ETV Bharat / opinion

సాధికార చట్టం వెలుగునీడలు- స.హా.కు 15 ఏళ్లు

author img

By

Published : Oct 12, 2020, 7:32 AM IST

right to information act latest news
సాధికార చట్టం వెలుగునీడలు- స.హా.కు 15 ఏళ్లు

సమాచార హక్కు చట్టానికి 15 వసంతాలు పూర్తయ్యాయి. వైరుధ్యాలకు తావులేని విధంగా ప్రపంచంలోనే అత్యంత పారదర్శకంగా రూపొందించిన ఈ చట్టంతో పౌరులకు సమాచారం అందించడానికి ఓ యంత్రాంగం తయారైంది. చట్టాన్ని శక్తిమంతంగా ఉపయోగించవచ్చనే చైతన్యం క్రమంగా ప్రజల్లో పెరిగింది. అయితే అవినీతి అధికారులకు మాత్రం ఇది కంటగింపుగా మారింది. సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అప్పీలు చేసుకునే అవకాశాన్ని ఆర్‌టీఐ చట్టం కల్పించకపోయినా, వ్యవహారాన్ని కోర్టులకు తీసుకెళుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సమాచార కమిషన్‌ నిర్ణయాలపై కోర్టుల్లో రిట్‌ పిటిషన్లు వేస్తున్నారు. చాలా కీలకమైన అంశాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను నిరాకరించడం జరుగుతోంది.

సరిగ్గా పదిహేనేళ్ల క్రితం- 2005 అక్టోబరు 12వ తేదీన విజయదశమి నాడు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) చట్టం అమలులోకి వచ్చింది. భారత ప్రజాస్వామ్య పరిణామంలో ఈ చట్టం కీలక ఘట్టమవుతుందని అప్పట్లో అంతా ఆశించారు. భారత ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను ఆర్‌టీఐ చట్టం సరిదిద్ది, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతుందని విజ్ఞులైన పౌరులు భావించారు. 1990లలో ప్రముఖ మహిళా రాజకీయవేత్త అరుణా రాయ్‌ నాయకత్వంలో రాజస్థాన్‌లోని దేవ్‌ దుంగ్డి గ్రామంలో మొదలైన ఆర్‌టీఐ ఉద్యమం, ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన చట్టం రూపకల్పనకు దారితీసింది. భారత రాజ్యాంగంలోని 19 (1)ఎ అధికరణ పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను, ప్రచురణ హక్కు, సమాచారం పొందే హక్కులను ప్రసాదిస్తోందని 1975 నుంచి ఇచ్చిన పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వీటిలో భావ ప్రకటన, ప్రచురణ హక్కుల గురించి అందరికీ అవగాహన ఉంది. అవి నానాటికీ శక్తిమంతంగా అమలవుతున్నాయి కూడా. కానీ, పౌరులకు సమాచారం అందించడానికి ఒక యంత్రాంగమేదీ లేకపోవడంతో సమాచార హక్కు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. 2005నాటి ఆర్‌టీఐ చట్టం ఈ లోపాలను సరిదిద్ది సమాచారం పొందడానికి ప్రమాణాలు, పద్ధతులను ఖరారు చేసింది. ఆర్‌టీఐ ఉద్యమ కార్యకర్తలు అందించిన సలహాలు, సమాచారం ఆధారంగా సముచిత నిబంధనలను ఆర్‌టీఐ చట్టంలో పొందుపరిచారు.

