండి:

'టూల్​కిట్​' కేసులో నికితకు ముందస్తు బెయిల్​

'టూల్​కిట్'​ అరెస్టులపై రాజకీయ రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.