ETV Bharat / opinion

ఐటీ రంగంలో భద్రత కరవు.. మూన్​లైటింగ్​పై ఉద్యోగుల ఆసక్తి

author img

By

Published : Dec 6, 2022, 7:51 AM IST

Updated : Dec 6, 2022, 10:16 AM IST

moonlighting in india
moonlighting

ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో 'మూన్‌లైటింగ్‌' తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే సమయంలో, లేదా విధులు ముగిసిన తరవాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ ఈ ఏడాది ఆగస్టులో తీసుకొచ్చిన విధానంతో 'మూన్‌లైటింగ్‌' బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పనివేళలు ముగిసిన తరవాత లేదా వారాంతాల్లో తమ సిబ్బంది ఇతర విధులు నిర్వర్తించేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదన్నది దాని సారాంశం. ఐటీ సంస్థలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. రెండేళ్ల కిందట కరోనా విజృంభణ తరవాత సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ సంస్థల్లో ఇంటి నుంచి పని సంస్కృతి అనివార్యమైంది.

పర్యవేక్షణ లేకపోవడం, తగినంత స్వేచ్ఛ లభించడంతో ఆయా సంస్థల ఉద్యోగులు పార్ట్‌టైం లేదా ఫుల్‌టైంతో రెండో ఉద్యోగం వెతుక్కోవడం మొదలుపెట్టారు. ఐటీ, దాని ఆధారిత సంస్థల్లో ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో 65శాతం రెండో చోట పూర్తికాలం లేదా కొంత సమయం ఉద్యోగం చేయడమో లేదా కొలువుల వేటలో ఉన్నట్లు కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అధ్యయనంలో తేలింది.

.

భిన్న అభిప్రాయాలు
నైపుణ్యాలు పెంచుకోవడానికి, మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయాలు భరించలేకే తాము మూన్‌లైటింగ్‌ బాట పడుతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. దానివల్ల కంపెనీ రహస్యాలు పోటీ సంస్థలకు చేరే అవకాశం ఉందని ఐటీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఐటీ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. చాలా సంస్థలు తమ పనితీరుకు అనుగుణంగా ఉద్యోగులను మలచుకుంటాయి. అవసరమైతే శిక్షణ ఇచ్చి కోడింగ్‌లో నిపుణులుగా తీర్చిదిద్దుకుంటుంటాయి.

ఈ క్రమంలో తమ వద్ద విధులు నిర్వర్తిస్తూనే ఉద్యోగులు మరో కొలువు చేయడంపై చాలా సంస్థలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఒక ఉద్యోగి రెండుచోట్ల పనిచేయడం వల్ల భారం ఎక్కువై వారిలో సామర్థ్యం దెబ్బతింటుందని భావిస్తున్నాయి. అందుకే విప్రో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థలు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న ఉద్యోగులను భారీస్థాయిలో తొలగించాయి. కొందరికి హెచ్చరికలు జారీ చేశాయి. ఒక ఉద్యోగి వేర్వేరుచోట్ల పని చేయడం కంపెనీని మోసగించడమేనని విప్రో ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ పరుషంగా ట్వీట్‌ చేశారు.

ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ మాత్రం ఆ వాదనతో విభేదించారు. దీన్ని మోసంగా పరిగణించలేమని, సంస్థ పనిపై ప్రభావం పడనంతవరకు మూన్‌లైటింగ్‌ తప్పు కాదని ఆయన వ్యాఖ్యానించారు. టెక్‌మహీంద్రా సీఈఓ సీపీ గుర్నానీ సైతం ఉద్యోగులు వేరేచోట్ల పని చేయడం పట్ల తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. స్విగ్గీ మానవ వనరుల విభాగాధిపతి గిరీష్‌ మీనన్‌ ఓ అడుగు ముందుకేసి మూన్‌లైటింగ్‌ను భవిష్యత్తులో తప్పనిసరయ్యే ప్రక్రియగా అభివర్ణించారు.

ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (నైట్స్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు హర్పీత్‌ సింగ్‌ సలూజా వంటివారు మూన్‌లైటింగ్‌ను సమర్థిస్తున్నారు. అదనపు పనివేళలకు సరైన వేతనం లభించనప్పుడు, సంస్థలు ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించనప్పుడు తమకు ఇతర సంస్థల్లో పనిచేసుకునే హక్కు ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

అదనపు ఆదాయం, నైపుణ్యాలు పెంచుకోవడానికే మరో ఉద్యోగం తప్ప సంస్థలను మోసగించే ఉద్దేశం మూన్‌లైటింగ్‌లో లేదన్నది ఉద్యోగ సంఘాల వాదన. అయితే, ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఒకే సమయంలో వేర్వేరు చోట్ల విధులు నిర్వర్తించడం నిషిద్ధం. గతంలో ఇలాంటి కేసుల్లో ఉద్యోగులను విధుల నుంచి తొలగించడాన్ని న్యాయస్థానాలు సమ్మతించాయని మానవ వనరుల విభాగం నిపుణులు గుర్తు చేస్తున్నారు.

వాస్తవంగా ఐటీ కంపెనీలకు ఈ నిబంధన వర్తించదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన చట్టాలు అమలులో ఉన్నందువల్ల సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగించినా వాళ్లు న్యాయస్థానాల్లో సవాలు చేసే అవకాశం ఉంటుంది. మూన్‌లైటింగ్‌ సమస్య తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సైతం ఆమధ్య స్పందించారు. ఎవరికీ ఇబ్బంది కలగనంతవరకు ఒక ఉద్యోగి రెండు ఉద్యోగాలు చేయడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు.

అదే పరిష్కారం
మూన్‌లైటింగ్‌ అంశంలో ఎవరి వాదనలు వారికి సబబుగానే అనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అది నైతికమా, అనైతికమా అనే కోణంలో ఇండీడ్‌ అనే సంస్థ ఇటీవల ఒక అధ్యయనం జరిపింది. అందులో 81శాతం ఉద్యోగులు మూన్‌లైటింగ్‌ను అనైతికంగానే భావించారు. కొరవడిన ఉద్యోగ భద్రత, అదనపు ఆదాయం, ఖర్చుల భారం వంటి వాటి వల్ల మరో ఉద్యోగం చేస్తున్నట్లు చాలామంది చెప్పారు. ఉద్యోగంలోకి తీసుకుంటున్న సమయంలోనే తమ సంస్థలో మూన్‌లైటింగ్‌ నిషిద్ధమని తెలియజేస్తూ ఆ మేరకు సంస్థలు ఉద్యోగుల నుంచి ఒప్పంద పత్రం తీసుకుంటే ఎలాంటి చిక్కులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

-శ్రీనివాస్‌ బాలె

Last Updated :Dec 6, 2022, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.