ETV Bharat / opinion

ఓటర్ల వేటలో 'హల్వా' మేనిఫెస్టోలు

author img

By

Published : Mar 18, 2021, 7:47 AM IST

Tamil Nadu parties manifesto seems like making a tasty halwa for voters
ఓటర్ల వేటలో 'హల్వా' మేనిఫెస్టోలు

ఓట్లు పడాలంటే నోట్లు పంచాలన్నది నిన్నటితరం నమ్మకం. నోట్లతో పాటు నోరూరించే హామీలూ గుప్పించాలన్నది నేటి మేటి నాయకశ్రేణుల అనుభవజ్ఞానం. తమిళనాట అమ్మ దయతో కుర్చీలెక్కిన అధికార పక్ష అన్నలు, ప్రతిపక్ష డీఎంకే హామీలు చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది.

ఎందుకండీ నవ్వుతున్నారు? ఓహో.. అన్నాడీఎంకే ప్రకటించిన 'ఓటుకు వాషింగ్‌ మెషిన్‌' పథకం గురించా? ఏముంది ఇందులో అంతలా నవ్వుకోవడానికి? కారు కొంటే ఫ్రిజ్‌ ఉచితం.. ఫ్రిజ్‌ కొంటే జ్యూసర్‌ ఉచితమంటున్నప్పుడు- ఓటేస్తే వాషింగ్‌ మెషిన్‌ ఉచితమంటే తప్పేముంది? అంటే... వ్యాపారానికో నిబంధన, రాజకీయానికో నియమమా? ఇదెక్కడి అన్యాయమండీ! అసలు వ్యాపారస్తులతో పోలిస్తే రాజకీయ నాయకులు ఎందులో తక్కువ? కొనుగోలుదారులకు గరికో పరకో ఉచితంగా ఇచ్చేవారి కంటే.. ఎదురు కట్నాలిచ్చి మరీ ఓట్లు కొనుక్కునే వాళ్లెంత గొప్పవారు! ఆ ధర్మప్రభువుల దయాగుణానికి దండం పెట్టాల్సింది పోయి- పరిహాసాలు చేయడం మర్యాదస్తుల లక్షణమేనా?

ప్రజాసేవలో పండిపోయిన పెద్దల దృష్టిలో ఎన్నికల హామీలంటే... హల్వా పళ్లాలే! మేనిఫెస్టో రూపకల్పన అంటే హల్వా వండటమే! దినుసులన్నీ సరిగ్గా పడి రుచి కుదిరిందా.. ఓట్లు వరదలై పారతాయి. ఓటర్లతో లొట్టలేయించి వారిని బుట్టలో వేసుకునే ఈ హల్వా మేనిఫెస్టోలే మన ప్రజాస్వామ్య కీర్తికిరీటంలో కలికితురాళ్లు! వీటి తయారీలో చెయ్యితిరిగిన మన పార్టీల ప్రతిభ ముందు పిట్టలదొరలూ దిగదుడుపే!.

'అమ్మ' దయతో కుర్చీలెక్కి...

ఎన్నికల పండగను పురస్కరించుకుని ఓటర్లకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించడంలో తమిళనాడు నాయక నలభీములతో పోటీపడేవారే లేరు. కలర్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌లతో మొదలైన వారి వడ్డన ఇప్పుడు ఇంటింటికీ వాషింగ్‌ మెషిన్లు, ఉచిత డేటాల వరకు వచ్చింది. 'అమ్మ' దయతో కుర్చీలెక్కిన అధికారపక్ష 'అన్నలు' ఈసారి ఆడపడుచులకు పుట్టింటి కట్నంగా వాషింగ్‌ మెషిన్లు కొనిస్తామంటున్నారు. ఏడాదికి ఆరు ఉచిత గ్యాసుబండలతో పాటు సోలార్‌ స్టవ్‌లనూ ఇంటికి పంపిస్తామంటున్నారు. వీటన్నింటికీ మించి ఏకంగా బంగారమే పెడతామంటున్నారు. ఎంత మంచి అన్నయ్యలు! ఇలా చెమటోడ్చి మరీ రాష్ట్రం అప్పులను ఆరు లక్షల కోట్ల దాకా తీసుకొచ్చిన వారు, కావాలంటే ఇంకో అరవై లక్షల కోట్ల అప్పులు చేసైనా సరే- ఈ పెట్టుపోతల్లో ఏ లోటూ రానివ్వరు!

