ETV Bharat / opinion

భారత అంకుర సంస్థలకు సదావకాశం 'ప్రారంభ్‌'

author img

By

Published : Jan 17, 2021, 6:41 AM IST

'ప్రారంభ్‌' సదస్సు భారత్‌లోనూ, ఇతర బిమ్‌స్టెక్‌ దేశాల్లోనూ ఉన్న యువ అంకుర ఔత్సాహికులకు అంతర్జాతీయ అవకాశాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. భారత్‌ జనాభాలో 15-59 ఏళ్ల వయోవర్గం ప్రజలు 62.5 శాతం. పని చేయగల ఈ వయోవర్గం శాతం ఇంకా పెరుగుతోంది. 2036 సంవత్సరం వరకు ఇలా పెరుగుతూ 65 శాతం వద్ద శిఖరస్థాయికి చేరుతుందని ఒక అంచనా. భవిత వైపు భారీ ఆశలతో ముందుకు సాగుతున్న భారత అంకుర సంస్థలకు ఇది చక్కని అవకాశం.

prarambh conclave is an excellent opportunity for Indian start-ups
భారత అంకుర సంస్థలకు సదావకాశం 'ప్రారంభ్‌'

భవిత వైపు భారీ ఆశలతో ముందుకు సాగుతున్న భారత అంకుర సంస్థలకు చక్కని అవకాశమిది. 'స్టార్టప్‌ ఇండియా' కార్యక్రమంపై అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంది. 'బిమ్‌స్టెక్‌' సభ్య దేశాల నడుమ, వాటి ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాల కోసం ఆయా దేశాల పార్లమెంటు సభ్యులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సాంస్కృతిక సంఘాలు, మీడియా సంస్థలు బిమ్‌స్టెక్‌ ఫోరాలను ఏర్పాటు చేసుకోవాలని... 2018 సంవత్సరం నేపాల్‌లో జరిగిన నాలుగో బిమ్‌స్టెక్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా ప్రస్తుత సమావేశం ఏర్పాటైంది. బంగ్లాదేశ్‌, ఇండియా, నేపాల్‌, మయన్మార్‌, భూటాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్న బిమ్‌స్టెక్‌ నేడు ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రధాన వాణిజ్య కూటమిగా ఆవిర్భవిస్తోంది. దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియాలు ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఈ ఆసియాన్‌ వాణిజ్య కూటమి సభ్య దేశాలు అయిన థాయ్‌లాండ్‌, మయన్మార్‌లు కూడా బిమ్‌స్టెక్‌లో సభ్యత్వం తీసుకున్నాయి. సభ్య దేశాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, పౌరసమాజ సంస్థలు నిర్దేశిత లక్ష్య సాధన కోసం కలిసికట్టుగా కృషి చేసే విధానం (‘మల్టీసెక్టొరల్‌ అప్రోచ్‌- ఎంఎస్‌ఏ) ఈ వాణిజ్య కూటమికి ఉన్న ప్రత్యేకత. పొరుగుకు ప్రాథమ్యం (నైబర్‌హుడ్‌ ఫస్ట్‌), ‘యాక్ట్‌ ఈస్ట్‌’ అనేవి మన విదేశాంగ విధానాలు. వీటిని విజయవంతంగా అమలు చేసేందుకు బిమ్‌స్టెక్‌ భారత్‌కు కీలకమైన వేదిక. ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’ (బీఆర్‌ఐ) పేరిట ఈ ప్రాంతంలో చైనా భారీ పెట్టుబడులతో విసిరిన ఉచ్చులో ఇరుగు పొరుగు దేశాలు చిక్కుకోకుండా అడ్డుకోవడానికి భారత్‌కు బిమ్‌స్టెక్‌ కూటమి ఉపకరిస్తుంది. అంతేకాకుండా, కొంతకాలంగా అచేతనంగా మారిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం-సార్క్‌కు ఇది సరైన ప్రత్యామ్నాయం అవుతుంది.

