ETV Bharat / opinion

మండుతున్న వంటనూనెలు.. ధరలకు కళ్లెం ఎలా?

author img

By

Published : Apr 8, 2021, 6:32 AM IST

RISING EDIBLE OIL PRICES IN INDIA
వంటనూనెలు

దేశంలో కొద్ది రోజులుగా ఆకాశమేహద్దుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. దేశీయ అవసరాలకు తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవటం, దిగుమతులపైనే ఆధారపడాల్సి రావటం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంతో పాటు మద్దతు ధరలను అందించగలిగితేనే- రైతులు ఈ పంటల సాగుకు ఆసక్తి చూపుతారని గుర్తించాలి.

వంటనూనెల ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో నూనెగింజ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్లో ఆశించిన పురోగతి లేకపోవడంతో ఇప్పటికీ- దిగుమతులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. జనాభా విస్తరణకు అనుగుణంగానే వంటనూనెల వినియోగమూ అధికమవుతోంది. దేశీయ అవసరాలకు తగిన స్థాయిలో నూనెల ఉత్పత్తి జరగడం లేదు. సమస్య ఉద్ధృతమవుతున్న ఈ తరుణంలో దిగుమతి వ్యయం తగ్గించి అయిదేళ్ల కాలావధిలో నూనెగింజల ఉత్పత్తిని రెట్టింపు చేసే దిశగా కేంద్రం కార్యాచరణ అమలుపరచనుంది.

ఫలించని ప్రణాళికలు

ప్రపంచంలో నూనెగింజ పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. మనకున్న సాగు సామర్థ్యంలో నేటికీ 17శాతం విస్తీర్ణంలోనే ఈ పంటలు సాగు చేస్తుండటం గమనార్హం. ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెల్ని దిగుమతి చేసుకుంటున్న దేశమూ (15 శాతం) మనదే. దేశంలో ఈ జనవరి మొదటి నాటికి మొత్తం 18.15 లక్షల టన్నులుగా ఉన్న వంటనూనెల నిల్వలు మార్చి ఒకటి నాటికి 16.90 లక్షల టన్నులకు తగ్గాయి. నిరుటితో పోలిస్తే నిల్వల పరిమాణంలో పెద్దగా మార్పు లేనప్పటికీ కొంత కాలంగా వంటనూనెల ధరల్లో 20-30 శాతం పెరుగుదల నమోదవుతోంది. కొంతకాలంగా పలుమార్లు లీటరుకు రూ.10 చొప్పున పెరుగుతున్న ధరలతో వినియోగదారులు తల్లడిల్లిపోతున్నారు. దేశంలోని మొత్తం సాగు విస్తీర్ణంలో నూనెగింజ పంటలు 13శాతం ఆక్రమిస్తున్నాయి. ప్రధానంగా వేరుసెనగ, సోయా, ఆవాలు, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆయిల్‌పామ్‌, కుసుమ, అవిశె, వలిసె వంటి వంటనూనెలనిచ్చే పంటలను సుమారు 2.8 కోట్ల హెక్టార్లలో వర్షాధారంగా పండిస్తున్నారు. దేశంలోని వ్యవసాయోత్పత్తుల విలువలో ఈ పంటల వాటా 10శాతం. దేశీయ వినియోగంతో పోలిస్తే ఉత్పత్తి తక్కువగా ఉండటం, దాదాపు సగం అవసరాలకు దిగుమతులే శరణ్యం కావడంతో- భారతావని విలువైన విదేశ మారక ద్రవ్యాన్ని అందుకోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. 2022నాటికి నూనెగింజ పంటల విస్తీర్ణాన్ని 3.1 కోట్ల హెక్టార్లకు, ఉత్పత్తిని 4.6 కోట్ల టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.

ఏటా రూ.60వేల కోట్లకుపైగా..