అధికారపక్షమేనా అన్నీ పెట్టేదీ... మేమూ పులిహోర కలపగలమంటూ రంగంలోకి దిగింది ప్రతిపక్ష డీఎంకే. ఏకంగా అయిదొందల హామీలతో 'ఫ్యామిలీ ప్యాక్‌' ప్రకటించింది. వాటిలో ముఖ్యమైంది... గృహిణులకు నెలకు వెయ్యి రూపాయలిస్తామన్న వాగ్దానం! దీన్ని చూడగానే 'లోకనాయకుడి' పార్టీ లబోదిబోమంది. ఈ 'రెసిపీ' మీద పేటెంట్‌ హక్కులు మావే... మీ పేరెలా వేసుకుంటారంటూ వెర్రి ఆవేశం తెచ్చుకుంది. నిజానికి కమలహాసనుడు ఉదారంగా ప్రసాదించిన వరమేమిటంటే... వారి పార్టీ అధికారంలోకి వస్తే గృహిణులకు జీతమిస్తారట! ఎన్ని పని గంటలకు ఎంత వేతనమన్నది వారు చెప్పలేదు. అన్నట్టు జీతభత్యాలనగానే హాజరుపట్టికలు తప్పనిసరి కదా! అంటే గృహిణులందరికీ బయోమెట్రిక్‌ ఐడెంటిటీ కార్డులిస్తారో ఏమిటో మరి! ఇలాంటి సృజనాత్మక హామీలకు మరికొన్ని కలిపితే బాగుండేది. చంటిపిల్లలకు చంద్రమండలం మీద ఉయ్యాలలు కట్టిస్తాం, సకుటుంబ పరివార సమేతంగా అంతరిక్ష యాత్రలకు పంపిస్తాం లాంటివి ఏవైనా ప్రకటించాల్సింది. ఇంకా కొత్తగా ఉండేది!! కనీసం మధ్యతరగతి వారికి 'సులభ వాయిదాల్లో సొంత విమానాలు' అనైనా చెప్పి ఉండాల్సింది. హల్వా రుచీ అమోఘంగా ఉందని చెప్పుకొనేవారందరూ!!

కేరళలో మరోలా...

తమిళనాడు నుంచి అటు కేరళ వెళ్తే.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తనకు తానే మార్కులేసుకుంటున్నారు. 2016 ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో 570 నెరవేర్చేశామని చెప్పేశారు. ఆయన చెప్పారంటే చేసేసినట్టేనని అనుచరులు స్తుతికైవారాలు పాడుతున్నారు. నిజమేమిటో ఆ అనంత పద్మనాభుడికే తెలియాలి!. వచ్చే అయిదేళ్లలో యువతకు 20 లక్షల కొత్త ఉద్యోగాలిస్తామంటున్న అధికార పక్షం ఇప్పటికే ఆ పని చేసేసి ఉంటే వద్దనేవారెవరు?. అంతేలెండి.. ఊరించడానికి ఏదో ఒకదాన్ని అట్టిపెట్టుకోకపోతే ఓట్లెలా పడతాయి?

ఇక.. అలా తూర్పువైపు తిరిగితే ఏటా అయిదు లక్షల ఉద్యోగాలు, కుర్రాళ్లకు క్రెడిట్‌ కార్డులు వంటి హామీలతో మమతా బెనర్జీ బంగాలీ బాబులకు రంగుల చిత్రమే చూపించేశారు. అదే ఊపులో ప్రతిపక్షాలు ఇంకాస్త రెచ్చిపోయి సృజనాత్మక హామీలతో జనానికి పగటి పూటే నక్షత్రాలను దర్శింపజేసినా ఆశ్చర్యంలేదు. ఏది ఏమైనా- ఎన్నికలంటే ఎన్ని కలలు.. ఎందరి నేతల ఆశలు? అవి తీరాలంటే ఓటర్లకు బెల్లంముక్కలు తినిపించాల్సిందేనని తీర్మానించుకుని మరీ తెగ పెడుతున్నారు. కానీ, తీపి మరీ ఎక్కువైనా వెగటు పుడుతుందన్న విషయం వారికి తెలుసో లేదో!.

- శైలేష్‌ నిమ్మగడ్డ.

ఇదీ చదవండి:ఒకే స్థానంలో 1000కి పైగా నామినేషన్లతో రైతుల నిరసన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.