యువ జనాభాతో ప్రయోజనం

ప్రస్తుత 'ప్రారంభ్‌' సదస్సు భారత్‌లోనూ, ఇతర బిమ్‌స్టెక్‌ దేశాల్లోనూ ఉన్న యువ అంకుర ఔత్సాహికులకు అంతర్జాతీయ అవకాశాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. భారత్‌ జనాభాలో 15-59 ఏళ్ల వయోవర్గం ప్రజలు 62.5 శాతం. పని చేయగల ఈ వయోవర్గం శాతం ఇంకా పెరుగుతోంది. 2036 సంవత్సరం వరకు ఇలా పెరుగుతూ 65 శాతం వద్ద శిఖరస్థాయికి చేరుతుందని ఒక అంచనా. పని చేయగలవారి సంఖ్య జనాభాలో ఎంత ఎక్కువగా ఉంటే, ఆర్థిక వృద్ధికి అది అంతగా దోహదపడుతుంది. దీన్నే ‘డెమొగ్రాఫిక్‌ డివిడెండ్‌’ అని వ్యవహరిస్తారు. 2005లో భారత్‌కు ప్రయోజనకారిగా మారిన ‘డెమొగ్రాఫిక్‌ డివిడెండ్‌’ 2055-56 వరకు కొనసాగుతుంది. 2018-19 ఆర్థిక సర్వే ప్రకారం, ఈ వయోవర్గ ఆధారిత ఆర్థిక ప్రయోజనం 2041లో పతాక స్థాయికి చేరుతుంది. అప్పటికి, జనాభాలో 20-59 మధ్య వయోవర్గం 59 శాతం దాకా ఉంటుంది. వయసు మీరుతున్న ప్రపంచంలో యువదేశాలుగా వర్ధిల్లే అతి తక్కువ దేశాల్లో భారత్‌ ఒకటి అవుతుంది.
భారత్‌ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌లలో మానవ వనరులు పెద్దసంఖ్యలో చవకగా లభ్యమవుతాయి. ఇక పశ్చిమ భారత్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక వినియోగదారులతో కిటకిటలాడుతూ వస్తూత్పత్తులకు విపణిగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో వినియోగం రేటు పెరుగుతోంది. పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. తయారీ, వ్యవసాయ రంగాల మీద అధికంగా ఆధారపడుతున్న బంగ్లా ఆర్థిక వ్యవస్థకు శ్రమశక్తి చవకగా లభిస్తోంది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో ఫ్రీలాన్సర్‌ ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. అక్కడ దాదాపు ఆరు లక్షల మంది ఐటీ ఫ్రీలాన్సర్లు ఉన్నారు. ఆ దేశ జనాభాలో యువజనుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) విశ్లేషణ ప్రకారం- నాణ్యమైన విద్య, చక్కటి ఆరోగ్యం, మంచి ఉపాధి ఉన్నప్పుడు, జనాభాలో పనిచేసే వారి సంఖ్య పెరిగినట్లయితే అది ఆర్థిక పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇప్పుడు బిమ్‌స్టెక్‌ దేశాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రారంభ్‌’ సదస్సు... అంకుర సంస్థలు రెక్కవిచ్చు కొనేందుకు అవకాశం కల్పిస్తుంది. అంతర్జాతీయంగా సంబంధాలు నెలకొల్పుకొనేందుకు, ప్రపంచ స్థాయి సంస్థలతో సహకార ఒప్పందాలు కుదుర్చుకొనేందుకు అంకుర సంస్థలకు ఇది మార్గం సుగమం చేస్తుంది.

డిజిటల్‌ అనుసంధానత

అనుసంధానత అంటే రహదారి, రైలు మార్గాలు అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు డిజిటల్‌ అనుసంధానత అత్యంత ప్రముఖంగా మారింది. సాధారణ ప్రజలకు, పరిశ్రమలకు విస్తృత స్థాయిలో వేగవంతమైన అంతర్జాల సేవలు చవకగా అందించేందుకు డిజిటల్‌ నెట్‌వర్క్‌లను సమీకృతం చేయవలసిన అవసరం ఉంది. అదే సమయంలో డిజిటల్‌ అనుసంధానత మున్నెన్నడూ లేనివిధంగా దేశాల హద్దులు చెరిపేస్తున్న తరుణంలో- సైబర్‌ భద్రత, సమాచార పరిరక్షణ, వ్యాపారంలో సాంకేతికత వినియోగం, మేధాసంపత్తి వంటి రంగాల్లో దేశాల పరస్పర సహకారం పెరిగి అటువైపుగా నూతన వ్యాపారాలకు అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ‘ప్రారంభ్‌’ సదస్సు అంకుర సంస్థలకు మంచి వేదిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరొక అంశం... కొవిడ్‌ అనంతర కాలంలో నూతన వాణిజ్య మార్గాలు తెరుచుకుంటున్నాయి. సరఫరా గొలుసులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. వ్యాపార ప్రణాళికలు మారిపోతున్నాయి. బహుళ జాతి పారిశ్రామిక వాణిజ్య సంస్థలు తమ తయారీ స్థావరాల్ని కొత్త ప్రాంతాలకు మార్చే ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటి అంతర్జాతీయ పరిస్థితుల్లో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ మీద అవి దృష్టి సారిస్తున్నాయి. సరఫరా గొలుసు మారుతున్నందువల్ల సరకు రవాణా రంగంలో మరిన్ని కొత్త అంకురాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇక, భారత్‌ సులభతర వాణిజ్య సూచీలోనూ పైకెగబాకుతోంది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా పుంజుకొంటున్నాయి. కొవిడ్‌ అనంతరం, ప్రపంచ విలువ గొలుసులో భారత్‌ స్థానం పటిష్ఠంగా మారుతోంది. ఈ మార్పూ అంకుర సంస్థలు విదేశీ సహకార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరింతగా వీలు కల్పిస్తోంది.

భారీ సంస్థలుగా రూపాంతరం

అంకుర సంస్థల సంస్కృతి మన దేశంలో ఇప్పటికే ఎంతో చైతన్యవంతంగా ముందుకు సాగుతోంది. అనేక అంకుర సంస్థలు ప్రారంభమైన కొద్దికాలంలోనే భారీ కంపెనీలుగా రూపాంతరం చెందాయి. ఇలాంటి సంస్థల విజయవంతమైన అనుభవాలను ఇతర దేశాలు, బిమ్‌స్టెక్‌ సభ్య దేశాలతో పంచుకోవడానికి ప్రారంభ్‌ వేదిక ఎంతగానో ఉపకరిస్తుంది. ఆయా దేశాల్లోని యువ మేధావుల ఆలోచనలు, భావనలు కార్యరూపం దాల్చడానికి ప్రేరణ ఇస్తుంది. అంకుర కార్యకలాపాలకు మన ప్రాంతం ఆకర్షణీయ గమ్యం అవుతుందని చాటిచెప్పేందుకు ప్రారంభ్‌ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఒక సదవకాశాన్ని అందిస్తోంది.

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని (అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.