ETV Bharat / opinion

కరోనాతో కుదేలైన ఆర్థికానికి ఉద్దీపనే ఆలంబన!

author img

By

Published : May 11, 2020, 8:44 AM IST

కరోనా మహమ్మారి అన్ని రంగాలను పాతాళానికి నెట్టింది. కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుందన్న అంచనాల దరిమిలా ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించటమే ఇక ప్రభుత్వాల ముందున్న పని. కరోనా పీడ విరగడ అయ్యేలోగా దేశార్థికం కోమాలోకి జారిపోకుండా సకల జాగ్రత్తలతో కాచుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే!

EENADU EDITORIAL
కరోనాతో కుదేలైన ఆర్థికానికి ఉద్దీపనే ఆలంబన!

ఎంత కాలమిలా పారిశ్రామిక సేవారంగాల్ని సుప్త చేతనావస్థలో ఉంచడం? ఇదే- కొవిడ్‌కు మందో మాకో కనిపెట్టేదాకా దానితో సహజీవనం తప్పదన్న నిజాన్ని గ్రహించిన నేతాగణాల మష్తిష్కాల్ని తొలుస్తున్న ధర్మసంకటం! కరోనా సంగతేమోగానీ, ఆకలితో పోయేటట్లున్నామన్న వలస శ్రామికుల మౌనరోదన, 27 శాతం దాటిన నిరుద్యోగిత, ముంచుకొచ్చిన మాంద్యంలో మనుగడ ఎట్లాగన్న పరిశ్రమల ఆందోళన- ఏడు వారాల లాక్‌డౌన్‌లో దేశార్థిక రంగ దుస్థితిని కళ్లకు కడుతున్నాయి.

భద్రతే ప్రాధాన్యం..

ఆర్థిక రంగంలో ఈ ప్రమాదకర స్తబ్ధతను ఛేదించేందుకే నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ తరవాత తయారీ రంగ పరిశ్రమల పునఃప్రారంభానికి అనుసరించాల్సిన మార్గదర్శకాల్ని వెలువరించింది. తొలివారమే అధికోత్పత్తి లక్ష్యాలపై దృష్టి పెట్టకుండా భద్రతాప్రమాణాల్ని కచ్చితంగా పాటించాలన్న సూచనకు తలఒగ్గాల్సిందే. అదే సమయంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేతనూ క్రమ పద్ధతిలో ప్రాధాన్య ప్రాతిపదికన ఆయా పరిశ్రమలవారీగా వ్యూహాత్మకంగా చేపట్టాల్సిందే!

భిన్న పరిశ్రమలకు సరఫరా గొలుసులు ఎక్కడికక్కడ తెగిపోయిన వైనాన్ని, నిపుణ శ్రామికులు సొంతూళ్లకు వెళ్లిపోయిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని- స్థానిక అవకాశాలు, అవసరాల్ని పరిగణించాలి. భౌతికదూరం వంటి జాగ్రత్తల్ని కచ్చితంగా పాటించగలిగే యూనిట్లను గుర్తించడం, ఆర్థికంగా కుంగిన ఎంఎస్‌ఎంఈలకు ప్రాణవాయువులు అందించడం నిష్ఠగా జరగాలి.

సర్కారు చేయూత అవసరమే..

లాక్‌డౌన్‌ ఎత్తివేతను సమగ్రంగా ఆలోచించి, ముందస్తు నోటీసుతో జాగ్రత్తగా చేపట్టాలన్న భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)- జీడీపీలో ఏడున్నర శాతం (రూ.15లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని కోరుతోంది. పారిశ్రామిక సేవారంగాలు సంపూర్ణంగా కుంగి, సరఫరా గిరాకీలు రెండూ పడకేసిన అసాధారణ ఆర్థిక ఆత్యయిక స్థితిలో కేంద్ర సర్కారు చేయూత అన్ని వర్గాలకు అవసరమని స్పష్టీకరిస్తోంది. లాక్‌డౌన్‌ దెబ్బకు కుదేలైన రంగాల్ని వెంటనే ఆదుకోకుంటే అవి కోలుకోవడం కష్టమన్న సీఐఐ హితోక్తిని మన్నించాలి!

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కొన్నాళ్లకే రూ.1.7లక్షల కోట్ల పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. తదాదిగా మలివిడత ఆర్థిక ఉద్దీపనపై ఫిక్కీ, అసోచామ్‌ వంటి వాణిజ్య సంఘాలతో పాటు విఖ్యాత ఆర్థికవేత్తలూ ఎన్నెన్నో సూచనలు చేసినా ఫలితం లేకపోయింది. బ్రిటన్‌ తన జీడీపీలో 15శాతాన్ని, అమెరికా 10శాతాన్ని ఆర్థిక ఉద్దీపనగా ప్రకటించాయంటున్నా ఆ లెక్కలు ఇక్కడ వర్తించబోవన్న ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్‌- పన్నులు జీడీపీ నిష్పత్తిలోనే కేంద్రం కురిపించే ఔదార్యం ఉండాలంటున్నారు.

మొన్న జనవరినాటికి దేశీయంగా వ్యాపారసంస్థలకిచ్చిన రుణ వితరణ రూ.64.45లక్షల కోట్లు; అందులో ఎంఎస్‌ఎంఈల వాటా రూ.17.75లక్షల కోట్లు. జనవరిలో బడా కార్పొరేట్ల నిరర్థక ఆస్తులు 19.7శాతమైతే, సూక్ష్మ పరిశ్రమల ఎన్‌పీఏల వాటా కేవలం తొమ్మిది శాతం. దేశంలో ఆరుకోట్ల 30లక్షలకు పైబడిన ఎంఎస్‌ఎంఈలు కరోనా తాకిడికి రెక్కలుతెగిన జటాయువులయ్యాయని కేంద్ర మంత్రే చెబుతున్నారు.

ఏం చేయాలి..?

రుణ పరిరక్షణ పథకంద్వారా- ఎంఎస్‌ఎంఈలు తీసుకునే అప్పులో 60-70శాతానికి ప్రభుత్వం పూచీ పడాలని సీఐఐ సూచిస్తోంది. నిరుపేదల జీవికకు భరోసా ఇచ్చేలా మరో రెండు లక్షల కోట్ల రూపాయల ప్రత్యక్ష నగదు బదిలీకి సర్కారు సిద్ధం కావాలంటోంది. ఎంతగానో చితికిపోయిన వైమానిక, పర్యాటక, ఆతిథ్యరంగాల వంటివాటికి దన్నుగా రూ. 1.4-1.6 లక్షల కోట్లతో నిధి ఏర్పాటు, వ్యవస్థలో గిరాకీ పెంచేలా మౌలిక సదుపాయాల కల్పనపై రూ.4 లక్షల కోట్ల వ్యయం, పారిశ్రామిక రుణ అవసరాలు తీర్చేలా బ్యాంకులకు రూ.2 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ వంటివీ అవశ్యం పరిశీలించాల్సినవే. కరోనా పీడ విరగడ అయ్యేలోగా దేశార్థికం కోమాలోకి జారిపోకుండా సకల జాగ్రత్తలతో కాచుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.