వెల్లివిరిసిన చైతన్యం

ప్రజాస్వామ్యంలో కార్యాచరణకు పారదర్శకత ఉండాలని, అవినీతిని ఎక్కడికక్కడ అరికడుతూ, తప్పొప్పులకు ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్‌టీఐ చట్టం పీఠిక పేర్కొంటోంది. అయితే, ఈ లక్ష్య సాధనకు ఆచరణపరంగా అడ్డంకులు రావచ్చని, కొన్ని ఘర్షణ పరిస్థితులు ఎదురుకావచ్చని శాసనకర్తలు గ్రహించారు. ఆ వైరుధ్యాలకు తావులేని విధంగా చివరకు ప్రపంచంలోనే అత్యంత పారదర్శక చట్టాన్ని రూపొందించారు. అక్కడి నుంచి దాదాపు ఆరేడేళ్లపాటు ఆలోచనాపరులైన పౌరులు ఆర్‌టీఐ చట్టం గురించి ప్రజల్లో అవగాహన పెంచారు. ఆ చట్టాన్ని శక్తిమంతంగా ఉపయోగించవచ్చుననే చైతన్యం క్రమంగా ప్రజల్లో పెరిగింది. సమాచార హక్కు చట్టం సహాయంతో ప్రభుత్వాన్ని నడిపే మంత్రులు, అధికారులను జవాబుదారీ చేయవచ్చునని, ప్రభుత్వం దారితప్పకుండా నిఘా వేయవచ్చుననీ ప్రజానీకానికి తెలిసివచ్చింది. అనేక కుంభకోణాలను వారు వెలికితీశారు. అధికారులు ప్రజల పట్ల, పాలకులు దేశం పట్ల గౌరవం చూపనారంభించారు. పౌరులకు సాధికారత లభించి రేషన్‌ కార్డులు, రేషన్లు, ఆదాయ పన్ను రీఫండ్‌లు, అనేక ఇతర సేవలు పొందసాగారు. ఈ చట్టం కింద జరిమానాలు కట్టవలసి వస్తుందనే భయంతో ప్రభుత్వాధికారులు ప్రజలు కోరిన సమాచారం ఇవ్వసాగారు.

అవినీతిపరులకు కంటగింపు

సమాచార హక్కు చట్టం చాలా సరళమైనది. గడచిన పదిహేనేళ్లలో దేశమంతటా కొన్ని కోట్ల ఆర్‌టీఐ దరఖాస్తులు దాఖలయ్యాయి. దీన్ని ఉపయోగించడమెలా అన్నది ప్రజలకు ఉచితంగా నేర్పడానికి వేలాది కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే, అధికార స్థానాల్లో ఉన్నవారి నుంచి ఈమధ్య ఆర్‌టీఐకి ప్రతిఘటన ఎదురవుతోంది. ఎదుటివారు పారదర్శకంగా ఉండాలి కానీ, తాము మాత్రం దాపరికానికే ప్రాముఖ్యమిస్తామనే ధోరణి చాలామంది అధికారుల్లో కనిపిస్తోంది. అవినీతిపరులు సహజంగానే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారు. అదేసమయంలో నిజాయితీపరులు ఆర్‌టీఐ పేరిట తమను అనవసరంగా అనుమానిస్తారా అని ఆగ్రహిస్తారు. అధికార కేంద్రాల్లో అత్యధికం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఈ చట్టానికి వాటినుంచి ప్రతిఘటన పెరుగుతోంది. ఈ చట్టాన్ని వక్రీకరించడమూ ఎక్కువైంది. ఇక్కడ 2011నాటి సీబీఎస్‌ఈ వెర్సస్‌ ఆదిత్య బందోపాధ్యాయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించాలి. ‘ఆర్‌టీఐ చట్టాన్ని జాతీయ సమగ్రత, అభివృద్ధికి భంగం కలిగించడానికి కానీ, పౌరుల మధ్య శాంతిసామరస్యాలను దెబ్బతీయడానికి కానీ దుర్వినియోగం చేయకూడదు. తమ విధులను నిజాయితీగా నిర్వర్తించే అధికారులను బెదరగొట్టడానికీ దీన్ని ప్రయోగించరాదు’ అని ఆ తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించింది. ఈ తీర్పును అడ్డు పెట్టుకుని ఆర్‌టీఐ చట్ట నిబంధనలను ఎగవేయడానికి చాలామంది అధికారులు ప్రయత్నిస్తున్నారు. పదేపదే ఈ తీర్పును ఉటంకిస్తూ తమ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఆర్‌టీఐ చట్టం అమలులో అంతిమ అప్పిలేట్‌ సంస్థలుగా వ్యవహరించాల్సిన సమాచార కమిషన్లు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ కమిషన్ల ముందుకు వచ్చే అప్పీళ్లలో అత్యధికం ఏళ్లతరబడి అతీగతీ తెలియక అపరిష్కృతంగా మగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలు- అధికారులు ఆర్‌టీఐ చట్టాన్ని అమలు చేయకపోయినా తమకేం కాదులే అని ధీమా ప్రదర్శిస్తున్నాయి. సమాచార కమిషన్లు మహా అయితే సమస్య పూర్వాపరాల గురించి వివరాలు ఇవ్వాలని ఆదేశించడంతో సరిపెట్టేస్తున్నాయి.

