ETV Bharat / opinion

గ్రామీణ వికాసమే ఆత్మనిర్భర్​ భారత్​కు వెన్నుదన్ను!

author img

By

Published : Aug 19, 2020, 8:06 AM IST

దేశ జనాభా నానాటికీ పెరిగిపోతోంది. పంచవర్ష ప్రణాళికలు గ్రామీణ వికాసానికి తగిన వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైపోగా.. పొట్టచేత పట్టుకొని పట్టణాలకు అభాగ్యుల వలసలు పోటెత్తడంతో- నగరాలూ నరకానికి నకళ్లుగా మారిపోతున్నాయి. నగరాలతో పాటు గ్రామ స్వరాజ్యానికి కృషికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

EENADU EDITORIAL
ఆత్మనిర్భర్​ భారత్​

జాతి ఆత్మ పల్లెపట్టుల్లో ఉందంటూ గ్రామ స్వరాజ్యంతో భావి భారత భాగ్యోదయాన్ని స్వప్నించారు మహాత్మాగాంధీ. పేరుగొప్ప పంచవర్ష ప్రణాళికలు గ్రామీణ వికాసానికి తగిన వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైపోగా, పొట్టచేత పట్టుకొని పట్టణాలకు అభాగ్యుల వలసలు పోటెత్తడంతో- నగరాలూ నరకానికి నకళ్లుగా మారిపోతున్నాయి. 2011లో 121 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036నాటికి మరో పాతిక శాతం పెరిగి 152 కోట్లకు చేరుతుందని, అప్పటికి పట్టణవాసుల సంఖ్య 31.8నుంచి 38.2 శాతానికి పెరుగుతుందని జాతీయ జనాభా సంఘం సారథ్యంలోని సాంకేతిక బృందం తుది నివేదిక పేర్కొంది.

2011-21 దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు అత్యల్పంగా 12.5 శాతంగాను, తదుపరి దశాబ్దిలో మరింత తగ్గి 8.4శాతంగానూ నమోదవుతుందన్న నివేదిక- 2031లో జన సంఖ్యపరంగా ఇండియా చైనాను అధిగమిస్తుందని అంచనా వేస్తోంది. 2011-36 నడిమికాలంలో మొత్తం జనాభా 31.1 కోట్లు పెరిగితే, పట్టణ జన సంఖ్యలో ఎదుగుదలే 21.8 కోట్లు ఉంటుందన్న నివేదికాంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2036నాటికి కేరళ, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, మహారాష్ట్రల్లో నగరీకరణ 50శాతం మించిపోతుందని, ఆంధ్రప్రదేశ్‌లో 2011లో 30.6శాతంగా ఉన్న పట్టణ జనాభా అప్పటికి 42.8 శాతానికి చేరుతుందన్నది నివేదిక సారాంశం.

గ్రామాల్లో నిస్తేజం..

కేవలం రెండు శాతం భూభాగానికే పరిమితమైన నగరాలూ పట్టణాలు స్థూల దేశీయోత్పత్తిలో 70శాతం సమకూరుస్తూ ప్రగతికి చోదకశక్తులుగా ఎదిగాయన్నది వాస్తవం. అదే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న నగరాలు భారీ మురికివాడలకు నెలవవుతున్న నేపథ్యంలో వాటి రూపాంతరీకరణకు స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు వంటి పథకాల ద్వారా కేంద్రం వ్యయీకరించాలనుకొన్న మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలు. అంతంత భూరి మొత్తాలు వెచ్చించినా ఏటికేడు పోటెత్తే జనాభా అవసరాల్ని బట్టి అవి కొరగాకుండా పోయే ప్రమాదం దృష్ట్యా- తక్షణం పట్టాలకెక్కాలి ప్రత్యామ్నాయ ప్రణాళికలు!

‘పేదరికానికి పాదు చేసే పరిస్థితుల్ని నిర్మూలించి, ప్రజలంతా పనిచేసి తమ అవసరాలకు తగినంత సంపాదించుకొనే అవకాశాల్ని సృష్టించ’డమే లక్ష్యంగా 1952లో గాంధీ జయంతి నాడు సమాజ అభివృద్ధి (కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌) మంత్రిత్వ శాఖను కేంద్రంలో కొలువు తీర్చారు. పండిత నెహ్రూ ఆహ్వానం మేరకు ఆ శాఖను చేపట్టిన ఎస్‌కే డే కృషి అవిరళంగా సాగుతుండగానే- 1966లో ఇందిర ఆ శాఖను రద్దు చేసేశారు. పర్యవసానంగా గ్రామాల్లో ఆవరించిన నిస్తేజం- అభివృద్ధికి ఎంత ఆఘాతంగా మారిందీ ఏటికేడు కళ్లకు కడుతూనే ఉంది. విద్య వైద్యం ఉపాధి వినోదం ఆర్థిక అవకాశాలు- ఈ అయిదూ పట్టణాలకు వలసల్ని పురిగొల్పుతున్నాయని లోగడ వెంకయ్య నాయుడు సూత్రీకరించారు.

ఉమ్మడి సౌకర్యాలతో..

ఆయా అవకాశాల్ని పల్లెసీమలకు చేరువ చేస్తే నగరాలపై వలసల జనభారం తగ్గడమే కాదు- గ్రామాలు నవోత్తేజంతో కదం తొక్కుతాయనడంలో సందేహం లేదు. పదహారేళ్ల క్రితం జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలామ్‌ సమర్పించిన ‘పుర’ నమూనా నేటి, రేపటి అవసరాలకు దీటైనది. యాభైనుంచి వంద గ్రామాలను ఒక సముదాయంగా తీర్చి, ఉమ్మడి వసతులు మార్కెట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రగతి ఊపందుకొంటుందని, రోడ్లు విద్యుత్‌ వంటి భౌతిక వసతులతోపాటు సాంకేతిక, విజ్ఞాన, ఆర్థిక వ్యవస్థలతో ఆ సముదాయాన్ని అనుసంధానిస్తే- పట్టణాలకు సరిసాటిగా అభివృద్ధి సాధ్యపడుతుందనీ అబ్దుల్‌ కలామ్‌ ఆకాంక్షించారు.

30 కిలోమీటర్ల చుట్టుకొలతతో రింగ్‌ రోడ్డు నిర్మించి సముదాయంలోని గ్రామాలన్నింటికీ రవాణా సౌకర్యం కల్పిస్తే- సమీప ప్రాంతాలకే వలసలు పరిమితమై పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుందని, పల్లెల్లో ఆదాయవృద్ధి అభివృద్ధికి కొత్త గవాక్షాలు తెరుస్తుందన్న మేలిమి సూచన అమలుకు సమయం మించిపోలేదు. నగరాలూ గ్రామాల సమీకృత ప్రగతే- ఆత్మనిర్భర్‌ భారత్‌కు వెన్నుదన్ను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.