వచ్చే ఏడాది నాటికి దేశంలో వంటనూనెల అవసరాలు 3.3 కోట్ల టన్నులని అంచనా. మొత్తంగా 4.6 కోట్ల టన్నుల గింజల ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోగలిగితే 1.4 కోట్ల టన్నుల నూనె ఉత్పత్తి సాధ్యపడుతుంది. అలాగే ఆయిల్‌పామ్‌, వరి తవుడు, కొబ్బరి, పత్తి నుంచి మరో 0.6 కోట్ల టన్నుల నూనెల ఉత్పత్తి జరుగుతుందని అంచనా. వీటి ఉత్పత్తినీ కలిపితే దేశంలో 1.7 కోట్ల టన్నుల నూనెలే అందుబాటులో ఉంటాయి. అవసరాలతో పోలిస్తే 1.6 కోట్ల టన్నులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. గడచిన దశాబ్ద కాలంలో దేశంలో వంటనూనెల దిగుమతి వృద్ధి సుమారు 175 శాతంగా ఉంది. భారత వ్యవసాయ దిగుమతుల్లో వంటనూనెలదే సింహభాగం. ఇందుకు ఏటా రూ.60వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టాల్సి రావడం దురదృష్టం. ప్రస్తుత నూనెగింజల విస్తీర్ణం సుమారు 2.8కోట్ల హెక్టార్లు, ఉత్పత్తి 3.3 కోట్ల టన్నుల స్థాయిలోనే ఉన్నాయి. మన దేశం ప్రధానంగా ఇండొనేసియా, మలేసియాల నుంచి పామాయిల్‌; అర్జెంటీనా, బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, రష్యాల నుంచి పొద్దు తిరుగుడు, సోయా నూనెల్ని దిగుమతి చేసుకుంటోంది. దేశంలో నూనెగింజల పంటల విషయంలో సగటు ఉత్పాదకత ఇతర దేశాలతో పోలిస్తే తీసికట్టుగా ఉంది. దేశంలో సోయా దిగుబడి హెక్టారుకు 1.19 టన్నులుండగా ప్రపంచ సగటు 2.41 టన్నులు, బ్రెజిల్‌లో అత్యధికంగా 2.80 టన్నులుగా నమోదవుతోంది. వేరుసెనగలో ప్రపంచ సగటు 1.58 టన్నులు, అమెరికా(3.80 టన్నులు)తో పోలిస్తే భారత సగటు (1.41 టన్నులు) అత్యల్పం. పొద్దుతిరుగుడు విషయంలో ఫ్రాన్స్‌(2.42 టన్నులు), ప్రపంచ సగటు (1.37 టన్నులు)తో పోల్చినా భారత్‌ సగటు దిగుబడి (0.83టన్నులు) చాలా తక్కువ. గడచిన పదేళ్ల కాలం పరిశీలించినా- భారత్‌లో నూనెగింజల హెక్టారు సగటు దిగుబడిలో చెప్పుకోదగ్గ పురోగతి లేదు.

RISING EDIBLE OIL PRICES IN INDIA
భారత్​లో నూనె గింజల ఉత్పత్తి, దిగుమతులు

గుదిబండగా మారుతున్న దిగుమతులు

ఈ తరుణంలో దేశంలో నూనెగింజల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడమే సరైన నిర్ణయమని కేంద్రం భావిస్తోంది. తాజాగా ప్రధాని మోదీ సైతం వంటనూనెల దిగుమతుల కోసం ఏటా రూ.60-70 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడం విచారకరమని, దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలంటే స్వయం సమృద్ధి సాధించడమే మార్గమని చెప్పారు. ఈ నెల నుంచి అమలులోకి వచ్చేలా నూనెగింజల జాతీయ మిషన్‌కింద వచ్చే ఆరేళ్లలో రూ.19 వేల కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. దీనిలో భాగంగా తూర్పు భారతంలోని సుమారు 1.01 కోట్ల హెక్టార్లలో ప్రస్తుతం పండిస్తున్న వరి స్థానంలో ఆవాలు, ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) భావిస్తోంది. అలాగే నీటి కొరత నేపథ్యంలో పంజాబ్‌, హరియాణా సహా ఉత్తర భారతంలో వరి, గోధుమ, చెరకు పంటల సాగును తగ్గించి నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ పంటలకు మద్దతు ధరతో పాటు అధికోత్పత్తినిచ్చే వంగడాలను రైతులకు అందించగలిగితే రైతుల్లో ఆసక్తి పెరిగే అవకాశముందని ఐసీఏఆర్‌ చెబుతోంది. అలాగే కేంద్ర సహకారంతో నూనెగింజల ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు ఐసీఏఆర్‌ అయిదేళ్ల ప్రణాళిక రచించింది. నూనెగింజ పంటలకు తోడు చెట్లనుంచి తీసే వంట నూనెలకు సైతం ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముంది. ముఖ్యంగా సిమరుబా, కోకుమ్‌, ఆలివ్‌, మహువా, సాల్‌, వాల్‌నట్‌, అత్తి, జట్రోఫా, జొజోబా వంటి చెట్లను విస్తృతంగా పెంచడం ద్వారా వీటి నుంచి వంట నూనెల్ని ఉత్పత్తి చేయడంపైనా దృష్టి పెట్టాలి. వినియోగదారులు, పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటి ద్వారా ఉత్పత్తిని పెంచగలిగితే దిగుమతులను గణనీయంగా తగ్గించవచ్చు. ముందుగా సంప్రదాయ నూనెగింజ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేలా పరిశోధనల వేగం పెంచాలి. ఆయిల్‌పామ్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు మంచి ధరలిచ్చి ఆయా ప్రాంతాల్లో శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ఆసరా ఇవ్వాలి. గతంలో ఆయిల్‌పామ్‌ రైతులకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడంతో పాటు మద్దతు ధరలను అందించగలిగితేనే- రైతులు ఈ పంటల సాగుకు ఆసక్తి చూపుతారని గుర్తించాలి.

- అమిర్నేని హరికృష్ణ

ఇదీ చూడండి: దేశీయ దిగుబడి పెంచితేనే నూనె ధరలు దిగొచ్చేది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.