భవిష్యత్తుపై చర్చోపచర్చలు

కమిషన్‌ రూలింగ్‌ల మీద అప్పీలు చేసుకునే అవకాశాన్ని ఆర్‌టీఐ చట్టం కల్పించకపోయినా, వ్యవహారాన్ని కోర్టులకు తీసుకెళుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సమాచార కమిషన్‌ నిర్ణయాలపై కోర్టుల్లో రిట్‌ పిటిషన్లు వేస్తున్నారు. చాలా కీలకమైన అంశాల్లో ఈ విధంగా పౌరుల ప్రాథమిక హక్కులను నిరాకరించడం జరుగుతోంది. పీఎం కేర్స్‌ ఫండ్‌ తన పనితీరు గురించి సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా... ఆర్‌టీఐ చట్టం కింద ఎటువంటి చర్యా తీసుకొనే వీలు లేకుండా పోయింది. ప్రధానమంత్రితోపాటు ముగ్గురు మంత్రుల పర్యవేక్షణలో నడిచే పీఎం కేర్స్‌ ఫండ్‌ ఈ చట్ట పరిధిలోకి వస్తుంది. అయినా కొవిడ్‌ నివారణకు సంబంధించిన అంశాలపై కానీ, సంబంధిత కొనుగోళ్లపై కానీ సమాచారమివ్వడానికి నిరాకరించింది, కొన్ని సందర్భాల్లో శాసన సభ్యుల నిధుల నుంచి జరిగిన వ్యయానికి సంబంధించిన సమాచారాన్నీ తొక్కిపెడుతున్నారు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజోపయోగ సంస్థలేనని కేంద్ర సమాచార కమిషన్‌ ప్రకటించింది. దీన్ని ఆ పార్టీలు ఏ కోర్టులోనూ సవాలు చేయలేదు. కమిషనర్లు, ప్రజా సమాచార అధికారులు (పీఐఓలు) రాజ్యాంగానికి, చట్టానికి వక్రభాష్యం చెప్పి సమాచారాన్ని నిరాకరిస్తున్నారు.

ఆచరణీయ పద్ధతుల కోసం..

ఈ అస్తవ్యస్తతలో పౌరులు ఆర్‌టీఐ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడటానికి సంఘటితమవుతున్నారు. చట్టం తమకు ఇచ్చిన సాధికారతను గుర్తెరిగి ముందుకు కదలుతున్నారు. ఆర్‌టీఐ పటిష్ఠంగా అమలు కావాలంటే ఏం చేయాలనేదానిపై కొవిడ్‌ కాలంలోనూ వర్చువల్‌ వేదికల ద్వారా చర్చించుకొంటున్నారు. ఈ కొవిడ్‌ కాలంలో ఆర్‌టీఐ ఫిర్యాదులను వర్చువల్‌గా విచారించాలని, సమాచార కమిషనర్లు తమ ముందున్న కేసులను నిర్దిష్ట కాలావధిలో పూర్తిచేసేట్లు ఆదేశాలివ్వాలని కోరుతూ బోంబే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో కొన్ని ఆచరణీయ సూత్రాలు, పద్ధతులు రూపొందే అవకాశం కనిపిస్తోంది. ఆర్‌టీఐకి అడ్డంకులు సృష్టించడమంటే రాజ్యాంగం పౌరులకు ప్రసాధించిన ప్రాథమిక హక్కుకు కూడా ఆంక్షల చట్రాన్ని బిగించడమే. ఇటీవలి కాలంలో అధికంగా దుర్వినియోగమైన హక్కు ఏదైనా ఉందీ అంటే, అది భావ ప్రకటన స్వేచ్ఛేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ.బాబ్డే గతవారం కోర్టులోనే వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ఆర్‌టీఐకి పురోగమనమా లేక తిరోగమనమా అన్నది తేలాల్సి ఉంది.

- శైలేష్ గాంధీ (రచయిత-కేంద్ర సమాచార మాజీ కమిషనర్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.